దుర్గమ్మ చీరలకు దుర్గతి
- ఆరు నెలలుగా మూటలు కట్టి పడేశారు
- నాణ్యత కోల్పోతున్న వైనం
- సమస్య పరిష్కారంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : దేవాదాయ శాఖ అధికారుల తీరు దుర్గమ్మ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన పట్టు చీరలు పనికిరాకుండా పోతున్నాయి. వాటిని అమ్మవారికి అలంకరించి తిరిగి భక్తులకు అమ్మడం ద్వారా ఆలయ ఆదాయాన్ని అధికారులు పెంచాల్సి ఉంది. అధికారుల చేతకానితనం వల్ల చీరలు గుట్టలుగా పేరుకుపోతూ పాడైపోతున్నాయి.
‘బోస్ అండ్ బోస్’కే మళ్లీ టెండరు..
అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఏటా వేలం లేదా టెండర్ల ద్వారా (ఏది ఎక్కువైతే అది) విక్రయించడం ఆనవాయితీ. గత ఏడాది నగరానికి చెందిన బోస్ అండ్ బోస్ సంస్థ రూ.1.80 కోట్లకు టెండరు దక్కించుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల భక్తుల సంఖ్య తగ్గడంతో వారిచ్చే చీరల సంఖ్య కూడా తగ్గిందని, తనకు వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు ఈ ఏడాదీ తనకే టెండరు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది వేసిన టెండరుకు 25 శాతం ధర పెంచి టెండరు బోస్ అండ్ బోస్ వారు తీసుకుంటే అభ్యంతరం పెట్టొద్దని దేవాదాయ శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ సంస్థ మాత్రం అందుకు అంగీకరించలేదు. కోర్టులో వేసిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
2013, నవంబర్ 28న దేవస్థానం అమ్మవారి చీరల కొనుగోలుకు వేలం, టెండర్లు ఆహ్వానించింది. వేలంపాటను రూ.2.25 కోట్ల నుంచి ప్రారంభించింది. అంత మొత్తంపై పాట పాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాటను రూ.1.81 కోట్ల నుంచి పెంచుతూ రూ.1.83 కోట్లకు మాత్రమే వెళ్లింది. సీల్డ్ టెండర్లు కూడా ఆహ్వానించడంతో వాటిని పరిశీలించారు. అందులో రూ.1.84 కోట్లకు బోస్ అండ్ బోస్ వారు టెండర్లు వేశారు. వారి టెండరును దేవస్థానం ఖరారు చేసింది.
భక్తుడి ఫిర్యాదుతో అవినీతి వెలుగులోకి..
చీరల టెండర్లలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని, దీనిపై విచారణ జరపాలంటూ ఓ భక్తుడు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ విచారణ చేపట్టాలని రీజినల్ జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్‌జేసీ రామచంద్రమోహన్ విచారణ జరిపి టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. మార్చిలో చీరల వేలానికి సంబంధించిన ఫైల్‌ను తీసుకెళ్లారు.
టెండరు రద్దు చేయాలని ఆదేశించారు. తాను చెల్లించిన 50 శాతం నిధులు దేవస్థానం వద్దే ఉన్నాయని, ఆ డబ్బుతో మరో రెండు నెలల పాటు తాము చీరలు తీసుకునేందుకు అర్హులమంటూ బోస్ అండ్ బోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై కమిషనర్‌ను సంప్రదించాలని కోర్టు ఆ సంస్థను ఆదేశిం చింది. ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న చీరలు అమ్ముకునే వరకు కౌంటర్‌ను ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2014 ఏప్రిల్ నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను దేవస్థానం వారే భద్రపరచాల్సి ఉంది.
మూటలు కట్టి పడేశారు...
ఆరు నెలలుగా దేవస్థానం వారు అమ్మవారి చీరలను ఎక్కడ భద్రపరచాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. పాతపడిన చిన్న గదుల్లో మూటలు కట్టి పడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చీరల మడతల్లో రంథ్రాలు పడి పనికిరాకుండా పోయే అవకాశం ఉందని ఆలయంలోనే అధికారులే చెబుతున్నారు. నెలకు అమ్మవారికి కనీసంగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల విలువైన చీరలు వస్తుంటాయి. అంటే సుమారు రూ.కోటి విలువైన చీరలు పనికి రాకుండాపోతున్నాయి. కొందరు సిబ్బంది చీరలు తస్కరించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అమ్మవారి చీరలు భక్తులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.