నెగెటివా.. నమ్మలేం! | 90 Percentage Rapid Antigen Tests For Covid 19 In Telangana | Sakshi
Sakshi News home page

నెగెటివా.. నమ్మలేం!

Published Fri, Jul 31 2020 2:44 AM | Last Updated on Fri, Jul 31 2020 10:30 AM

90 Percentage Rapid Antigen Tests For Covid 19 In Telangana - Sakshi

అతని పేరు జానకీరాం.. హైదరాబాద్‌లో ఉంటారు. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. జ్వరం, దగ్గు ఉండటంతో ఇటీవల సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. అరగంటలో అతనికి నెగెటివ్‌ అని తేలింది. ఎంతో సంబరపడ్డాడు. అయితే తర్వాత రెండ్రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో ప్రముఖ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నాడు. అందులో అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన జానకీరాం ఆ డయాగ్నస్టిక్‌ సెంటర్‌పై గొడవకు దిగాడు. తనకు అక్కడ నెగెటివ్‌ వస్తే ఇక్కడ ఎందుకు పాజిటివ్‌ వచ్చిందని తగాదా పెట్టుకున్నాడు.

ఇక మరో వ్యక్తి రమేశ్‌.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు. అతనికి 102 డిగ్రీల జ్వరం, పొడి దగ్గు ఉండటంతో తక్షణమే డాక్టర్‌ను సంప్రదించగా మెడిసిన్‌ ఇచ్చారు. అయితే ఒక స్నేహితుడి సలహా మేరకు రమేశ్‌ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయించుకున్నాడు. నెగెటివ్‌ అని తేలింది. కానీ అతనికి మాత్రం జ్వరం, పొడి దగ్గు, నీరసం ఉన్నాయి. తనకు నెగిటివ్‌ వచ్చిందని కుటుంబ సభ్యులతో కలసిమెలిసి ఉంటున్నాడు. లక్షణాలున్నాయి కదా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకోమని చెబితే, తనకు నెగెటివ్‌ వచ్చింది కదా అని ధీమాగా ఉన్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: ఇవీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కరోనా నిర్ధారణ పరీక్షలతో గందరగోళం తలెత్తుతోంది. ఇందులో నెగెటివ్‌ వచ్చినా.. బాధితుడికి కరోనా లేదని ధ్రువీకరించలేని పరిస్థితులుం డటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు ల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే నిర్ధారణ చేస్తారు. అయితే నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 70 శాతంలోపేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది.

నెగెటివ్‌ వచ్చిన వారందరికీ తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయాల్సిందేనని నెల క్రితం ప్రకటించిన ఐసీఎంఆర్‌.. దాదాపు పది రోజుల క్రితం దానికి కీలక సవరణ చేసింది. ‘యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయాలని, వారికి ఎలాంటి లక్షణాలు లేకుంటేనే దాన్ని నెగెటివ్‌గానే పరిగణించాలని’స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా మార్గదర్శకాలున్నా యాంటిజెన్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చి, లక్షణాలున్నవారు దర్జాగా బయట తిరుగుతున్నారు. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో వచ్చే నెగెటివ్‌ ఫలితాలపై నీలినీడలు అలుముకున్నాయి.

90 శాతం యాంటిజెన్‌ టెస్టులే...
రాష్ట్రంలో మొదట్లో ఆర్‌టీ–పీసీఆర్‌ ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు వీటిని నిర్వహిస్తున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఫలితాల కోసం రెండు, మూడ్రోజుల నుంచి వారం పది రోజుల వరకు నిరీక్షించాల్సి రావడంతో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగి సీరియస్‌గా మారుతుండేది. దీంతో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయించుకునేందుకే బాధితులు ఎగబడుతున్నారు. ఈ పరీక్ష చేసిన అర గంటలోపే ఫలితం వస్తుండటంతో ప్రభుత్వం కూడా వీటిని విరివిగా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,100 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు పైస్థాయి వరకు ఈ టెస్టులు జరుగుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏకంగా 7 లక్షల యాంటిజెన్‌ కిట్లను తెప్పించింది. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి యాంటిజెన్‌ టెస్టులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి మరింత అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 4.16 లక్షల టెస్టులు చేస్తే, అందులో దాదాపు 2 లక్షలు యాంటిజెన్‌ టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ కూడా ఈ 15 నుంచి 20 రోజుల మధ్య చేసినవేనని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న టెస్టుల్లో 90 శాతం యాంటిజెన్‌ టెస్టులేనని ఆయన పేర్కొన్నారు. 

ఆర్‌టీ–పీసీఆర్‌ చేయించుకోవడంలో నిర్లక్ష్యం..
రాష్ట్రంలో కరోనాకు సంబంధించి విరివిగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. మొబైల్‌ ల్యాబ్‌ల ద్వారా కూడా చేస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. నెగిటివ్‌ వచ్చి లక్షణాలున్న వారికి ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయాలన్న నిబంధనను కింది స్థాయిలో పట్టించుకోవడం లేదు. పైగా దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో యాంటిజెన్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చి లక్షణాలున్నా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవడంలేదు. దీంతో చాలామంది లక్షణాలున్నవారు వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలంటున్నారు. దీనివల్ల కూడా బాధితులు వెనక్కు తగ్గుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement