కాంచీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Tue, Dec 3 2013 12:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్:చిన్నారి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న సంతోషంతో ఇళ్లకు వెళుతున్న బంధువులను మృత్యు వు బస్సు రూపంలో వెంటాడింది. చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కాంచీపురం సమీపంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని కీయ్‌వెన్‌పాక్కం గ్రామానికి చెందిన మునుస్వామి(55) కూతురు కార్తికాను తిరువణ్ణామలై జిల్లా చెయ్యారు సమీపంలోని చిదాత్తూర్ గ్రామానికి చెందిన రాజసంతోష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల కొడుకు కార్తీక్‌రాజ్‌కు మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మునుస్వామి తన బంధువులతో కలిసి రెండు వ్యాన్లలో చిదాత్తూర్ గ్రామానికి వెళ్లారు. వేడుకలను ముగించుకుని ఆదివారం రాత్రి ఇం టికి తిరుగు ప్రయాణమయ్యారు. కాంచీపురం సమీపంలోని చెవ్విలిమేడు ప్రాంతంలోని పాలారు నది బ్రిడ్జి మీద వెళుతుండగా డీజిల్ అయిపోవడంతో వ్యాన్ ఆగిపోయింది.
వ్యాన్‌లో ఉన్న నలుగురు డీజిల్ తీసుకొచ్చి ట్యాంకులో నింపి స్టార్ట్ చేసేందుకు తోశారు. అదే సమయం లో వస్తున్న ప్రైవేటు కర్మాగారానికి చెందిన బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌ను తోస్తున్న శివ(28), శశికుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 19 మందిని పోలీసులు కాంచీపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మునుస్వామి(55), శంకర్ కుమార్తె యోగలక్ష్మీ(3) ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంచీ పురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ పరామర్శించారు. క్షతగాత్రుల్లో వ్యాన్ డ్రైవర్ చత్రియన్ (24), శబరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుభకార్యానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో వారి బంధువులు బోరుమని విలపించారు.
Advertisement