silk saris
-
బంగారం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పట్టు చీరల ధరలు
కాంచీపురం పట్టు చీరలు పెళ్లిళ్లకు ప్రసిద్ధి. పెళ్లి కోసం కొనుగోలు చేసేవాటిలో బంగారం తర్వాత పట్టు చీరలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆకాశమే హద్దుగా రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలు కాంచీపురం పట్టు చీరల ధరలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.బంగారం, పట్టు చీరల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మొత్తంగా పెళ్లిళ్ల బడ్జెట్‌పై భారం పడుతోంది. గత ఎనిమిది నెలల్లో కాంచీపురం పట్టు చీరల ధరలు 50 శాతం పెరిగాయి. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తక్కువ స్థాయిలో ఉన్న లేదా పూర్తిగా లేని చీరలను చాలా మంది కస్టమర్లు ఎంచుకుంటున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.క్షీణించిన విక్రయాలుధరల పెరుగుదల కారణంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు 20 శాతం క్షీణించినట్లు కాంచీపురం పట్టు చీరల అమ్మకానికి పేరుగాంచిన రీటైల్ టెక్స్టైల్ చైన్ ఆర్ఎంకేవీ పేర్కొంటోంది. తక్కువ సమయంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పట్టు చీరల ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని ఆర్ఎంకేవీ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.22 క్యారెట్ల బంగారం ధర 2023 అక్టోబర్ 1న గ్రాముకు రూ. 5,356 ఉండగా 2024 మే 21 నాటికి అది రూ. 6,900 లకు పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు గ్రాముకు రూ. 75.5 నుంచి రూ.101 కి పెరిగాయి. రూ. 10,000 కోట్ల విలువైన కాంచీపురం పట్టు చీరల పరిశ్రమ దీని ద్వారా గణనీయంగా ప్రభావితమైంది.50 శాతం పెరిగిన ధరలుకాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘానికి చెందిన దామోధరన్ ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ చీరల ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయి. కాంచీపురం పట్టు చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండితో తయారు చేసిన జరీని ఈ చీరల తయారీలో ఉపయోగిస్తారు. పురాతమైన కాంచీపురం చీరలకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ధర రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. -
స్లీవ్స్ అండ్ స్టయిల్స్
పెళ్లి కూతురు చీర అనగానే మన మదిలో కంచిపట్టు పేరే మెదులుతుంది. కంచి పట్టు అందం రెట్టింపులుగా కనిపించాలంటే ఎంచుకున్న బ్లౌజ్ డిజైన్ ప్రత్యేకంగా ఉండాలి. కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరాలి. అందుకు వేల డిజైన్లను పరిశీలిస్తారు. లేదంటే, గ్రాండ్‌గా కనిపించాలని బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నింపేస్తారు. పెళ్లి చీరకు తగిన బ్లౌజ్ మ్యాచ్ చేసుకునేలా మన దగ్గరే సరైన సమాధానం ఉంటే ఎంపిక ఇంకా సులువు అవుతుంది. ‘బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్ అయితే బాగుంటుందో చెప్పడానికి ముందు చీరలో ఉన్న డిజైన్, కలర్ కాంబినేషన్స్ చూసుకుంటాం. ఆ చీరపై ఉన్న థీమ్ డిజైన్ బ్లౌజ్‌పై ఎలా చూపుతామో కస్టమర్‌కి ఒక స్టోరీలా వివరంగా చెబుతాం. దీంతో ఆ బ్లౌజ్ డిజైన్ మరెక్కడా లేనివిధంగా రూపుదిద్దుకుంటుంది. ఒకసారి వాడి ఆరేడేళ్ల తర్వాత కూడా ఆ బ్లౌజ్‌ను బయటకు తీస్తే ఈ వర్క్ ఇప్పుడు ట్రెండ్‌లో లేదు కదా అనే ఫీల్ ధరించినవారికి రాకూడదని కోరుకుంటాను. – భార్గవి అమిరినేని, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.instagram.com/bhargavi.amirineni కలర్ కాంబినేషన్ ►పెళ్లి అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకువచ్చే కామన్ కలర్స్ ... ఎరుపు, నీలం, పచ్చ, పింక్, గోల్డ్ ►సాధారణంగా బ్లౌజ్‌లు ఎంచుకునేటప్పుడు మూడు రకాలుగా ఆలోచన చేస్తాం. ఒకటి: శారీ కలర్లోనే ఉండేది. రెండు: పూర్తి కాంట్రాస్ట్. మూడు: అన్నింటికీ వాడే గోల్డ్ కలర్. వీటిలో ఏది ప్రత్యేకంగా ఉంటుందో చూసుకోవాలి. పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే చీరకు కాంట్రాస్ట్ కలర్ ఎంచుకుంటాం. లేదంటే గోల్డ్ ఆలోవర్ వర్క్ తీసుకుంటాం ►మేనిరంగును బట్టి తెల్లగా ఉండేవారు కాంతిమంతమైన రంగులు, రంగు తక్కువ ఉన్నవారు లేత రంగు చీరలు అని ఎంపిక చేసుకుంటారు. కొందరు చామనచాయగా ఉన్నా బ్రైట్ కలర్స్ ధరించాలనుకుంటారు. వీళ్లు ముదురు రంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేత రంగు బ్లౌజ్‌ను మ్యాచ్ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్ ఫేస్ మీద ప్రతిబింబిస్తుంది ►చీరలో జరీ డిజైన్ శాతం ఎక్కువ ఉంటే బాగా బ్రైట్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి. కంచిపట్టులో కలర్ ఎక్కువ ఉంటే దానిని కాస్త డల్ చేయడానికి బ్లౌజ్లో ఎక్కువ వర్క్ తీసుకోవాలి ►పెద్ద బార్డర్ చీరలకు మోచేతుల(ఎల్బో)వరకు స్లీవ్స్ బాగుంటాయి. చిన్న బార్డర్ అయితే మోచేతుల వరకు చేతుల డిజైన్ పాటు కొంత కుచ్చులు వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే అంచు పెద్దగా ఉంటే మోచేతుల వరకు అంచుతోనే డిజైన్ చేసుకోవచ్చు. పొడవుగా ఉన్నవారికి: మోచేతుల కిందవరకు 3/4 స్లీవ్స్ బాగుంటాయి. వీటి మీద సింపుల్ డిజైన్ చేయించుకోవచ్చు పొడవు తక్కువ ఉన్నవారు: మోచేతుల వరకు స్లీవ్స్, లైన్స్ వచ్చేలా ఎంబ్రాయిడరీ, కరెక్ట్ ఫిటింగ్‌తో ఉంటే పొడుగ్గా కనిపిస్తారు. అలాగే, బాడీ పార్ట్‌కి ఒక కలర్, స్లీవ్స్‌కి మరో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా పొడవు కనిపిస్తారు. వీళ్లు బ్లౌజ్ లెంగ్త్ పొట్టిగా ఉండాలనుకోకూడదు. సాధారణ పొడవు, డీప్ నెక్స్ బాగుంటాయి ►భుజ భాగం సన్నగా ఉంటే లేయర్డ్ బ్లౌజ్ వేసుకుంటే వెడల్పుగా కనిపిస్తారు ఎంబ్రాయిడరీ: ఎంత ఎంబ్రాయిడరీ చేయించుకుంటే అంత గ్రాండ్‌గా కనిపిస్తాం’ అనుకుంటారు చాలా మంది. అది సరైనది కాదు ∙బ్లౌజ్ డిజైన్‌కి జరీ తక్కువ గ్లిట్టర్ ఉన్నది వాడాలి. కానీ, వేసుకున్నప్పుడు వర్క్ షైన్ అవ్వాలి. చిన్న నెక్లైన్, ఆలోవర్ వర్క్ అయినా డిజైన్ని శారీలోంచి తీసుకుంటే ఎక్కడా కాపీ కాదు. ప్లెయిన్ బ్లౌజ్: కంచిపట్టు చీరలోనే ప్యూర్ టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీంతో హై నెక్ ఇచ్చి లాంగ్ స్లీవ్స్‌తో డిజైన్ చేయించుకోవచ్చు. అయితే అప్పుడు ధరించే నగలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జ్యువెలరీ ఉన్నప్పుడు బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీ హంగులు అక్కర్లేదు. స్పెషల్ జ్యువెలరీ లేదనుకున్నప్పుడు కంచిపట్టుకు ప్లెయిన్ బ్లౌజ్ సెట్ అవ్వదు. -
కట్టు మారిన పట్టు
పట్టు చీరలు వేడుకల సందర్భంలోనే కొనుగోలు చేస్తారు. అలాగే వాటిని సంప్రదాయ వేడుకలకే ధరిస్తారు. సంప్రదాయ వేడుకలతో పాటు గెట్ టు గెదర్, రిసెప్షన్ వంటి ఇండోవెస్ట్రన్ పార్టీలకు కూడా ఇలా రెడీ అవచ్చు. ఇప్పుడు చలికాలం కూడా కాబట్టి సీజన్‌కి తగ్గట్టు చీరకట్టులో మార్పులు చేసుకోవచ్చు. ►బ్లూ బెనారస్ పట్టు చీరకి సిల్వర్ జరీతో ఉండే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేశారు. బ్లౌజ్, మెడలో సిల్వర్ హారం, హెయిర్ స్టైల్.. ఈ చీర కట్టు లుక్‌ని పూర్తిగా మార్చేసింది. ►ఆకుపచ్చ అంచు ఉన్న గులాబీ రంగు కంచి పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. అది కూడా పెప్లమ్ బ్లౌజ్ అయితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ చీరకు వంగపండు రంగు పెప్లమ్ బ్లౌజ్‌ను వాడారు. లైట్ మేకప్, హెయిర్‌ను వదిలేస్తే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతరత్రా ఆభరణాలు ధరించనవసరం లేదు. ఈ స్టైల్ ఏ పార్టీకైనా, వేడుకకైనా బాగుంటుంది. ►ఇది బ్లాక్ కలర్ బెనారస్ పట్టు చీర. దీనికి సెల్ఫ్కలర్ హా‹ఫ్ షోల్డర్ బ్లౌజ్‌ని వాడారు. అలాగే కాంట్రాస్ట్ టైని మెడకు అలంకరించారు. దీంతో పట్టు చీర లుక్ పూర్తి స్టైలిష్‌గా మారింది. ►ఆరెంజ్ కలర్ పట్టుచీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడుకోవచ్చు. వెస్ట్రన్ స్కర్ట్మీదకు వాడే టాప్ వేసుకుంటే ప్రెట్టీగా కనిపిస్తారు. దీని మీదకు పిస్తా షేడ్ గ్రీన్ జాకెట్‌ను వేసుకుంటే లుక్ పూర్తిగా స్టైలిష్‌గా మారిపోతుంది. కాక్టెయిల్ పార్టీస్‌కు కూడా నప్పే డ్రెస్ అవుతుంది. ►ప్లెయిన్ పట్టు చీరకి పూర్తి కాంట్రాస్ట్ కలర్లో సైడ్ కట్స్ ఉన్న ఎల్లో లాంగ్ జాకెట్‌ను వాడారు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ను ఉపయోగించారు. ఫిష్ టెయిల్, సైడ్ జడ వేసుకుంటే చాలు మేకోవర్ పూర్తయినట్టే. ►ఇది బ్రైట్ రెడ్ శారీ. సహజంగా పెళ్లి కూతురు డ్రెస్‌గా వాడుతారు. దీనిని ఇండోవెస్ట్రన్ పార్టీలకూ ధరించాలంటే ఇలా జరీ కలర్లో జాకెట్‌ని ధరించాలి. పల్లూని ముందువైపుగా తీసుకొని, కుచ్చిళ్ల పార్ట్‌ని లెహంగా స్టైల్లో అమర్చుకోవాలి. ఈ లెహంగా శారీ విత్ జాకెట్ స్టైల్ డ్రేప్ ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తుంది. -
పట్టుచీరకు పూలరెక్కలు
ఎంత ఖరీదు పట్టు చీరైనా... బ్లౌజ్ డిజైన్‌తోనే అందం పట్టు చీరకు పట్టు ఫ్యాబ్రిక్‌తోనే డిజైన్ చేయాల్సిన అవసరం లేదు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌తో సింపుల్ డిజైన్ చేసి ఆకట్టుకోవచ్చు. ‘పట్టు చీరకు పూలరెక్కలు జత చేసావే’ అని కితాబులూ అందుకోవచ్చు పట్టు చీరకు కాంబినేషన్‌గా కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేయడం సహజమే. కానీ, పూర్తిగా ఏ మాత్రం సరిపోలని పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్లు వేస్తే.. అదే ఇప్పటి ట్రెండ్. పాత పట్టు కొత్త హంగు పట్టుచీరలు బీరువాలో చేరి ఏళ్లకేళ్లకు ఎదురుచూస్తుంటాయి. ఎందుకు వాటికి అంత ఖరీదు పెట్టి కొనుక్కోవడం అని చాలా మంది యోచిస్తుంటారు. పెళ్లికో, పండగకో కట్టుకుందామని నాటి చీరను ఎంపిక చేసి బయటకు తీసినా అప్పటి బ్లౌజ్ ఇప్పటికి సూట్ అవదు. రంగు వెలిసిపోవడం, లేదంటే కొలత సరిపోకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఓ పరిష్కారం ఫ్లోరల్బ్లౌజ్. స్టైల్‌కి స్టైల్, పండగైనా, పెళ్లైనా కళగా గడిచిపోతుంది. అమ్మాయిల ఫేవరేట్ పట్టు చీర కట్టమంటే ‘అబ్బో బరువు’ అంటూ అమ్మాయిలు అమ్మ మాటను దాటేస్తుంటారు. ఫ్లోరల్ కాన్సెప్ట్ జత చేస్తే కొంచెం మోడ్రన్ టచ్ ఇచ్చారంటే ‘వావ్’ అంటూ ఎగిరి పూల రెక్కలను బ్లౌజ్‌గా తొడిగేసుకుంటారు. అప్పుడిక అమ్మాయి సీతాకోకచిలుక చీర కట్టిన ంత బ్రైట్‌గా వేడుకలో వెలిగిపోతుంది. ప్లెయిన్ పట్టు.. పువ్వులతో కట్టు లైట్‌వెయిట్ పట్టు చీరలు చాలా వరకు పెద్ద అంచులు ఉండి, ప్లెయిన్‌గా ఉంటాయి. వీటి మీదకు పొడవాటి చేతుల పువ్వుల ప్రింట్లు ఉన్న బ్లౌజ్ వేసుకుంటే రెట్రోస్టైల్లో కొత్తగా కనువిందుచేస్తారు. పువ్వుల ప్రింటుకు ఎంబ్రాయిడరీ జిలుగు బ్లౌజ్పార్ట్కి ఎలాగూ పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటున్నాం. పట్టు చీర కాబట్టి కొంత వర్క్ కూడా ఉంటే బాగుంటుందనుకున్నా అలాగే సెట్ చేసుకోవచ్చు. నెక్, స్లీవ్స్ ప్యాటర్న్‌లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు. ఆభరణాల ఊసే అక్కర్లేదు ఈ గెటప్ మీదకు పూర్తిగా ఆభరణాలు అక్కర్లేదని చెప్పలేం. కానీ, మరీ ఎక్కువ హారాలు మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఫ్లోరల్ స్టైల్ ఆభరణం ప్లేస్‌ని భర్తీ చేసేసింది కాబట్టి. కంచిపట్టుకు ఫ్లోరల్ బోట్ నెక్ లేదా రౌండ్‌నెక్ బ్లౌజ్ ధరించి, సింపుల్‌గా చెవులకు జూకాలు, ముంజేతికి సింగిల్ బ్యాంగ్ ధరిస్తే చాలు అలంకరణ అందంగా మెరిసిపోతుంది. (పూర్తి కాంట్రాస్ట్ ఎప్పుడూ ఆకట్టుకునే స్టైల్,కంచిపట్టుకు పువ్వుల నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ప్రధాన ఆకర్షణ,ఏ పట్టు అయినా పువ్వుల జాకెట్టు లేటెస్ట్ ఎంపిక) - నిఖిత డిజైనర్ హైదరాబాద్ -
కట్‌చేస్తే!
పెళ్ళిళ్లకి చీరలు కట్టుకోవడం ఒకప్పటి సీను. కట్ చేస్తే.. ఇప్పుడు ఓణీయే అదిరిపోయే సీను. పెళ్ళిళ్ల సీజన్లో పట్టు చీరలతో హాఫ్‌శారీస్, లాంగ్ గౌన్లు.. డిజైన్ చేయవచ్చు. కట్ చేయండి.. కట్టేయండి... వెలిగిపోండి. పెద్ద పెద్ద అంచులు,, చిన్న చిన్న బుటీలు, అందమైన జరీ పువ్వులు పట్టు చీరకు అందాన్ని తీసుకువస్తాయి. చీరను అమ్మాయికి లంగాఓణీగా సింగారించాలంటే ఇలా అందంగా రూపుకట్టేయవచ్చు. కొంగు భాగాన్ని బ్లౌజ్‌గా, చీర భాగాన్ని లెహంగా ను డిజైన్ చేసుకోవచ్చు. వేరే కాంబినేషన్ ఓణీని తీసుకోవచ్చు. పట్టు ఓణీలు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. చీరను లంగా బ్లౌజ్గానే కాదు అనార్కలీ డ్రెస్ లేదంటే లాంగ్ గౌన్గానూ రూపుదిద్దుకోవచ్చు. ఇవి సంప్రదాయ వేడుకులకు స్టైలిష్‌గానూ, ఆధునికంగానూ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. పట్టు చీరలే కాకుండా మనవైన చేనేత చీరలను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఈ తరహా డ్రెస్సింగ్ ఫ్యాషన్ వేదికల మీద హల్ చేస్తున్నాయి. ప్లెయిన్ పట్టు లేదా రాసిల్క్ మెటీరియల్ తీసుకొని దానికి చీర అంచులు జత చేయాలి. అలాగే బ్లౌజ్ పార్ట్‌ని కూడా తీర్చిదిద్దాలి. బ్లౌజ్ పార్ట్‌ని క్రాప్‌టాప్‌గా డిజైన్ చేసి, మిగతా చీర భాగాన్ని ఓణీగా తీసుకోవచ్చు. ఈ డిజై స్టైల్స్‌ని నేటి తరం అమ్మాయిలే కాదు అమ్మలూ ధరించవచ్చు. లెహంగా పార్ట్‌కి కావల్సిన పట్టు మెటీరియల్ కూడా మార్కెట్లో లభిస్తుంది. అయితే, బ్లౌజ్ పార్ట్‌కి సరైన కాంబినేషన్ దొరక్క ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లు వేస్తుం టారు. దీంతో లుక్ ప్రత్యేకత కనిపించదు. ఇందుకు లెహంగా, బ్లౌజ్ పార్ట్‌ని పట్టు, ఉప్పాడ, జరీ చీరలను వాడకం మొదలైంది. ఇవి సంప్రదాయ వేడకులకు తీరైన అందాన్ని తీసుకువస్తున్నాయి. -
చీరంచు గౌనుకు ముద్దు
పాత మోడల్ పట్టు, లేదంటే పెద్ద పెద్ద అంచులున్న చీరలు కొన్నేళ్లుగా అలాగే ఉంటూ ఉంటాయి. చాలామంది వాటిని పెట్టెల్లో, బీరువా అడుగున చేరుస్తూ ఉంటారు. వాటికి ఇలా కొత్త రూపమిచ్చి, మీ టీనేజ్ అమ్మాయిలను మరింత అందంగా మెరిపించవచ్చు. ⇔ పెద్ద అంచున్న మెటీరియల్‌ను స్కర్ట్ భాగానికి తీసుకొని, బ్లౌజ్‌ను ప్లెయిన్‌గా డిజైన్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినా చూడముచ్చటగా ఉంటుంది. ⇔ కేవలం పల్లూ భాగాన్ని తీసుకొని దాంతో స్కర్ట్ భాగాన్ని డిజైన్ చేయాలి. బ్లౌజ్ పార్ట్, స్లీవ్స్‌ని ప్లెయిన్‌గా తీసుకోవాలి. చూడముచ్చటైన స్టైలిష్ ఫ్రాక్ రెడీ. ⇔ చిన్న అంచు ఉన్న ప్లెయిన్ శారీని లాంగ్ కుర్తీ టాప్‌గా మార్చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. ⇔ రెండు రకాల చీరల రంగు క్లాత్‌లను తీసుకొని ఇలా పొట్టి గౌన్ని సింపుల్‌గా తీర్చిదిద్దవచ్చు. ⇔ చూడగానే ఆకట్టుకునే ఇలాంటి ఫ్రాక్స్ని చీరలతో ఎన్నో మోడల్స్‌లో డిజైన్ చేయవచ్చు. -
ఇంటిప్స్
పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపితే రంగు పోవు.వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో టీ స్పూన్ పాలు కలపాలి.బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచితే అవి మెత్తబడవు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు నూనె రాయాలి. వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా వరకు తాజాగా ఉంటాయి. ఈగల బెడద లేకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని గది నాలుగు మూలల్లో ఉంచాలి. శనగపిండితో స్టీలు, వెండి సామాన్లు తోమితే చక్కగా శుభ్రపడతాయి. మజ్జిగ పల్చనైతే కొన్ని కరివేపాకులు, ఉప్పు కలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. మజ్జిగ రుచిగానూ, చిక్కగానూ ఉంటుంది. -
దుర్గమ్మ చీరలకు దుర్గతి
ఆరు నెలలుగా మూటలు కట్టి పడేశారు నాణ్యత కోల్పోతున్న వైనం సమస్య పరిష్కారంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలం సాక్షి ప్రతినిధి, విజయవాడ : దేవాదాయ శాఖ అధికారుల తీరు దుర్గమ్మ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన పట్టు చీరలు పనికిరాకుండా పోతున్నాయి. వాటిని అమ్మవారికి అలంకరించి తిరిగి భక్తులకు అమ్మడం ద్వారా ఆలయ ఆదాయాన్ని అధికారులు పెంచాల్సి ఉంది. అధికారుల చేతకానితనం వల్ల చీరలు గుట్టలుగా పేరుకుపోతూ పాడైపోతున్నాయి. ‘బోస్ అండ్ బోస్’కే మళ్లీ టెండరు.. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఏటా వేలం లేదా టెండర్ల ద్వారా (ఏది ఎక్కువైతే అది) విక్రయించడం ఆనవాయితీ. గత ఏడాది నగరానికి చెందిన బోస్ అండ్ బోస్ సంస్థ రూ.1.80 కోట్లకు టెండరు దక్కించుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల భక్తుల సంఖ్య తగ్గడంతో వారిచ్చే చీరల సంఖ్య కూడా తగ్గిందని, తనకు వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు ఈ ఏడాదీ తనకే టెండరు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది వేసిన టెండరుకు 25 శాతం ధర పెంచి టెండరు బోస్ అండ్ బోస్ వారు తీసుకుంటే అభ్యంతరం పెట్టొద్దని దేవాదాయ శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ సంస్థ మాత్రం అందుకు అంగీకరించలేదు. కోర్టులో వేసిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. 2013, నవంబర్ 28న దేవస్థానం అమ్మవారి చీరల కొనుగోలుకు వేలం, టెండర్లు ఆహ్వానించింది. వేలంపాటను రూ.2.25 కోట్ల నుంచి ప్రారంభించింది. అంత మొత్తంపై పాట పాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాటను రూ.1.81 కోట్ల నుంచి పెంచుతూ రూ.1.83 కోట్లకు మాత్రమే వెళ్లింది. సీల్డ్ టెండర్లు కూడా ఆహ్వానించడంతో వాటిని పరిశీలించారు. అందులో రూ.1.84 కోట్లకు బోస్ అండ్ బోస్ వారు టెండర్లు వేశారు. వారి టెండరును దేవస్థానం ఖరారు చేసింది. భక్తుడి ఫిర్యాదుతో అవినీతి వెలుగులోకి.. చీరల టెండర్లలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరపాలంటూ ఓ భక్తుడు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ విచారణ చేపట్టాలని రీజినల్ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్జేసీ రామచంద్రమోహన్ విచారణ జరిపి టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. మార్చిలో చీరల వేలానికి సంబంధించిన ఫైల్‌ను తీసుకెళ్లారు. టెండరు రద్దు చేయాలని ఆదేశించారు. తాను చెల్లించిన 50 శాతం నిధులు దేవస్థానం వద్దే ఉన్నాయని, ఆ డబ్బుతో మరో రెండు నెలల పాటు తాము చీరలు తీసుకునేందుకు అర్హులమంటూ బోస్ అండ్ బోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై కమిషనర్‌ను సంప్రదించాలని కోర్టు ఆ సంస్థను ఆదేశిం చింది. ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న చీరలు అమ్ముకునే వరకు కౌంటర్‌ను ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2014 ఏప్రిల్ నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను దేవస్థానం వారే భద్రపరచాల్సి ఉంది. మూటలు కట్టి పడేశారు... ఆరు నెలలుగా దేవస్థానం వారు అమ్మవారి చీరలను ఎక్కడ భద్రపరచాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. పాతపడిన చిన్న గదుల్లో మూటలు కట్టి పడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చీరల మడతల్లో రంథ్రాలు పడి పనికిరాకుండా పోయే అవకాశం ఉందని ఆలయంలోనే అధికారులే చెబుతున్నారు. నెలకు అమ్మవారికి కనీసంగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల విలువైన చీరలు వస్తుంటాయి. అంటే సుమారు రూ.కోటి విలువైన చీరలు పనికి రాకుండాపోతున్నాయి. కొందరు సిబ్బంది చీరలు తస్కరించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అమ్మవారి చీరలు భక్తులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.