నిరీక్షణ: మంచిర్యాల జిల్లా తాండూరు పీహెచ్‌సీ ఎదుట ఎండలో కూర్చుని టెస్టుల కోసం పడిగాపులు
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: ఇది ఒక్క దస్రు, పరిస్థితే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా నిర్ధారణ టెస్టులు ప్రజల సహనానికి నిజంగా పరీక్ష పెడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న అనేకమంది అనుమానితులు సకాలంలో కరోనా పరీక్ష చేయించుకోలేకపోతున్నారు. ఉదయాన్నే వెళ్లి క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నా ఫలితం ఉండటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పరీక్షా కేంద్రాలకు రోజూ వందల సంఖ్యలో అనుమానితులు వస్తుంటే, కిట్లు లేవంటూ చాలామందిని సిబ్బంది తిప్పిపంపుతున్నారు. పదిరోజుల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాలు కలిపి ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 55 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పట్టణాల్లో ఎక్కువగా ఉండే ప్రైవేటు కేంద్రాలను పక్కన పెడితే గ్రామాల్లోని ప్రభుత్వ కేంద్రాల్లో జరిగే పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందనే విషయం స్పష్టమవుతోంది. కొందరు మూడు నాలుగురోజులు తిరిగినా ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోలేక పోతున్నారంటే రాష్ట్రంలో కరోనా టెస్టులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. నిస్సహాయ పరిస్థితుల్లో కొందరు అనుమానితులు తమకు పరీక్ష చేయండంటూ సిబ్బందిని ప్రాథేయపడుతున్నారు. కొందరు నిలదీస్తుంటే మరికొందరు ధర్నాలు, బైఠాయింపులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు వ్యయ ప్రయాసలతో ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తుంటే, వైరస్ సోకిన వారు సకాలంలో టెస్టు చేయించుకోలేని ఫలితంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. పరీక్షల కోసం మూడు నాలుగురోజులు తిరిగే క్రమంలో వైరస్ ఇతరులకు వ్యాపించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు.
పదిరోజుల్లో 6.38 లక్షల పరీక్షలు
ప్రభుత్వం నిర్వహించే 1,085 కేంద్రాల్లో 1,064 పరీక్షా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ (ఆర్‌ఏటీ) పరీక్షలు చేస్తుండగా... మిగతా 21 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. నెలక్రితం వరకు ఒక్కో కేంద్రంలో సగటున 100–150 నమూనాలు స్వీకరించి పరీక్షలు చేసిన వైద్యశాఖ సిబ్బంది.. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 63 వేల పరీక్షలు చేస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,38,286 నమూనాలు స్వీకరించారు. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 4,62,820, ప్రైవేటు కేంద్రాల్లో 1,75,466 పరీక్షలు చేశారు. అంటే రోజుకు సగటున 55 పరీక్షలు మాత్రమే చేసినట్లు తెలుస్తోంది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల సంఖ్య 25–30 మధ్యే ఉంటోంది. వీరు కూడా ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడితే చాలాచోట్ల ముందుగా టోకెన్లు ఇచ్చి తర్వాత పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా సిబ్బంది కిట్లు లేవని తిప్పి పంపేస్తున్నారు. కోవిడ్–19 రెండోదశ తీవ్రత దృష్ట్యా పరీక్షలను విరివిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అదేవిధంగా రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం సైతం రోజుకు కనీసం లక్ష పరీక్షలు చేయాలని వైద్య,ఆరోగ్య శాఖను ఆదేశించింది. అయినా పరీక్షల సంఖ్య రోజురోజుకూ తగ్గడమే తప్ప పెరుగుతున్న దాఖలాలు లేవని ప్రజలు విమర్శిస్తున్నారు.
మెరుగైన చికిత్సపైనే సర్కారు దృష్టి
కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల కంటే చికిత్సను మెరుగ్గా అందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్సపైనే దృష్టి్ట సారించింది. మొదటి దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.
– జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్
నాలుగు రోజులు పట్టింది
నాకు జ్వరమచ్చినట్లయితాందని కరోనా పరీక్ష కోసం పందిల్ల నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి మూడురోజుల నుంచి వత్తన్న. పొతన్న. నేను వచ్చే వరకే మంది బాగా ఉంటాండ్లు. టోకెన్ కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి చెప్పులు పెట్టి క్యూ కడుతున్న. సిబ్బంది వచ్చే వరకు చెట్ల కిందనే ఉంటున్నా. రోజుకు 30 నుంచి 40 మందికే పరీక్షలు చే స్తున్నరు. కానీ రోజూ వందల మంది వస్తాండ్లు. కౌంటర్ దగ్గర ఒక్కరికొక్కరు మీద పడి ఎగబడుతాండ్లు. రోగం ఉందో లేదోమోకని, ఈ లైన్ల నిలబడితే లేని రోగాన్ని తెచ్చుకున్నట్లే. ఈరోజు కూడా దొరుకుతదో లేదో అనుకున్నా కానీ ఈరోజు చేసిండ్రు.
– తోలు రాజయ్య, పందిల్ల, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
మందులిచ్చి పంపిస్తున్నారు!
ఈమె పేరు మేడి రాజమ్మ. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కిష్టంపేటకు చెందిన ఈమె నాలుగు రోజులుగా దగ్గుతో బాధపడుతోంది. కరోనా కావచ్చని అనుమానించిన ఆమె గురువారం తాండూరు పీహెచ్‌సీకి వచ్చింది. ‘నీకు పరీక్ష అవసరం లేదు. మందులు వాడు తగ్గిపోతుంది’ అని అక్కడి సిబ్బంది కొన్ని మందులు చేతిలో పెట్టి పంపించారు. ఈ పీహెచ్‌సీకి గురువారం 45 మంది అనుమానితులు టెస్టుల కోసం వస్తే 26 మందికి పరీక్షలు చేశారు. మిగతావారిని రాజమ్మకు చెప్పినట్టే చెప్పి తిప్పి పంపేశారు. కిట్ల కొరత కారణంగానే ముందు వచ్చిన వారికి టెస్టులు చేస్తున్నట్లు సిబ్బంది చెప్పారు.
మేం పోంగనే కిట్లు అయిపోయినై అంటున్నరు
నాకు, నా భార్యకు దగ్గు, జ్వరం వచ్చింది. అందరు కరోనా వచ్చింది పరీక్ష చేసుకొమ్మని చెప్పారు. పరీక్ష కోసం మా తండాకు, పరీక్షలు చేసే కొరవి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురవి నాలుగు రోజులుగా పోయి వస్తున్నాం. మేము పోగానే కిట్లు అయిపోయినై అంటుండ్రు. ఆటోలో ఎక్కించుకునేందుకు డ్రైవర్లు ఇబ్బంది పడుతుండ్రు. తండా వాళ్ళందరూ వేరే తీరుగా చూస్తుండు. తొందరగా పరీక్ష చేస్తే.. మా ఇబ్బంది మేము పడతాం.
– ధారవత్ హరి, పద్మ దంపతులు, మోదుగుల గూడెం జుజ్జురు తండా
జిల్లా ఆసుపత్రిలో కూడా..
ఇతని పేరు సీహెచ్ అశోక్‌రావు. సిరిసిల్ల బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తాడు. 28 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. మళ్లీ డ్యూటీలో చేరాలంటే.. కరోనా టెస్టు రిపోర్టు కావాలి. అశోక్‌రావు ఉండేది ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో. సిరిసిల్ల జిల్లాసుపత్రికి గురువారం టెస్ట్ కోసం వస్తే.. కిట్లు లేవని సిబ్బంది చెప్పారు. గత మూడ్రోజులుగా అశోక్‌రావు టెస్టు కోసం వస్తున్నా ఇదే పరిస్థితి. గురువారం ఉదయం 8–30 గంటలకు వచ్చినా కిట్లు లేక టెస్టు చేయలేమని సిబ్బంది చెప్పారని అశోక్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులు తిరిగి..9 కి.మీ. నడిచి...
రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనుమానితుల ఇబ్బందులుఇంట్లో దిగాలుగా కూర్చున్న ఇతడి పేరు బుక్యా దస్రు (మహబూబాబాద్ జిల్లా బోరింగ్ తండా). కొద్దిరోజులుగా కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఈయన నిర్ధారణ పరీక్ష కోసం సోమవారం 9 కిలోమీటర్ల దూరం లోని కొత్తగూడ పీహెచ్‌సీకి వెళ్లాడు. అప్పటికే బారులుతీరిన జనంతో కలిసి క్యూలో నిలబడ్డాడు. అతడి వంతు వచ్చేసరికి సమయం మించిపోయిందన్నారు.
మళ్లీ మంగళవారం వెళ్లగా కిట్లు లేవన్నారు. బుధవారమూ అదే పరిస్థితి. అప్పటికి దగ్గు తీవ్రమైంది. దగ్గుతున్నాడని ఆటో వాళ్లు ఎక్కించుకోకపోవడంతో 9 కిలోమీటర్ల మేర కాళ్లీడ్చుకుంటూ ఆరోజు ఇంటికి చేరాడు. గురువారం పరిస్థితి విషమిం చడంతో బంధువులు నర్సంపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ మూడు రోజులు పరీక్షల కోసం తిరిగినందుకు రూ.400కుపైగా ఖర్చుచేశాడు. చివరకు పరీక్ష చేయించుకోకుండానే ఆస్పత్రి పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment