గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ/రామకృష్ణాపూర్/రుద్రంపూర్/ఇల్లెందు : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇఫ్టూ అనుబంధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన టోకెన్ సమ్మె మొదటి రోజు గురువారం ప్రశాంతంగా జరిగింది. కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, కోల్‌ట్రాన్స్‌పోర్టు, సివిక్, బెల్ట్‌క్లీనింగ్ తదితర విభాగాలలో పనిచేస్తున్న సుమారు 20వేల మందిలో 15వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
జేబీసీసీఐ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు అమలు, మెడికల్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టారు. ఆర్జీ పరిధి ఓసీపీ-3, ఓసీపీ-2లో సమ్మెను ఇప్టూ రాష్ట్ర అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్‌రావు, కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్‌ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తుండగా సింగరేణిలో మాత్రం అమలు చేయడం లేదని, ప్రిన్సిపుల్ ఎంప్లాయర్‌గా ఉన్న సింగరేణి యాజమాన్యం ఈ విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. సమ్మెకు హెచ్‌ఎంఎస్, టీఎస్‌ఈయూ, ఏఐసీటీయూ, ఏఐ ఎఫ్‌టీయూ, టీఏకెఎస్, ఏఐఎఫ్‌టీయూ(న్యూ), ఎస్‌ఓబీ డబ్ల్యుయూ, టీఎస్‌ఓబీఓసీడీ, డబ్లూఏ మద్దతు తెలిపాయి.
ఓసీపీల్లో నిలిచిన ఓబీ పనులు
కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె కారణంగా సింగరేణిలో దాదాపుగా అన్ని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఓవర్‌బర్డెన్(ఓబీ) వెలికితీత పనులు నిలిచిపోయాయి. వాహనాలను క్యాంపు కార్యాలయాల వద్ద, ప్రాజెక్టుల సమీపంలో యాజమాన్యా లు నిలిపివేశాయి. రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల పరిధిలో సంపూర్ణంగా సమ్మె కొనసాగింది. అయితే ఓసీపీ-2 వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తారా? అని పరిశీలిస్తుండగా పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశా రు. దీంతో మంథని సర్పంచ్ పుట్ట శైలజ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇల్లెందు జేకే ఓసీపీ-4, బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓసీపీ వద్ద ఉదయం ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను నడిపించాలని యాజమాన్యాలు చూడగా కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి తిరిగి సమ్మె కొనసాగింది. ఇల్లెందులో 30 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఓసీపీ-3 వద్ద పోలీసులు కార్మికులను వెళ్లిపోవాలని సూచించగా వారు వెనక్కి తగ్గలేదు. న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్నామని, మద్దతు తెలపాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.
ఆర్జీ-2 పరిధిలో..
కాంట్రాక్టు డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో 35వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు ఆగిపోయాయి. సుమారు 600మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లోనూ కాంట్రాక్టు కార్మికులు పూర్తిగా సమ్మెలోకి వెళ్లారు. దీంతో 50వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులు స్తంభించి పోయాయి.
మొదటిరోజు సమ్మె ప్రశాంతం
Published Fri, Dec 19 2014 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement