సాక్షి, హైదరాబాద్: కట్టడి ప్రాంతా (కంటైన్మెంట్ జోన్లు)ల్లోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలున్నా, లేకున్నా కట్టడి ప్రాంతాల్లో పెద్దాచిన్నా అందరికీ నూటికి నూరు శాతం పరీక్షలు చేయాలని స్పష్టంచేసింది. కరోనా సామాజిక వ్యాప్తి జరగడంతో ఐసీఎంఆర్ ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. వీటిని అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో లక్షణాలున్నవారికి, వారి ప్రాథమిక, రెండో కాంటాక్టులకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో లక్షలాది మందికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2,300కుపైగా కట్టడి ప్రాంతాలున్నాయి. కొన్ని జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే కట్టడిలో ఉన్నాయి. ఇవికాక, ఇతర ప్రాంతాల్లో 65 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్న వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరని సూచించింది. అవసరాన్ని బట్టి రాష్ట్రాలు కొన్ని సవరణలతో ఈ మార్గదర్శకాలను పాటించవచ్చంది. ఒకరకంగా వైరస్ విస్తరిస్తున్న నగరాల్లో కట్టడి ప్రాంతాల్లో వంద శాతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి.
నాన్ కంటైన్మెంట్ ఏరియాల్లో ఇలా..
ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణం చేసి వచ్చి, రోగ లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయాలి. ఇప్పటికే కరోనా నిర్ధారణైన వ్యక్తులు, కుటుంబసభ్యులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. లక్షణాలున్న ఆరోగ్య కార్యకర్తలు, వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఫ్రంట్‌లైన్ కార్మికులకూ పరీక్షలు తప్పనిసరి. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చినవారు, వలస వెళ్లొచ్చి.. లక్షణాలున్న వారికి, అత్యధిక హైరిస్క్ లో ఉండే 65 ఏళ్లు పైబడినవారు, అనారోగ్యంతో ఉన్నవారికి పరీక్షలు చేయాలి.
ఆసుపత్రుల్లో ఏం చేయాలంటే?
అన్ని ఆసుపత్రుల్లో తీవ్ర శ్వాసకోశ సమస్య ఉన్న రోగులందరికీ కరోనా టెస్టులు చేయాలి. రోగనిరోధక శక్తిలేని, ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, 65ఏళ్లు పైబడినవారు, అవయవ మార్పిడికి ఆసుపత్రిలో చేరిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్ష చేయాలి. ఒక్కోసారి వీరికి ఆసుపత్రిలో చేరడానికి ముందే టెస్టులు చేయాలి. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉన్న రోగులకు లేదా వారానికంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉన్న రోగులకు వైరస్ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షించకూడదు. కరోనా పరీక్ష చేసే వసతి లేనప్పుడు వీలైతే శస్త్రచికిత్సను వాయిదా వేయాలి. టెస్ట్ చేశాకే ఆపరేషన్ చేయాలి. ప్రసవానికి ఆసుపత్రిలో చేరిన గర్భిణులకూ కరోనా పరీక్షలు తప్పనిసరి. ఒకవేళ తల్లికి పాజిటివ్ వస్తే, 14 రోజుల పాటు బిడ్డకు పాలివ్వడం వంటివి చేయాల్సివస్తే మాస్క్ ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యం, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడే నవజాత శిశువులకూ టెస్ట్ చేయాలి.
ర్యాపిడ్‌లో నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే..
వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే వారికి ముందే కరోనా టెస్ట్ చేయాలి. నెగెటివ్ ఉంటేనే ప్రయాణానికి అనుమతివ్వాలి. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేశాక పాజిటివ్ వస్తే నిర్ధారించుకునేందుకు మరోసారి పరీక్ష అవసరంలేదు. కరోనా నుంచి కోలుకున్నాక వారికి తిరిగి పరీక్ష నిర్వహించనక్కర్లేదు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చాక కూడా సంబంధిత వ్యక్తిలో లక్షణాలుంటే, తప్పక ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేయాలి. ఒకవేళ అప్పటికప్పుడు వారిలో లక్షణాలు లేకున్నా తర్వాత వారిలో వృద్ధి చెందితే మళ్లీ పరీక్ష చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment