కోవిడ్‌ టెస్టుల్లో ఏపీ టాప్‌ | Andhra Pradesh Top In Covid Tests | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ టెస్టుల్లో ఏపీ టాప్‌

Published Thu, Aug 12 2021 10:25 AM | Last Updated on Thu, Aug 12 2021 10:29 AM

Andhra Pradesh Top In Covid Tests - Sakshi

కోవిడ్‌ నిర్ధారణలో అత్యధిక కచ్చితత్వం ఆర్టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌) టెస్టులు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో ఎక్కువ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కింది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిర్ధారణలో అత్యధిక కచ్చితత్వం ఆర్టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌) టెస్టులు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో ఎక్కువ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కింది. ఖర్చు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ టెస్టులకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన మొత్తం ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో తమిళనాడు తర్వాత అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే.

తమిళనాడులో 99 శాతం టెస్టులు ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో జరుగుతుండగా.. ఏపీలో 97 శాతం ఆర్టీపీసీఆర్‌ టెస్టులు జరుగుతున్నట్టు వెల్లడైంది. కేరళ వంటి రాష్ట్రాలు సైతం నేటికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల పైనే ఆధారపడుతున్నాయి. మన రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి చెందే నాటికి ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. అలాంటిది 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్లే పెద్ద సంఖ్యలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగలుగుతున్నారు.

పాజిటివిటీ తగ్గింది
ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకూ దేశంలో 10 శాతం అంతకంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న 45 జిల్లాలను గుర్తించారు. ఇందులో ఏపీకి సంబంధించిన జిల్లాలు లేవు. అంతేకాదు 5 నుంచి 10 శాతం లోపు పాజిటివిటీ రేటు ఉన్న 37 జిల్లాలను గుర్తించగా.. అందులోనూ ఒకే ఒక్క జిల్లా ఉంది. అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో 7.25 శాతం మాత్రమే పాజిటివిటీ ఉన్నట్టు వెల్లడైంది. దేశంలోని చాలా జిల్లాల్లో 7 నుంచి 9 వరకూ పాజిటివిటీ ఉంది. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు కేరళలోనే 11 ఉండగా.. 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 ఉన్నాయి. మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువగానే పాజిటివిటీ ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.

అత్యధిక పాజిటివిటీ రేటు అక్కడే
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో వంద టెస్టులు చేస్తే 60కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాగా చురును గుర్తించారు. నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలో 51.52 శాతం పాజిటివిటీ రేటు నమోదై రెండో స్థానంలో నిలిచింది. పుదుచ్చేరిలోని మహే జిల్లా 35.94 శాతం పాజిటివిటీతో మూడవ స్థానంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement