కరోనాతో వైద్య సంక్షోభం | Corona Virus Poses Challenge To Medical Field | Sakshi
Sakshi News home page

కరోనాతో వైద్య సంక్షోభం

Published Thu, Sep 3 2020 1:39 AM | Last Updated on Thu, Sep 3 2020 8:32 AM

Corona Virus Poses Challenge To Medical Field - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఏకంగా వైద్యరంగానికే సవాల్‌ విసురుతోంది. ఈ వైరస్‌ కారణంగా ప్రజా సంబం ధాల మధ్య పెరిగిన దూరం ‘ప్రపంచ వైద్య సంక్షోభం’ సృష్టించనుందనే సంకేతాలు వస్తున్నాయి. కోవిడ్‌–19 జనజీవనంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణ వైద్యసేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన నమూనా సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలోని 105 దేశాల్లో (అమెరికా ఖండం మినహా) 90 దేశాలు కరోనాయేతర వైద్యసేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు రూపొందించుకోవడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులు విరివిగా పెట్టి కనీస వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోకపోతే ఆయా దేశాల ప్రజానీకం వైద్య సేవల విషయంలో పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూహెచ్‌వో నమూనా సర్వే వెల్లడించింది. 

విధానాలు మార్చుకోవాల్సిందే..
సర్వే ఫలితాలను బట్టి ప్రపంచ దేశాలు వైద్య సదుపాయాల కల్పనలో విధానాలు మార్చుకోవాలని డబ్ల్యూహెచ్‌వో తన అధికారిక వెబ్‌సైట్‌లో సూచించింది. ‘ఇది ఒక పాఠం కావాలి. ప్రపంచ దేశాలు అత్యవసర సేవలు నిరంతరం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ను విస్తృతం చేయాలి. ప్రిస్క్రిప్షన్‌ పద్ధతులూ మార్చుకోవాలి’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ గాబ్రియేసస్‌ సూచించారు. ఈ వైద్య సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాము అన్ని దేశాలకు తగిన మార్గనిర్దేశం చేస్తామని, ఇందుకోసం ‘వైద్య సేవల లర్నింగ్‌ హబ్‌’ ఏర్పాటు చేస్తున్నామని, ఈ హబ్‌ ద్వారా ప్రపంచ దేశాలు తాము అవలంబిస్తున్న విధానాలను ఇతర దేశాలతో పంచుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, సర్వేను ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు నిర్వహించామని, ఇందుకోసం అన్ని దేశాల వైద్య మంత్రిత్వ శాఖల్లోని సీనియర్‌ అధికారులను సంప్రదించి వైద్యరంగంలో అవసరమైన 25 ముఖ్యమైన సేవలకు కోవిడ్‌ వల్ల కలిగిన ఇబ్బందులకు సంబంధించిన సమాచారం సేకరించామని వివరించింది.

టీకాల నుంచి టీబీ నిర్ధారణ వరకు.
డబ్ల్యూహెచ్‌వో నమూనా సర్వేలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై కరోనా ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలువెల్లడయ్యాయి. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ముంగిటే అందించే వైద్యసేవలే కాకుండా ఆసుపత్రులకు వెళ్లి పొందే సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు 90% దేశాల్లో అంతరాయం ఏర్పడింది. కేన్సర్, ఎయిడ్స్‌లాంటి వాటికి చికిత్సతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ– చికిత్స, మలేరియాలాంటి జ్వరాలకు వైద్య సేవలు, 24 గంటల అత్యవసర సేవలు, రక్త మార్పిడి, అత్యవసర శస్త్రచికిత్సలు.. ఇలా అన్ని రకాల వైద్యసేవలకు కోవిడ్‌ విఘాతం కలిగించిందని సర్వేలో తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement