సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందించకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లు ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితికి రావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోందని, ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దేశం మొత్తం డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిపై దయ, కరుణ చూపకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యవసర సమయంలో సేవలందిస్తున్న వారికి కనీసం కిట్స్ అందించలేని దుస్థితిలో ఉండటం చాలా విచారకరమని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సమయంలో డాక్టర్లకు రక్షణ, సౌకర్యాలు అందించి వారికి మనోధైర్యం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కిట్స్ పంపిణీలో అలసత్వం వహించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదికన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలేషన్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ చేపట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర సేవలకు కావాల్సిన పరికరాలు, నిధులు, సూచనలు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని అందించడంలో అలసత్వం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని సంజయ్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment