కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.
బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్‌పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
క్షీణించిన విక్రయాలు
ధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్‌టైల్ చైన్ ఆర్‌ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్‌ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.
22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.
50 శాతం పెరిగిన ధరలు
కాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment