Kancheepuram
-
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్‌పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.క్షీణించిన విక్రయాలుధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్టైల్ చైన్ ఆర్ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.50 శాతం పెరిగిన ధరలుకాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. -
స్నేహితుడి ఎదుటే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
కాంచీపురం: కళాశాల విద్యార్థినిని బెదిరించి ఆమె స్నేహితుడి ఎదుటే ఐదుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు–పుదుచ్చేరి రహదారి పక్కనున్న ప్రైవేట్ స్కూల్ ఆవరణలో బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడుతోంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు వ్యక్తులు వారిని ముట్టడించారు. చంపుతామని బెదిరిస్తూ స్నేహితుడు చూస్తుండగానే ఆ విద్యార్థినిపై అత్యాచారానికి వడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు, ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
భర్తను పికప్ చేసుకోవడానికి వెళ్తూ.. గుంతను తప్పించబోయి..
చెన్నై: భర్తను పికప్ చేసుకోవడానికి బండి మీద వెళ్తూ.. దారిలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత చెందింది ఓ మహిళ. తమిళనాడులోని కంచీపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరి(37) తన భర్త అరుముగమ్‌ను తీసుకురావడానికి బండి మీద వెళ్తోంది. ఆ సమయంలో రోడ్డు మీద ఓ ట్రాక్టర్ అడ్డు ఉండడం, పైగా ఎదురుగా ఓ గుంత ఉండడంతో ఆమె తప్పించబోయింది. ఈ క్రమంలో పక్కన వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాని కిందపడి అక్కడికక్కడే ఆమె కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న శివకంచి పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా..
సాక్షి, చైన్నై : దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చట్టాలంటే భయంలేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడి.. కిరాతకంగా అంతమొందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి తరహాలోనే.. తమిళనాడు కాంచీపురంలో రోజా అనే యువతి హత్యకు గురైంది. గత శనివారం కనిపించకుండా పోయిన రోజా.. కాలిన గాయాలతో ముళ్ల పొదల్లో శవమై గురువారం కనిపించారు. అయితే రోజా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆండిసిరువలూర్ గ్రామానికి చెందిన భూపతి కుమార్తె రోజా (20) చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూరులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గత శనివారం విధులకు వెళ్లిన రోజా తిరిగి ఇంటికి రాలేదు. రోజా కోసం గాలించిన కుటుంబ సభ్యులకు ఆమె లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెరంబదూరు సిరువాక్కంలో రోజా మృతదేహాం కొయ్యకు వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోజా మృతదేహాన్ని శవపరీక్ష కోసం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోజా ఒంటి కాలిన గాయాలు ఉండటంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజాపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అంతమెందించినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కాంచీపురం–బెంగళూరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కాగా, యువతి మృతదేహాం లభించిన ప్రాంతం ఓ రాజకీయ నాయకుడిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రోజా చివరిసారిగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్‌తో(30) మాట్లాడుతూ కనిపించిందని.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్.. రోజా మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్‌తో రోజాపై దాడికి పాల్పడి.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్లో జస్టిస్ ఫర్ ప్రియాంక, జస్టిస్ ఫర్ ప్రియాంక హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. -
అశ్రునయనాలతో ‘అధిష్టానం’
కంచి మఠంలో కన్నీటి ధారలు కురిశాయి. శిష్యబృందం మూగబోయింది. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు కలవరపడింది. కట్టలు తెంచుకునే దుంఖాన్ని ఆపుకోలేక భక్తులు సాగిలపడి బోరున విలపించారు. వేలాది మంది శిష్యులు, వేదపండితులు, సినీ, రాజకీయ ప్రముఖులు వెంట రాగా అశ్రునయనాల నడుమ శ్రీ జయేంద్ర సరస్వతి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం సరిగ్గా 10.30 గంటలకు మఠం ఆచార, సంప్రదాయాల ప్రకారం మహా సమాధి ప్రక్రియ పూర్తయ్యింది. బుధవారం తెల్లవార్లూ కంచి మఠం కన్నీటి కీర్తనలు ఆలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కంచి కామకోటి పీఠం భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు మండపాల్లో కూలబడి అశ్రునయనాలతో స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రార్థనలు చేశారు. ఆపుకోలేని కన్నీటితో కీర్తనలు ఆలపించారు. ‘మహానుభావా...మళ్లీ రావా’ అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. జయేంద్ర సరస్వతి జీవిత చరిత్ర, ధార్మిక ప్రస్థానాన్ని వివరించే పుస్తకాలను పఠిస్తూ దైవ సంకీర్తన చేస్తూ ముక్తికి మార్గాన్ని అన్వేషించారు. కొంత మంది వేద పండితులు తమ చుట్టూ శిష్యులను కూర్చుండబెట్టుకుని జయేంద్ర సరస్వతి నీతి సూత్రాలను, ధర్మమార్గాలను వివరిం చారు. మధ్య మధ్యలో మఠం నిర్వాహకులు ఇచ్చే హారతులు స్వీకరిస్తూ, గోవింద నామ సంకీర్తనల్లో గొంతు కలుపుతూ రాత్రంతా గడిపారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతిక కాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాదికాలు ప్రారంభం అయ్యాయి. బృందావన ప్రవేశం ఇలా... మొదట స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్దంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, విశేష పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎల్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చుండబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం మహాస్వామిగా చెప్పే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమాధి బృందావన మండపంలోనే ఉంది. దానికి కాస్త దిగువన జయేంద్ర సరస్వతి సమాధికి ఏర్పాట్లు చేశారు. మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ఇందులో పూలు, చందనం, ఇతర సుగంధ ద్రవ్యాలను నింపారు. ఆపైన ఉదయం 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం జరిపారు. కుర్చీతో సహా అలాగే స్వామివారిని గొయ్యిలో కూర్చుండబెట్టి మట్టితో సమాధి చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. ఈ తంతును చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, శిష్యులు ఆసక్తి చూపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు... శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్, మాజీ మంత్రి సదానందగౌడలు కంచి మఠానికి చేరుకుని స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రణమిల్లి ప్రధాని కార్యాలయం భక్తిపూర్వకంగా పంపిన ప్రత్యేక పుష్ఫగుచ్ఛాలను అందజేశారు. తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ స్వామి వారిని కడసారి దర్శించి నివాళులు అర్పించారు. తమిళనాడు బీజేపీ నేతలు సౌందరరాజన్, హెచ్. రాజా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్యన్ తదితరులు స్వామీ వారిని దర్శించిన వారిలో ఉన్నారు. ఆయన ప్రజ్వరిల్లే ధార్మికజ్యోతి.. ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రభోదాలను వివరించే కంచి మఠం ధార్మిక జ్యోతి జయేంద్ర సరస్వతని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆయన డాలర్ శేషాద్రితో కలిసి కంచి శంకర మఠానికి విచ్చేశారు. జయేంద్ర స్వామి భౌతిక కాయాన్ని దర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భక్తిపూర్వకంగా తెచ్చిన వరివట్టం, చందన కట్టలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జయేంద్ర సరస్వతి తిరుమల వచ్చినపుడల్లా ముఖ్యమైన సూచనలు ఇచ్చేవారనీ, శాంత స్వభావం, మృదుభాషిత్వం ఆయన స్వభావమని కొనియాడారు. ఇటీవల తిరుమల యాగానికి వచ్చినపుడు చివరిసారిగా చూశానని చెప్పారు. భక్తుల హృదయాల్లో చిరస్తాయిగా వెలిగే ధార్మిక జ్యోతిగా జయేంద్ర సరస్వతిని అభివర్ణించారు. అత్యంత బాధాకరం... కంచి స్వామి జయేంద్ర సరస్వతి కన్నుమూయడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన కంచి స్వామి భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. (కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
కంచి స్వామి శివైక్యం
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 9 గంటలకు జయేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆయన కొద్ది నెలలుగా శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో మఠం నిర్వాహకులు ఉదయం 7.30 గంటలకు శంకర మఠానికి అను బంధంగా ఉన్న ఆది భగవత్పాద కార్డియాక్ అండ్ డయాలసిస్ (ఏబీసీడీ) ఆస్పత్రికి స్వామీజీని తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స ప్రారంభించిన వైద్యులు 8.30 గంటలకు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్లు ఉదయం 9 గంటలకు ప్రకటించారు. దీంతో దేశ, విదేశాల్లో ఉన్న స్వామీజీ శిష్యులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. స్వామీజీ శివైక్యం విషయం తెలిసిన వెంటనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. స్వామీజీ నేతృత్వంలో సాగిన ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేడు శాస్త్రబద్ధంగా ‘అధిష్టాన’ కార్యక్రమం స్వామీజీ శివైక్యం గురించిన వార్త విన్నంతనే ఆయన శిష్యులు, భక్తజనావళి హుటాహుటిన కంచి మఠానికి తండోప తండాలుగా తరలి వచ్చారు. భక్తుల సందర్శనార్థం స్వామీజీ పార్థివ దేహాన్ని ఆయన మండపంలోనే ఉంచారు. అక్కడి ఏర్పాట్లను మఠం మేనేజర్ సుందరేష్ అయ్యర్, బాల పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రభృతులు పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం వేద ఘోష, విష్ణుపారాయణ, అధిష్టాన పూజ, అభిషేకాల ప్రక్రియ ముగిశాక ‘అధిష్టానం’ (సమాధి) కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. దీనిని ‘బృందావన ప్రవేశ కార్యక్రమం’గా పిలుస్తామని వారు తెలిపారు. కంచి కామకోటి మఠం ఆవరణలో మహాస్వామి చంద్రశేఖరేంద్ర స్వామిని అధిష్టానం చేసిన ప్రదేశం పక్కనే జయేంద్ర సరస్వతి భౌతిక కాయాన్ని కూడా శాస్త్రబద్ధంగా అధిష్టానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంచి మఠానికి 69వ పీఠాధిపతి.. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ఇరుల్నీకి గ్రామంలో 1935 జులై 18న జన్మించిన జయేంద్ర సరస్వతి చిన్నతనంలోనే వేదా«భ్యాసం, వివిధ శాస్త్రాల పఠనం పూర్తి చేశారు. స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్. తన 19వ ఏట అనగా 1954 మార్చి 22న కంచి శంకర మఠానికి చేరుకుని బాలస్వామీజీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో మఠం బా«ధ్యతల్లో ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ ఈయనను తన వారసునిగా శిష్యబృందానికి స్వయంగా పరిచయం చేశారు. 1994లో చంద్ర శేఖరేంద్ర స్వామి కన్నుమూశాక జయేంద్ర సరస్వతి ప్రధాన పీఠాధిపతి బాధ్యతలను చేపట్టారు. హిందూ ధర్మ ప్రచారం, కంచి మఠ విస్తరణ, శిష్య పరంపర అభివృద్ధి, సేవా, ధార్మిక కార్యక్రమాల అమలు, ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలను జయేంద్ర సరస్వతి విస్తృతంగా చేపట్టారు. వివిధ సందర్భాలలో రాజకీయ వివాదాలు, కేసులు చుట్టుముట్టినా వాటిని అధిగమించి శిష్య పరంపరను ఏకతాటిపై నడిచేలా చేశారు. ఆధ్యాత్మిక, విద్యా, వైద్య సంబంధ విభాగాల్లో శంకర మఠం ట్రస్ట్‌ను ఎంతో అభివృద్ది చేశారు. మఠం ని«ధులతో దక్షిణ భారత దేశంలోని ఎన్నో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. విద్యా వ్యవస్థను పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆరాధ్యనీయుడయ్యారు. 1988లో నేపాల్ వెళ్లిన సందర్భంలో అప్పటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర స్వామీజీని ఘనంగా సత్కరించారు. 1998లో స్వామి జయేంద్ర హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్, కైలాసగిరి క్షేత్రాలను సందర్శించారు. ఆదిశంకరాచార్య తరువాత అక్కడికెళ్లిన పీఠాధిపతి ఈయనొక్కరే. 2000లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లిన స్వామీజీ అక్కడున్న తగేశ్వరి ఆలయానికి సొంత నిధులతో స్వాగత తోరణం నిర్మించారు. 2004లో వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసులో ఆరోపణలపై జయేంద్ర అరెస్టవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తరువాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. గత నాలుగేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల కిందట శ్వాస సంబంధ సమస్యలతో చెన్నైలోని రామచంద్రా ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈ మధ్యనే కాంచీపురం చేరుకున్న స్వామీజీ అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
ఏఐఏడీఎంకే నుంచి 58మంది బహిష్కరణ
చెన్నై: అన్నా డీఎంకే పార్టీ నుంచి 50మందికిపైగా నాయకులను పార్టీ అధినాయకులు ఒ.పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామిలు బహిష్కరించారు. క్రమశిక్షణ వేటు పడిన 53మంది పార్టీ కాంచీపురం సెంట్రల్ యూనిట్‌కు చెందినవారు. అలాగే పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగానికి చెందిన ఐదుగురు(అన్నా తోజిర్సంగ పెరవై)ని కూడా బహిష్కరించారు. వారిని అన్ని పోస్టుల నుంచి, ప్రాథమిక సభ్యత్వాల నుంచి తొలగించినట్లు కో ఆర్డినేటర్లు పన్నీరుసెల్వం, పళనిస్వామిలు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన దినకరన్‌కు ప్రధాన శక్తులుగా ఉన్న పలువురిని ఇంతకుముందు కూడా బహిష్కరించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనం
కాంచీపురం సమీపాన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సజీవ దహనమైంది. ఈమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిగా పోలీసులు కనుగొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాంచీ పురం సమీపాన పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం డీఎస్పీ బాలసుందరం, ఇన్స్పెక్టర్ లక్ష్మీపతి, తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం నుంచి పది అడుగుల దూరంలో రైల్వే లైన్‌కు దిగువ భాగాన ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలావుండగా ఆ యువతి వివరాలు రాబట్టారు. ఆమె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని. ఈమె పేరు షకీనా(23). కాంచీపురం సమీపాన గల పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. కళాశాలలోని హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం ఉదయం ఆమె హఠాత్తుగా మాయమైనట్లు తెలిసింది. దీని తర్వాత ప్రస్తుతం శవంగా కనుగొన్నారు. ఆమె కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
కాంచీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
పళ్లిపట్టు, న్యూస్‌లైన్:చిన్నారి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న సంతోషంతో ఇళ్లకు వెళుతున్న బంధువులను మృత్యు వు బస్సు రూపంలో వెంటాడింది. చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కాంచీపురం సమీపంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని కీయ్వెన్పాక్కం గ్రామానికి చెందిన మునుస్వామి(55) కూతురు కార్తికాను తిరువణ్ణామలై జిల్లా చెయ్యారు సమీపంలోని చిదాత్తూర్ గ్రామానికి చెందిన రాజసంతోష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల కొడుకు కార్తీక్రాజ్కు మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మునుస్వామి తన బంధువులతో కలిసి రెండు వ్యాన్లలో చిదాత్తూర్ గ్రామానికి వెళ్లారు. వేడుకలను ముగించుకుని ఆదివారం రాత్రి ఇం టికి తిరుగు ప్రయాణమయ్యారు. కాంచీపురం సమీపంలోని చెవ్విలిమేడు ప్రాంతంలోని పాలారు నది బ్రిడ్జి మీద వెళుతుండగా డీజిల్ అయిపోవడంతో వ్యాన్ ఆగిపోయింది. వ్యాన్‌లో ఉన్న నలుగురు డీజిల్ తీసుకొచ్చి ట్యాంకులో నింపి స్టార్ట్ చేసేందుకు తోశారు. అదే సమయం లో వస్తున్న ప్రైవేటు కర్మాగారానికి చెందిన బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌ను తోస్తున్న శివ(28), శశికుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 19 మందిని పోలీసులు కాంచీపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మునుస్వామి(55), శంకర్ కుమార్తె యోగలక్ష్మీ(3) ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంచీ పురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ పరామర్శించారు. క్షతగాత్రుల్లో వ్యాన్ డ్రైవర్ చత్రియన్ (24), శబరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుభకార్యానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో వారి బంధువులు బోరుమని విలపించారు.