సాక్షి, అమరావతి: పేద రోగులకు అందించే మందులను ముందుగా పరిశీలించి.. వాటి నాణ్యత నిర్ధారించాకే ఆస్పత్రులకు సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలకు కావాల్సిన అన్ని మందులను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికనుగుణంగా అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో తూతూమంత్రంగా ర్యాండం పద్ధతిలో సరఫరా అయ్యే మందుల్లో కొన్నిటికి మాత్రమే పరీక్షలు చేసేవారు. నాణ్యతను నిర్ధారించి, నాసిరకం అని తేల్చేసరికే రోగులు మందులను వాడుతుండేవారు. దీంతో ఉన్న జబ్బులు నయం కాకపోవడంతోపాటు కొత్త జబ్బుల బారిన పడేవారు. ఇప్పుడలా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకూ ప్రతి మందునూ నాణ్యత నిర్ధారించాకే సరఫరా చేయాలని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
మందులకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) గుర్తింపు ఉన్న లేబొరేటరీల్లో నిర్ధారించి ఆస్పత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మూడు లేబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా.. వీటి సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. సగటున నెలకు 300 బ్యాచ్‌లకు సంబంధించిన మందుల నాణ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే.. ఏడాదికి 3600 బ్యాచ్‌లకు సంబంధించిన మందులకు పరీక్షలు చేశాకే ప్రజల్లోకి పంపిస్తారు. అదేవిధంగా సగటున 400 రకాల మందులు ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అవుతుండగా.. ఈ సంఖ్య మరికొద్ది రోజుల్లో 600కు చేరనుంది. ఈ నేపథ్యంలోనే లేబొరేటరీల సంఖ్యను పెంచుతున్నారు. మందులు లేబొరేటరీకి చేరిన 26 రోజులలోగా నాణ్యతను నిర్ధారించి.. సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు.
ప్రతి మందుకూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు
ఇకపై ర్యాండం పద్ధతిలో మందుల నాణ్యత నిర్ధారణ జరగడానికి వీల్లేదు. ప్రతి మందుకూ నాణ్యత పరీక్షలు చేశాకే సరఫరా చేస్తాం. దీనికోసం పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పేద రోగికి నాణ్యమైన మందులు అందించడమే మా సంస్థ లక్ష్యం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం.
– విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment