న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ధోరణి విస్తృతమవుతోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని చూసి.. మెరుగైన ఆరోగ్య వసతులు ఉన్న చోటకు వలసపోదామన్న ఆలోచన వ్యాపారస్తుల్లో కలుగుతోంది. ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ వ్యాపారి మూడు దశాబ్దాల్లో బాగానే ఆస్తులను సమకూర్చుకున్నారు. తాజా పరిస్థితుల్లో అతడు తన కుటుంబాన్ని తీసుకుని న్యూజిలాండ్ లేదా కెనడాకు వెళ్లి స్థిరపడే ఆలోచనలో ఉన్నాడు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. అతడి సమీప బంధువు ఒక్కగానొక్క కుమారుడు కరోనాకు బలైపోవడాన్ని చూసిన తర్వాతే అతడిలో ఈ మార్పు వచ్చింది. ఎంత డబ్బుంటేమి.. ప్రాణాలు దక్కలేదు! అన్న బాధతో పరాయి దేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. నోయిడాకు చెందిన మరో వ్యాపారి తన కుటుంబాన్ని తీసుకుని ఖతార్ వెళ్లిపోయాడు. మెరుగైన హెల్త్‌కేర్ వసతుల కోసమే అతడు వలసపోయాడు. ఈ ఇద్దరే అని కాదు కరోనా వచ్చిన తర్వాత దేశం వీడిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని ట్రావెల్ పరిశ్రమ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
మెరుగైన వైద్యం కావాలి..
కరోనా రెండో విడత చాలా తీవ్రంగా ఉండడం, లక్షలాది కేసులు రోజువారీగా నమోదు కావడాన్ని చూశాం. ఆస్పత్రుల్లో పడకలు లభించడానికి చాలా ప్రాంతాల్లో అవస్థలు పడాల్సి వచ్చింది. పడకలు, వైద్యం లభించక పోయిన ప్రాణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్, ఔషధాలు అందక, ఆస్పత్రుల్లో ఐసీయూలు, పడకలపై ఉన్న వారికి ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మెరుగైన వైద్య వసతులు ఏ ఏ దేశాల్లో ఉన్నాయనే విషయమై విచారణ చేస్తూ, విదేశాలకు ప్రయాణం కట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. ధనవంతులే కాకుండా, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన రెండు నెలల్లో విదేశాలకు వలసపోవడంపై విచారించే వారి సంఖ్య 20 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రానున్న రోజుల్లో విదేశాలకు సంబంధించి విచారణలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలిసిన వారి సూచనలతో చాలా మంది పర్యాటక సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
సులభతర వీసా విధానం
అమెరికా, కెనాడా, ఆస్ట్రేలియా వంటి ప్రముఖ దేశాలనే కాదు.. చిన్న దేశాలైన ఆస్ట్రియా, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్టా, సైప్రస్, టర్కీ దేశాల్లో వసతులు, జీవన విధానం ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టు ట్రావెల్ పరిశ్రమకు చెందిన వారు తెలిపారు. ప్రధానంగా సులభ వీసా ఏ దేశం నుంచి లభిస్తుంటే ఆ దేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కే మొగ్గు చూపిస్తున్నారు. ‘‘కరోనా రెండో దశలో ప్రతీ కుటుంబంపై ప్రభావం చూపించింది. దీంతో వలసవిధానంలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది’’ అని వీసా, ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఐవీఏసీఎస్ డైరెక్టర్ చంద్రజిత్‌సింగ్ తెలిపారు. కరోనా రాక ముందు వరకు వ్యాపార అవకాశాల విస్తరణ కోసం, సులభతర పన్నుల విధానం చూసి విదేశాలకు వలసవెళ్లే వారు ఎక్కువగా ఉండే వారని.. ఇప్పుడు మెరుగైన వైద్య వసతులు కూడా ప్రాధాన్యాల జాబితాలోకి చేరిపోయిందని ఆయన చెప్పారు.
కరోనా నేర్పిన పాఠాలు: విదేశాలవైపు భారతీయుల చూపు
Published Tue, Jun 8 2021 2:40 AM | Last Updated on Tue, Jun 8 2021 5:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment