కంచి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి (ఫైల్ ఫొటో)
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 9 గంటలకు జయేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆయన కొద్ది నెలలుగా శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో మఠం నిర్వాహకులు ఉదయం 7.30 గంటలకు శంకర మఠానికి అను బంధంగా ఉన్న ఆది భగవత్పాద కార్డియాక్ అండ్ డయాలసిస్ (ఏబీసీడీ) ఆస్పత్రికి స్వామీజీని తీసుకెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం చికిత్స ప్రారంభించిన వైద్యులు 8.30 గంటలకు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్లు ఉదయం 9 గంటలకు ప్రకటించారు. దీంతో దేశ, విదేశాల్లో ఉన్న స్వామీజీ శిష్యులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు.
స్వామీజీ శివైక్యం విషయం తెలిసిన వెంటనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. స్వామీజీ నేతృత్వంలో సాగిన ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలను కొనియాడారు.
నేడు శాస్త్రబద్ధంగా ‘అధిష్టాన’ కార్యక్రమం
స్వామీజీ శివైక్యం గురించిన వార్త విన్నంతనే ఆయన శిష్యులు, భక్తజనావళి హుటాహుటిన కంచి మఠానికి తండోప తండాలుగా తరలి వచ్చారు. భక్తుల సందర్శనార్థం స్వామీజీ పార్థివ దేహాన్ని ఆయన మండపంలోనే ఉంచారు. అక్కడి ఏర్పాట్లను మఠం మేనేజర్ సుందరేష్ అయ్యర్, బాల పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రభృతులు పర్యవేక్షిస్తున్నారు.
గురువారం ఉదయం వేద ఘోష, విష్ణుపారాయణ, అధిష్టాన పూజ, అభిషేకాల ప్రక్రియ ముగిశాక ‘అధిష్టానం’ (సమాధి) కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. దీనిని ‘బృందావన ప్రవేశ కార్యక్రమం’గా పిలుస్తామని వారు తెలిపారు. కంచి కామకోటి మఠం ఆవరణలో మహాస్వామి చంద్రశేఖరేంద్ర స్వామిని అధిష్టానం చేసిన ప్రదేశం పక్కనే జయేంద్ర సరస్వతి భౌతిక కాయాన్ని కూడా శాస్త్రబద్ధంగా అధిష్టానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కంచి మఠానికి 69వ పీఠాధిపతి..
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ఇరుల్‌నీకి గ్రామంలో 1935 జులై 18న జన్మించిన జయేంద్ర సరస్వతి చిన్నతనంలోనే వేదా«భ్యాసం, వివిధ శాస్త్రాల పఠనం పూర్తి చేశారు. స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్. తన 19వ ఏట అనగా 1954 మార్చి 22న కంచి శంకర మఠానికి చేరుకుని బాలస్వామీజీగా బాధ్యతలు స్వీకరించారు.
అప్పట్లో మఠం బా«ధ్యతల్లో ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ ఈయనను తన వారసునిగా శిష్యబృందానికి స్వయంగా పరిచయం చేశారు. 1994లో చంద్ర శేఖరేంద్ర స్వామి కన్నుమూశాక జయేంద్ర సరస్వతి ప్రధాన పీఠాధిపతి బాధ్యతలను చేపట్టారు. హిందూ ధర్మ ప్రచారం, కంచి మఠ విస్తరణ, శిష్య పరంపర అభివృద్ధి, సేవా, ధార్మిక కార్యక్రమాల అమలు, ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలను జయేంద్ర సరస్వతి విస్తృతంగా చేపట్టారు.
వివిధ సందర్భాలలో రాజకీయ వివాదాలు, కేసులు చుట్టుముట్టినా వాటిని అధిగమించి శిష్య పరంపరను ఏకతాటిపై నడిచేలా చేశారు. ఆధ్యాత్మిక, విద్యా, వైద్య సంబంధ విభాగాల్లో శంకర మఠం ట్రస్ట్‌ను ఎంతో అభివృద్ది చేశారు. మఠం ని«ధులతో దక్షిణ భారత దేశంలోని ఎన్నో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. విద్యా వ్యవస్థను పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆరాధ్యనీయుడయ్యారు.
1988లో నేపాల్ వెళ్లిన సందర్భంలో అప్పటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర స్వామీజీని ఘనంగా సత్కరించారు. 1998లో స్వామి జయేంద్ర హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్, కైలాసగిరి క్షేత్రాలను సందర్శించారు. ఆదిశంకరాచార్య తరువాత అక్కడికెళ్లిన పీఠాధిపతి ఈయనొక్కరే. 2000లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లిన స్వామీజీ అక్కడున్న తగేశ్వరి ఆలయానికి సొంత నిధులతో స్వాగత తోరణం నిర్మించారు.
2004లో వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసులో ఆరోపణలపై జయేంద్ర అరెస్టవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తరువాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. గత నాలుగేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల కిందట శ్వాస సంబంధ సమస్యలతో చెన్నైలోని రామచంద్రా ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈ మధ్యనే కాంచీపురం చేరుకున్న స్వామీజీ అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment