సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అదేస్థాయిలో ముందుకెళ్తోంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు, టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రికార్డు స్థాయిలో 1,01,986 నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చడంతోపాటు 1,02,886 మందికి టీకాలు వేసింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాస రావు శుక్రవారం బులెటిన్ విడుదల చేశారు.
17.83 లక్షలకు చేరుకున్న కరోనా టీకాలు...
గురువారం ఒక్కరోజే 45 ఏళ్లు పైబడ్డ 95,871 మందికి మొదటి డోస్ టీకాలు వేయగా 5,740 మందికి రెండో డోస్ టీకాలు వేశారు. అలాగే గతంలో టీకాలు వేసుకోని కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా గురువారం టీకాలు ఇచ్చారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్నవారు 14,99,801 మందికాగా రెండో డోస్ తీసుకున్నవారు 2,83,407 మంది ఉన్నారు. అంటే రెండు డోస్ టీకాలు తీసుకున్న వారి సంఖ్య 17,83,208కు చేరింది. సగటున 2.51 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. మున్ముందు లక్షన్నర మందికి టీకాలు వేసేలా ప్రణాళిక రచించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు టీకా వేసుకోని వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేస్తామని ఆయన చెప్పారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించామన్నారు.
ఒక్కరోజే 2,478 కేసులు...
రాష్ట్రంలో గురువారం 2,478 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 402 కేసులు నమోదయ్యాయి. తాజాగా 363 మంది కోలుకోగా ఇప్పటివరకు 3,03,964 మంది కోలుకున్నారు. ఒక రోజులో ఐదుగురు చనిపోగా ఇప్పటివరకు కరోనాతో 1,746 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.63 శాతంగా నమోదవగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 15,472 ఉండగా, అందులో ఇళ్లలో, కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో, ఐసోలేషన్‌లో 9,674 మంది ఉన్నారు. ఇప్పటివరకు 1,07,61,939 నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 3,21,182 కేసులు నమోదయ్యాయి.
గాంధీలో ఒక్కరోజులో 75 మంది అడ్మిట్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీయూ రోగుల సంఖ్య అమాంతం పెరిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 75 మంది కరోనా బాధితులు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో నయంకాకపోవడంతో చివరి దశలో వస్తున్న వరేనని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గాంధీ కోవిడ్ ఐసీయూలో 232 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు రోగుల రద్దీకి అనుగుణంగా ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. గాంధీ కరోనా టీకా కేంద్రంలో ప్రతిరోజూ 300 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, అర్హులైన వారంతా టీకా వేయించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment