సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కరోనా పరీక్షల వివరాలను లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందానికి వివరిస్తున్న సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో డాక్టర్ సంజయ్ జాజు, డాక్టర్ రవీంద్రన్‌లతో కూడిన నిపుణుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించింది. గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను సందర్శించింది.
అక్కడి ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆ తర్వాత దోమలగూడలోని దోభీగల్లీ కంటైన్మెంట్ ఏరి యాను సందర్శించి, క్షేత్రస్థాయిలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం గాంధీ ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రి అధికారులతో సమావేశమై.. యాక్టివ్ కేసులు, వెంటిలేటర్లు, చికిత్స విధానం వంటి అంశాలపై ఆరా తీసింది. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, ఇప్పటి వరకు ఇక్కడ అందించిన వైద్య సేవలు, చికిత్స తర్వాత కోలుకున్న రోగులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ఆస్పత్రి వైద్యులు వివరించారు.
ఇదే సమయంలో కొంతమంది వైద్యులు కేంద్ర బృందాన్ని కలసి,క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. సీఎస్‌తో భేటీ..టెస్టులపై సీరియస్ ఆ తర్వాత కేంద్ర బృందం ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమైంది. వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి యోగితారాణా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలు, చికిత్సలు, కంటైన్మెంట్ విధానంపై వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు, అదనంగా మరో 4,489 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.475 కోట్లతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చినట్లు అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లగా..ఆశించిన స్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ చేయకుండా కోవిడ్ నియంత్రణ ఎలా సాధ్యమని కేంద్ర బృందం రాష్ట్ర అధికారులను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కంటైన్మెంట్ సరిగా చేయకుండా వైరస్ కట్టడి ఎలా సాధ్యమని నిలదీసినట్లు తెలిసింది. కాంటాక్ట్ కేసులను గుర్తించి, టెస్టులు నిర్వహించడం ద్వారానే కోవిడ్ నియంత్రణ సాధ్యమని బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ మేరకు టెçస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment