69% మందికి లక్షణాల్లేవ్‌..! | There Is No Symptoms For 69 Percentage People | Sakshi
Sakshi News home page

69% మందికి లక్షణాల్లేవ్‌..!

Published Tue, Sep 1 2020 4:58 AM | Last Updated on Tue, Sep 1 2020 10:46 AM

There Is No Symptoms For 69 Percentage People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,963 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 86,225 మందికి లక్షణాల్లేవని తెలిపింది. ఇక 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువ. ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్‌ సోకుతోంది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రాథమిక, రెండో కాంటాక్టులకు అధిక పరీక్షలు
కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ముందంజలో ఉంది. ఆదివారం 37,791 శాంపిళ్లను సేకరించగా, వాటిలో ప్రాథమిక, రెండో కాంటాక్ట్‌ ద్వారా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకున్న వారు 59 శాతం మంది ఉన్నారు. మిగిలిన 41 శాతం మంది డైరెక్ట్‌ బాధితులు. అంటే ఈ బాధితుల ద్వారా ప్రాథమిక కాంటాక్టు అనుమానంతో 17,006 (45%) మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ప్రాథమిక కాంటాక్టుల నుంచి రెండో కాంటాక్టు అయిన వారిలో 5,290 (14%) మందికి పరీక్షలు నిర్వహించారు. డైరెక్ట్‌ బాధితుల నుంచి ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను ట్రేసింగ్‌ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ కృషి ఫలించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతుండగా, వాటి ద్వారా ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో ట్రేసింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను వెంటనే గుర్తించడం వల్ల వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది.

తగ్గుతున్న సీరియస్‌ కేసులు
లక్షణాల్లేకుండా ఎక్కువ మంది కరోనా బారినపడటం, వారి ద్వారా వైరస్‌ సోకిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారు. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులుంటే, 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సగానికిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. మొదట్లో దాదాపు 70 శాతం పడకలు కరోనా రోగులతో నిండేవి. అప్పట్లో కొంత నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం వల్ల సీరియస్‌ అయ్యాకే బాధితులు వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు చేస్తుండటంతో కరోనా నిర్ధారణ సులువైంది. అందుబాటులో వ్యాధి నిర్ధారణ కేంద్రాలుండటంతో అనుమానమున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement