సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకాయి. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఈ రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుంది.
ఈ అల్పపీడనం ఒడిశా తీరం వైపు ప్రయాణిస్తూ క్రమంగా బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు శుక్రవారానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనున్నాయి.
12వ తేదీ నాటికి రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 11 నుంచి కోస్తా తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 11 నుంచి 15వ తేదీ వరకూ మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్రలో రెండు రోజులు అనేకచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గడిచిన 24 గంటల్లో.. ఉప్పలగుప్తంలో 47 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 46, సోంపేటలో 42, డెంకాడలో 36, మచిలీపట్నంలో 35, రావులపాలెం, జియ్యమ్మవలసల్లో 34, పెదగంట్యాడలో 32, విశాఖ నగరం, అర్బన్‌లో 29, సాలూరులో 27, గంగవరంలో 26, మామిడికుదురులో 24, ఇచ్ఛాపురం, భీమిలిల్లో 21, ఓక్, గుంతకల్లుల్లో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చదవండి: YSR Bima: సర్కారే పెద్ద దిక్కు
Comments
Please login to add a commentAdd a comment