Medical Facility
-
వైద్య సదుపాయాలు భారత్‌లోనే బెస్ట్!
మనకు మన చుట్టూ ఉన్న సౌకర్యాలపై అంత విలువ ఉండదు. బహుశా మనం కూడా వాటి ప్రాముఖ్యతను గుర్తించం. ఎప్పుడైతే వేరే చోటుకి లేదా ఆ వస్తువుల అవసరమైనప్పుడే మనం వాటి వాల్యూని గుర్తిస్తాం. అలాంటి అనుభవమే అమెరికాకు వెళ్లిన ఓ భారతీయుడి ఎదురయ్యింది. పైగా విదేశాల్లో ఉండే సౌకర్యాలు చూసి గొప్పగా భావించేవాళ్లు ఈ విషయం తెలుసకోండని మరీ చెబుతున్నాడు. ఏం జరిగిందంటే..యూఎస్ఏ సీయాటిల్లో ఉన్న తమ కుమార్తె వద్దకు భారతీయ వృద్ధ దంపతులు వెళ్లారు. అయితే అతడి భార్యకి ఉన్న శ్వాసకోశ సమస్య దృష్ట్యా ముందుగానే మందులను తీసుకుని వెళ్లాం. అయితే ఆమె మందులు అయిపోవడంతో అతడు పల్మోనాలజిస్ట్ని సంప్రదించి మందుల తీసుకుందామని కుమార్తెతో చెప్పడంతో ఆమె అపాయింట్మెంట్ తీసుకుంది. అదీకూడా ఒక వారం తర్వాత వీడియోకాల్‌లోనే డాక్టర్‌తో మాట్లాడటం జరిగింది. తాము ఉపయోగిస్తున్న మందులు గురించి వివరించడంతో సదరు డాక్టర్ అర్థం చేసుకుని తదానుగుణంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం జరిగింది.తీరా మందుల స్టోర్‌లో అడిగితే ఆ మందులు అందుబాటులో లేవని నాలుగు, ఐదు రోజుల్లో వస్తాయని చెప్పారు. చెప్పాలంటే ఆ మందులు తీసుకోవడం కోసం ఐదు రోజులు నిరీక్షించాల్సి వచ్చింది అతడికి. అప్పుడు తెలిసింది శ్వాసకోశ మందులు 'సిప్లా' మేడ్ ఇన్ ఇండియానే ఉత్పత్తి చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా. యూఎస్‌లో మెడికల్ ఇన్సూరెన్స్ ఖాతాలో 50% తగ్గింపు పొందాక కూడా ఆ మందులకు ఏకంగా రూ. 21000'/ చెల్లించాల్సి వచ్చింది. భారత్‌లో వీటి ధర రూ. 2500/-. అంటే.. అమెరికాలో ఈ మందులు ధర రూ.42000/-. అంతేగాదు ఇక్కడ డాక్టర్ని సంప్రదించడం కోసం, మందుల కోసం దాదాపు 12 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అదే భారత్‌లో ఇన్ని రోజులు పట్టదు. పైగా ధర కూడా తక్కువే. చాలామంది మన దేశంలో వైద్య సదుపాయాలు బాగుండవు అని చెప్పే మిత్రులంతా ఈ విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలో అత్యత్తమమైన వైద్య సదుపాయంలో మన భారతదేశం కూడా ఒకటిని తనకు అమెరికా వచ్చాక తెలుసుకున్న నిజమని ఆయన చెప్పుకొచ్చారు. (చదవండి: ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా వర్జీనియా కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో..) -
Delhi air pollution: స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాయి. ‘పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాలు ఉండబోవు. గదుల్లో శ్వాస సంబంధ, యోగా తరగతులు నిర్వహిస్తాం. విద్యాసంవత్సం దెబ్బతినకుండా ఉండేందుకు బోధనను కొనసాగిస్తాం. స్కూళ్ల మూసివేత ఉండదు’ అంటూ కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లో ఎయిర్ ప్యూరిఫయర్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలన్న చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) సూచనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. ‘పాఠశాల టైమింగ్స్ పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదు. స్కూళ్లు మూసేయాలి. వాయు కాలుష్యంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు’ అని ఢిల్లీ స్కూల్ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అపరాజితా గౌతమ్ డిమాండ్‌చేశారు. అయితే, ‘ స్కూళ్లు కొనసాగాల్సిందే. లాక్డౌన్లతో ఇప్పటికే చదువులు దెబ్బతిన్నాయి. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇంకొంత సేపు స్కూల్ టైమింగ్స్ పెంచాలి’ అని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, ఈనెల 8వ తేదీ వరకు 8వ తరగతిదాకా పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ ఉన్న ఒక సీనియర్ జన రల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారా మెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే. వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్ తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్ న్యూమో థొరాక్స్’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి) ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ– మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!) - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -
Harish Rao: గోలీలు ఇస్తున్నరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు/బాలింతలకు అందుతున్న వైద్య సేవల తీరుతెన్నుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్ చేసి వారినే అడిగి తెలుసుకోనున్నారు. వైద్యులు నెలనెలా చెకప్‌లు చేస్తున్నారా? మందులు ఏ మేరకు ఇస్తున్నారు? ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు ఏమైనా ఉంటున్నాయా? కేసీఆర్ కిట్ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయం అందిందా? వంటి ప్రశ్నలు వేయనున్నారు. రోజుకో ఉమ్మడి జిల్లా చొప్పున పలువురితో టెలికాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణుల ఫోన్ నంబర్ల ప్రకారం టెలికాన్ఫరెన్స్‌లోకి తీసుకోనున్నట్లు చెప్పారు. గర్భిణులు వారి ఇళ్ల నుంచే మంత్రితో మాట్లాడవచ్చని వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కేసీఆర్ కిట్‌లో మార్పులు చేయాలా?..: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం గురించి మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందరికీ అందుతోందో లేదో తెలుసుకోనున్నారు. అలాగే మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం ఏ మేరకు అందుతోందన్న విషయాన్నీ ఆయన తెలుసుకోనున్నారు. ఈ పథకం కింద గర్భిణులు/బాలింతలకు వివిధ దశల్లో రూ. 1,073.94 కోట్ల ఆర్థిక సాయాన్ని, 10.80 లక్షల కిట్లను ఇప్పటివరకు అందించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు మంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ పథకంపై లబ్ధిదారులు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? కేసీఆర్ కిట్‌లో మార్పుచేర్పులు చేయాలా? అని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకొనే అవకాశముంది. అలాగే ఆర్థిక సాయం అందని వారికి తక్షణమే విడుదల చేయొచ్చని తెలిసింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లేబర్ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండట్లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మంత్రి హరీశ్ అధికారులను వివరణ కోరే అవకాశముంది. -
కరోనా నేర్పిన పాఠాలు: విదేశాలవైపు భారతీయుల చూపు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ధోరణి విస్తృతమవుతోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని చూసి.. మెరుగైన ఆరోగ్య వసతులు ఉన్న చోటకు వలసపోదామన్న ఆలోచన వ్యాపారస్తుల్లో కలుగుతోంది. ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ వ్యాపారి మూడు దశాబ్దాల్లో బాగానే ఆస్తులను సమకూర్చుకున్నారు. తాజా పరిస్థితుల్లో అతడు తన కుటుంబాన్ని తీసుకుని న్యూజిలాండ్ లేదా కెనడాకు వెళ్లి స్థిరపడే ఆలోచనలో ఉన్నాడు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అతడి సమీప బంధువు ఒక్కగానొక్క కుమారుడు కరోనాకు బలైపోవడాన్ని చూసిన తర్వాతే అతడిలో ఈ మార్పు వచ్చింది. ఎంత డబ్బుంటేమి.. ప్రాణాలు దక్కలేదు! అన్న బాధతో పరాయి దేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. నోయిడాకు చెందిన మరో వ్యాపారి తన కుటుంబాన్ని తీసుకుని ఖతార్ వెళ్లిపోయాడు. మెరుగైన హెల్త్‌కేర్ వసతుల కోసమే అతడు వలసపోయాడు. ఈ ఇద్దరే అని కాదు కరోనా వచ్చిన తర్వాత దేశం వీడిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని ట్రావెల్ పరిశ్రమ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మెరుగైన వైద్యం కావాలి.. కరోనా రెండో విడత చాలా తీవ్రంగా ఉండడం, లక్షలాది కేసులు రోజువారీగా నమోదు కావడాన్ని చూశాం. ఆస్పత్రుల్లో పడకలు లభించడానికి చాలా ప్రాంతాల్లో అవస్థలు పడాల్సి వచ్చింది. పడకలు, వైద్యం లభించక పోయిన ప్రాణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, ఔషధాలు అందక, ఆస్పత్రుల్లో ఐసీయూలు, పడకలపై ఉన్న వారికి ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మెరుగైన వైద్య వసతులు ఏ ఏ దేశాల్లో ఉన్నాయనే విషయమై విచారణ చేస్తూ, విదేశాలకు ప్రయాణం కట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ధనవంతులే కాకుండా, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన రెండు నెలల్లో విదేశాలకు వలసపోవడంపై విచారించే వారి సంఖ్య 20 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రానున్న రోజుల్లో విదేశాలకు సంబంధించి విచారణలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి సూచనలతో చాలా మంది పర్యాటక సంస్థలను ఆశ్రయిస్తున్నారు. సులభతర వీసా విధానం అమెరికా, కెనాడా, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలనే కాదు.. చిన్న దేశాలైన ఆస్ట్రియా, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్టా, సైప్రస్, టర్కీ దేశాల్లో వసతులు, జీవన విధానం ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టు ట్రావెల్ పరిశ్రమకు చెందిన వారు తెలిపారు. ప్రధానంగా సులభ వీసా ఏ దేశం నుంచి లభిస్తుంటే ఆ దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కే మొగ్గు చూపిస్తున్నారు. ‘‘కరోనా రెండో దశలో ప్రతీ కుటుంబంపై ప్రభావం చూపించింది. దీంతో వలసవిధానంలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది’’ అని వీసా, ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఐవీఏసీఎస్ డైరెక్టర్ చంద్రజిత్‌సింగ్ తెలిపారు. కరోనా రాక ముందు వరకు వ్యాపార అవకాశాల విస్తరణ కోసం, సులభతర పన్నుల విధానం చూసి విదేశాలకు వలసవెళ్లే వారు ఎక్కువగా ఉండే వారని.. ఇప్పుడు మెరుగైన వైద్య వసతులు కూడా ప్రాధాన్యాల జాబితాలోకి చేరిపోయిందని ఆయన చెప్పారు. -
Narendra Modi: స్థానిక కట్టడియే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటున్న జిల్లాల్లో స్థానిక కట్టడియే ప్రస్తుత దశలో అత్యంత కీలకమన్నారు. కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికను రూపొందించాలని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించడంతో పాటు ఇతరత్రా అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ప్రాణవాయువును అందించే ఇతరత్రా ఉపకరణాల వినియోగంపై ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, వీటి వినియోగానికి వీలుగా గ్రామీణ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. మహానగరాల్లో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలను వేగవంతం చేసింది. పారదర్శకంగా గణాంకాలు వెల్లడించాలి దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నియంత్రణకు స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అధిక పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు.. రెండింటినీ ఉపయోగించి కరోనా పరీక్షలను మరింత పెంచాలని ప్రధాని ఆదేశించారు. రాష్ట్రాలు పారదర్శకంగా కోవిడ్–19 గణాంకాలను వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు. తమ ప్రభుత్వాల కృషిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పారదర్శకంగా గణాంకాలను కేంద్రానికి నివేదించాలని ఆయన అన్నారు. కొత్త కేసులు, మరణాల సంఖ్యలు పలు రాష్ట్రాలు తక్కువ చేసి చూపుతున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి సంక్రమణను ఆపేందుకు అవసరమైన ఇంటింటికీ పరీక్షలు, నిరంతర నిఘాకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన ఆరోగ్య పరికరాలను అందించి ఈ వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో హోం ఐసోలేషన్, చికిత్సకు సంబంధించి అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను సులభతరమైన భాషలో అందుబాటులో ఉంచాలని మోదీ అధికారులను కోరారు. వెంటిలేటర్ల ఉపయోగంపై మదింపు చేయండి అంతేగాక కొన్ని రాష్ట్రాల్లో వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయన్న నివేదికలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అందించిన వెంటిలేటర్లు ఏమేరకు ఉపయోగంలో ఉన్నాయో మదింపు చేయాలన్నారు. వీటిని ఇన్స్టాల్ చేసి, పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వెంటిలేటర్లను సరిగ్గా వినియోగించేలా ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైతే మరోసారి శిక్షణ అందించాలన్నారు. దేశంలో కోవిడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం శాస్త్రవేత్తలు, విషయ నిపుణుల మార్గనిర్దేశనంలో జరుగుతోందని, అది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వారానికి 1.3 కోట్ల టెస్టులు అంతకుముందు ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో దేశంలో కోవిడ్ పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల కరోనా పరీక్షలు జరగగా, ఇప్పుడు వారానికి 1.3 కోట్ల టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్న పాజిటివిటీ రేటు, పెరుగుతున్న రికవరీ రేటు గురించి ప్రధానికి వివరించారు. ఇటీవల రోజుకి 4 లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య హెల్త్ వర్కర్స్, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం తగ్గుతోందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, టెస్ట్‌లు, ఆక్సిజన్ లభ్యత, మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్ రోడ్ మ్యాప్ పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు. -
వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్ హెల్త్) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. ఎన్‌క్వాస్‌తో నాణ్యతకు భరోసా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్‌క్వాస్ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్ పేషెంట్ సేవలు మొదలు.. ఇన్ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఎస్ఆర్సీ (నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్ హెల్త్‌లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎన్‌క్వాస్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్‌క్వాస్ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్‌క్వాస్ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పేర్కొన్నారు. 1,400 చెక్ పాయింట్స్ ఎన్‌క్వాస్ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి. ► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఉన్నాయి. ► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్ చైర్లు ఉన్నాయి. ► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు. నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్‌క్వాస్ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
కరోనాతో వైద్య సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఏకంగా వైద్యరంగానికే సవాల్ విసురుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజా సంబం ధాల మధ్య పెరిగిన దూరం ‘ప్రపంచ వైద్య సంక్షోభం’ సృష్టించనుందనే సంకేతాలు వస్తున్నాయి. కోవిడ్–19 జనజీవనంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణ వైద్యసేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన నమూనా సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలోని 105 దేశాల్లో (అమెరికా ఖండం మినహా) 90 దేశాలు కరోనాయేతర వైద్యసేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు రూపొందించుకోవడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులు విరివిగా పెట్టి కనీస వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోకపోతే ఆయా దేశాల ప్రజానీకం వైద్య సేవల విషయంలో పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూహెచ్‌వో నమూనా సర్వే వెల్లడించింది. విధానాలు మార్చుకోవాల్సిందే.. సర్వే ఫలితాలను బట్టి ప్రపంచ దేశాలు వైద్య సదుపాయాల కల్పనలో విధానాలు మార్చుకోవాలని డబ్ల్యూహెచ్‌వో తన అధికారిక వెబ్సైట్లో సూచించింది. ‘ఇది ఒక పాఠం కావాలి. ప్రపంచ దేశాలు అత్యవసర సేవలు నిరంతరం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్ కన్సల్టేషన్‌ను విస్తృతం చేయాలి. ప్రిస్క్రిప్షన్ పద్ధతులూ మార్చుకోవాలి’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గాబ్రియేసస్ సూచించారు. ఈ వైద్య సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాము అన్ని దేశాలకు తగిన మార్గనిర్దేశం చేస్తామని, ఇందుకోసం ‘వైద్య సేవల లర్నింగ్ హబ్’ ఏర్పాటు చేస్తున్నామని, ఈ హబ్ ద్వారా ప్రపంచ దేశాలు తాము అవలంబిస్తున్న విధానాలను ఇతర దేశాలతో పంచుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, సర్వేను ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు నిర్వహించామని, ఇందుకోసం అన్ని దేశాల వైద్య మంత్రిత్వ శాఖల్లోని సీనియర్ అధికారులను సంప్రదించి వైద్యరంగంలో అవసరమైన 25 ముఖ్యమైన సేవలకు కోవిడ్ వల్ల కలిగిన ఇబ్బందులకు సంబంధించిన సమాచారం సేకరించామని వివరించింది. టీకాల నుంచి టీబీ నిర్ధారణ వరకు.. డబ్ల్యూహెచ్‌వో నమూనా సర్వేలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై కరోనా ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలువెల్లడయ్యాయి. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ముంగిటే అందించే వైద్యసేవలే కాకుండా ఆసుపత్రులకు వెళ్లి పొందే సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు 90% దేశాల్లో అంతరాయం ఏర్పడింది. కేన్సర్, ఎయిడ్స్‌లాంటి వాటికి చికిత్సతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ– చికిత్స, మలేరియాలాంటి జ్వరాలకు వైద్య సేవలు, 24 గంటల అత్యవసర సేవలు, రక్త మార్పిడి, అత్యవసర శస్త్రచికిత్సలు.. ఇలా అన్ని రకాల వైద్యసేవలకు కోవిడ్ విఘాతం కలిగించిందని సర్వేలో తేలింది. -
కరోనా టెస్టులు పెంచండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో డాక్టర్ సంజయ్ జాజు, డాక్టర్ రవీంద్రన్‌లతో కూడిన నిపుణుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను సందర్శించింది. అక్కడి ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆ తర్వాత దోమలగూడలోని దోభీగల్లీ కంటైన్మెంట్ ఏరి యాను సందర్శించి, క్షేత్రస్థాయిలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం గాంధీ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి అధికారులతో సమావేశమై.. యాక్టివ్ కేసులు, వెంటిలేటర్లు, చికిత్స విధానం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, ఇప్పటి వరకు ఇక్కడ అందించిన వైద్య సేవలు, చికిత్స తర్వాత కోలుకున్న రోగులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ఆస్పత్రి వైద్యులు వివరించారు. ఇదే సమయంలో కొంతమంది వైద్యులు కేంద్ర బృందాన్ని కలసి,క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. సీఎస్‌తో భేటీ..టెస్టులపై సీరియస్ ఆ తర్వాత కేంద్ర బృందం ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమైంది. వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి యోగితారాణా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలు, చికిత్సలు, కంటైన్మెంట్ విధానంపై వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు, అదనంగా మరో 4,489 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.475 కోట్లతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చినట్లు అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లగా..ఆశించిన స్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ చేయకుండా కోవిడ్ నియంత్రణ ఎలా సాధ్యమని కేంద్ర బృందం రాష్ట్ర అధికారులను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కంటైన్మెంట్ సరిగా చేయకుండా వైరస్ కట్టడి ఎలా సాధ్యమని నిలదీసినట్లు తెలిసింది. కాంటాక్ట్ కేసులను గుర్తించి, టెస్టులు నిర్వహించడం ద్వారానే కోవిడ్ నియంత్రణ సాధ్యమని బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ మేరకు టెçస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. -
అంబులెన్స్ వ్యవస్థకు జవజీవాలు
రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. 2010 తర్వాత 108, 104 వ్యవస్థలు ఎలా నీరుగారి పోయాయో అందరికీ తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో కొత్త అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వీటితో పాటు సంచార వైద్య శాలలుగా చెప్పుకునే 104 వాహనాలు పల్లెలకు సగర్వంగా తలెత్తుకుని వెళ్లనున్నాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే 108 వాహనాలతో పాటు పల్లె ప్రజలకు వైద్యం అందించడానికి మండలానికొక 104 వాహనం వెళ్లనుంది. జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు, రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా చిన్నారుల కోసం నియోనేటల్ కేర్ అంబులెన్స్‌లు సైతం రోడ్డు మీదకు రానున్నాయి. – సాక్షి, అమరావతి ఎన్నెన్నో ప్రత్యేకతలు పల్సాక్సీ మీటర్ ఆక్సిజన్ శాచ్యురేషన్ అంటే.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చూడటంతో పాటు పల్స్ రేటు చూపిస్తాయి. మల్టీపారా మానిటర్ ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు. ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ కొత్త వాహనాల్లో ఆక్సిజన్‌తో కూడిన ట్రాన్స్ పోర్ట్ వెంటిలేటర్ ఉంటుంది. బాధితుల పరిస్థితి విషమంగా ఉండి, శ్వాస తీసుకోలేని సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్‌ను ఉపయోగిస్తారు. సక్షన్ ఆపరేటర్ ప్రమాదంలో గాయపడినప్పుడు ఊపిరితి త్తుల్లో నిమ్ము, లేదా రక్తం చేరినప్పుడు ఆ తేమను లాగేం దుకు ఈ సక్షన్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. ఫోల్డబుల్ స్ట్రెచర్స్ గతంలో ఇవి లేవు. తాజాగా తెచ్చారు. స్ట్రెచర్‌ను పూర్తిగా మడత పెట్టి తీసుకెళ్లొచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది. సిరంజి పంపు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి ఐవీ ఫ్లూయిడ్స్ లేదా, ఇంజక్షన్లు ఎక్కించాల్సి వచ్చినప్పుడు టైమ్‌ను సెట్‌చేస్తే ఆ టైము ప్రకారం ఇది ఎక్కిస్తుంది. 104 వాహనాల్లో సేవలు ఇలా.. గతానికీ ఇప్పటికీ ఈ మొబైల్ మెడికల్ యూనిట్లను పూర్తి భిన్నంగా నిర్వ హించనున్నారు. ఇకపై ప్రతి పల్లెకూ నెలలో ఒకరోజు విధిగా వెళ్లాల్సిందే. మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ► ప్రతి 104 వాహనం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది. ► ఆ పీహెచ్సీ పరిధిలోకి వాహనం వెళ్లినప్పుడు పీహెచ్సీ సిబ్బంది లేదా ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది కూడా విధిగా వాహనం వద్దకు రావాల్సిందే. ► వాహనంలో డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. మొత్తం 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. 20 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ► గతంలో 52 రకాల మందులు (అవి కూడా ఉండేవి కావు) ఉండగా ఇప్పుడా సంఖ్యను 74కు పెంచారు. ► మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తారు. ► ఒకే రోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సినప్పుడు ఉదయం ఒక గ్రామానికి, సాయంత్రం మరో గ్రామానికి వాహనం వెళుతుంది. ► ప్రతి వాహనం విలేజి క్లినిక్‌కు కూడా అనుసంధానమై ఉంటుంది. ► గతంలో 104 వాహనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కిలోమీటర్లు ఆవల ఉన్న పల్లెలకు మాత్రమే వెళ్లేవి. చాలా చోట్ల నిర్వహణ సరిగా లేక నిర్ణయించిన మేరకు కూడా పల్లెలకు వెళ్లేవి కావు. నియోనేటల్ అంబులెన్స్‌లు ► గతంలో ఎప్పుడూ ఇలాంటి అంబులె న్స్‌లు ఏ ప్రభుత్వమూ నిర్వహించ లేదు. దేశంలో కూడా ఒకటీ లేదా రెం డు రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని అందుబా టులో ఉన్నాయి. ఏపీలో 26 నియోనే టల్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ► ఒక రోజు వయసున్న పిల్లల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రమాదం జరిగితే ఈ అంబులెన్స్‌లు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన సేవలందిస్తాయి. ► కొన్ని రకాల సౌకర్యాలు గతంలో ఉన్నా వాటిని నిర్వ హించక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయేవారు. -
‘డాక్టర్లకు ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందించకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లు ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితికి రావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోందని, ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దేశం మొత్తం డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిపై దయ, కరుణ చూపకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యవసర సమయంలో సేవలందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఉండటం చాలా విచారకరమని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అందించి వారికి మనోధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణీలో అలసత్వం వహించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదికన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలేషన్తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ చేపట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర సేవలకు కావాల్సిన పరికరాలు, నిధులు, సూచనలు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని అందించడంలో అలసత్వం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని సంజయ్ స్పష్టంచేశారు. -
నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు మందులు
సాక్షి, అమరావతి: పేద రోగులకు అందించే మందులను ముందుగా పరిశీలించి.. వాటి నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలకు కావాల్సిన అన్ని మందులను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికనుగుణంగా అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో తూతూమంత్రంగా ర్యాండం పద్ధతిలో సరఫరా అయ్యే మందుల్లో కొన్నిటికి మాత్రమే పరీక్షలు చేసేవారు. నాణ్యతను నిర్ధారించి, నాసిరకం అని తేల్చేసరికే రోగులు మందులను వాడుతుండేవారు. దీంతో ఉన్న జబ్బులు నయం కాకపోవడంతోపాటు కొత్త జబ్బుల బారిన పడేవారు. ఇప్పుడలా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకూ ప్రతి మందునూ నాణ్యత నిర్ధారించాకే సరఫరా చేయాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మందులకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) గుర్తింపు ఉన్న లేబొరేటరీల్లో నిర్ధారించి ఆస్పత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మూడు లేబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా.. వీటి సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. సగటున నెలకు 300 బ్యాచ్‌లకు సంబంధించిన మందుల నాణ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. ఏడాదికి 3600 బ్యాచ్‌లకు సంబంధించిన మందులకు పరీక్షలు చేశాకే ప్రజల్లోకి పంపిస్తారు. అదేవిధంగా సగటున 400 రకాల మందులు ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అవుతుండగా.. ఈ సంఖ్య మరికొద్ది రోజుల్లో 600కు చేరనుంది. ఈ నేపథ్యంలోనే లేబొరేటరీల సంఖ్యను పెంచుతున్నారు. మందులు లేబొరేటరీకి చేరిన 26 రోజులలోగా నాణ్యతను నిర్ధారించి.. సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి మందుకూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు ఇకపై ర్యాండం పద్ధతిలో మందుల నాణ్యత నిర్ధారణ జరగడానికి వీల్లేదు. ప్రతి మందుకూ నాణ్యత పరీక్షలు చేశాకే సరఫరా చేస్తాం. దీనికోసం పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పేద రోగికి నాణ్యమైన మందులు అందించడమే మా సంస్థ లక్ష్యం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. – విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
మొదటిరోజు సమ్మె ప్రశాంతం
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ/రామకృష్ణాపూర్/రుద్రంపూర్/ఇల్లెందు : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇఫ్టూ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన టోకెన్ సమ్మె మొదటి రోజు గురువారం ప్రశాంతంగా జరిగింది. కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, కోల్‌ట్రాన్స్‌పోర్టు, సివిక్, బెల్ట్‌క్లీనింగ్ తదితర విభాగాలలో పనిచేస్తున్న సుమారు 20వేల మందిలో 15వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. జేబీసీసీఐ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు అమలు, మెడికల్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టారు. ఆర్జీ పరిధి ఓసీపీ-3, ఓసీపీ-2లో సమ్మెను ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తుండగా సింగరేణిలో మాత్రం అమలు చేయడం లేదని, ప్రిన్సిపుల్ ఎంప్లాయర్‌గా ఉన్న సింగరేణి యాజమాన్యం ఈ విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. సమ్మెకు హెచ్ఎంఎస్, టీఎస్‌ఈయూ, ఏఐసీటీయూ, ఏఐ ఎఫ్‌టీయూ, టీఏకెఎస్, ఏఐఎఫ్టీయూ(న్యూ), ఎస్‌ఓబీ డబ్ల్యుయూ, టీఎస్ఓబీఓసీడీ, డబ్లూఏ మద్దతు తెలిపాయి. ఓసీపీల్లో నిలిచిన ఓబీ పనులు కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె కారణంగా సింగరేణిలో దాదాపుగా అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఓవర్‌బర్డెన్(ఓబీ) వెలికితీత పనులు నిలిచిపోయాయి. వాహనాలను క్యాంపు కార్యాలయాల వద్ద, ప్రాజెక్టుల సమీపంలో యాజమాన్యా లు నిలిపివేశాయి. రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల పరిధిలో సంపూర్ణంగా సమ్మె కొనసాగింది. అయితే ఓసీపీ-2 వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తారా? అని పరిశీలిస్తుండగా పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశా రు. దీంతో మంథని సర్పంచ్ పుట్ట శైలజ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇల్లెందు జేకే ఓసీపీ-4, బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓసీపీ వద్ద ఉదయం ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను నడిపించాలని యాజమాన్యాలు చూడగా కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి తిరిగి సమ్మె కొనసాగింది. ఇల్లెందులో 30 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఓసీపీ-3 వద్ద పోలీసులు కార్మికులను వెళ్లిపోవాలని సూచించగా వారు వెనక్కి తగ్గలేదు. న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్నామని, మద్దతు తెలపాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఆర్జీ-2 పరిధిలో.. కాంట్రాక్టు డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో 35వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు ఆగిపోయాయి. సుమారు 600మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లోనూ కాంట్రాక్టు కార్మికులు పూర్తిగా సమ్మెలోకి వెళ్లారు. దీంతో 50వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులు స్తంభించి పోయాయి.