తెలంగాణ నాడి బాగుంది! | Telangana is in Good Improvements in the health sector | Sakshi
Sakshi News home page

తెలంగాణ నాడి బాగుంది!

Published Wed, Jun 26 2019 3:01 AM | Last Updated on Wed, Jun 26 2019 3:01 AM

Telangana is in Good Improvements in the health sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ‘ఆరోగ్య రంగంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పురోభివృద్దిపై’మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017–18లో ఆరోగ్య రంగంలో జరిగిన అభివృద్ధిని ఇందులో అంచనా వేసింది. ఆరోగ్యరంగంలో 23 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. ఆ రెండు సంవత్సరాల మధ్య జరిగిన పురోగతిని, వెనుకబాటును విశ్లేషించింది. దీని ప్రకారం దేశంలో 21 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడంలో మన రాష్ట్రం అత్యధిక పురోభివృద్ధి సాధించిందని తెలిపింది.

2016–17లో ప్రతి వెయ్యి మందిలో 23 మంది మరణించగా.. 2017–18లో ఆ సంఖ్య 21కి తగ్గిందని వివరించింది. టీబీ కేసులకు అవసరమైన వైద్యం అందించడంలో పెద్ద ఎత్తున పురోగతి సాధించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్లు వేయడం, ఇమ్యునైజేషన్‌లో భారీ మెరుగుదల ఉన్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటులో మాత్రం మెరుగుదల లేదని, రెండేళ్లలో పరిస్థితి అలాగే ఉందని పేర్కొంది. తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నా చర్యలు తీసుకోవడంలో పెద్దగా పురోగతి లేదని వెల్లడించింది. 2016–17లో వెయ్యి మంది మగ శిశువులకు 918 మంది ఆడ శిశువులు జన్మిస్తే, 2017–18లో అది 901కు తగ్గిందని వివరించింది. 

కొరతను అధిగమించి...
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో స్టాఫ్‌నర్సుల కొరత కూడా పెద్దగా లేదని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్‌ ఆఫీసర్ల కొరత ఉండేది. కానీ ఆ తర్వాత సంవత్సరంలో పరిస్థితి మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేసింది. ఇక జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత నుంచి కూడా రాష్ట్రం బయటపడింది. ఈ విషయంలో మంచి పురోగతి ఉందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తంలో కూడా ఆ రెండేళ్లలో మెరుగుదల కనిపించింది. అయితే, జిల్లాల్లో గుండె సంబంధిత యూనిట్ల నిర్వహణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. శిశు జననాల నమోదు ప్రక్రియలో భారీ మెరుగుదల ఉందని తెలిపింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేయడంలో కూడా తెలంగాణ పురోభివృద్ధి సాధించినట్లు నీతి అయోగ్‌ వివరించింది.  

కేసీఆర్‌ కిట్‌ భారీ హిట్‌
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే మహిళల కోసం తెలంగాణ సర్కారు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. దీంతోపాటు కేసీఆర్‌ కిట్‌ కింద మాతా శిశువుల కోసం వివిధ వస్తువులను ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో కేసీఆర్‌ కిట్‌కు ఆదరణ భారీగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. 2016–17లో ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 85.35 శాతముంటే, 2017–18లో అవి 91.68 శాతానికి చేరాయి. మరోవైపు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్‌ఎంల కొరత తీర్చడంలోనూ ప్రభుత్వం విజయం సాధించింది.

200 కోట్లతో మౌలిక సదుపాయాలు 
పీహెచ్‌సీలు మొదలు బోధనాసుప్రతుల్లో కల్పన
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 200 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విడతలుగా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చర్చించాయి. అన్ని రకాల వసతులు కల్పిస్తే ఏమేరకు ఖర్చు అవుతుందో అంచనా వేశాయి. సంబంధిత నివేదికను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆర్థిక శాఖ వద్ద అనుమతి తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

కునారిల్లుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు.. 
రాష్ట్రంలో 950కు పైగా పీహెచ్‌సీలున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రులున్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులున్నాయి. వీటిల్లో వేలాది మంది వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. చాలా ఆసుపత్రుల్లో కుర్చీలు కూడా ఉండటం లేదు. ఆసుపత్రుల్లో పడకలు లేక రోగులను ఆరుబయట లేదా నేల మీద పడుకోబెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఉండటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలనేది సర్కారు ఉద్దేశం.  

పలు చోట్ల ఖాళీలు.. 
రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత వేదిస్తోంది. పీహెచ్‌సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్‌ బోర్డును నియమించారు. దీని ద్వారా వీలైనంత త్వరలో భర్తీలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్‌ తదితర విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ఆసుపత్రుల్లో ఆ స్పెషలిస్టు వైద్యులు లేరు. అందుకోసం వైద్యుల భర్తీ ప్రక్రియ కూడా జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement