సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో వైద్యపరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వరదలు తగ్గే వరకూ శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రత్యేక ఎపిడెమిక్ (అంటువ్యాధులు ప్రబలకుండా) సెంటర్లను ఏర్పాటు చేసింది. నీటికాలుష్యం ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో, 7,500 సబ్‌సెంటర్లలోనూ మందులను అందుబాటులో ఉంచారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అన్ని జిల్లాల వైద్యాధికారులకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సంబంధిత వివరాలివీ..
- ప్రసవం తేదీ సమీపంలో ఉన్న గర్భిణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే వారిని తక్షణమే ఇతర ఆస్పత్రులకు తరలింపు. ప్రభుత్వ రవాణా ద్వారానే వారిని చేర్చాలి. వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి.
- ప్రతి ప్రాథమిక, ఆరోగ్య ఉప కేంద్రాల్లో అందుబాటులో పాము కాటుకు, యాంటీ బయోటిక్స్, బ్లీచింగ్, ఓఆర్‌ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్ సహా అన్ని రకాల మందులు
- కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణ
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటికి ఏర్పాట్లు
- అంటువ్యాధులు ప్రబలకుండా పిచికారీ మందులు
- పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో జనరేటర్లు
- డయేరియా ప్రబలకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది
- వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హెల్త్ క్యాంపులు
- శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలోని వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో వైద్య బృందాలు
ఎలాంటి సమస్యలొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం..
ప్రస్తుతం వరద ప్రభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని జిల్లాలో వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశాం. మందులన్నీ సిద్ధంగా ఉంచాం. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళుతున్నాం. రానున్న రెండ్రోజులు కీలకం. ఈ సమయంలో 24 గంటలూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించాం.
- కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ
జిల్లాల వారీగా కాల్‌సెంటర్ నంబర్లు
జిల్లా | కాల్‌సెంటర్ నంబర్ |
విశాఖపట్నం | 0891-2501259 |
తూర్పుగోదావరి | 0884-2356196 |
పశ్చిమగోదావరి | 1800-2331077 |
కృష్ణా | 8309022787 |
గుంటూరు | 0863-2324014 |
వరద ప్రభావం ఇలా..
వరద ప్రభావానికి గురైన గ్రామాలు | 59 |
వరదలకు దెబ్బతిన్న ఆస్పత్రులు | 05 |
వరద ప్రభావానికి గురైన ప్రజలు | 24,855 |
పునరావాస కేంద్రాలు | 63 |
పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు | 3,529 |
మెడికల్ క్యాంపుల నిర్వహణ | 104 |
Comments
Please login to add a commentAdd a comment