సాక్షి, అమరావతి: దేశంలో న్యుమోనియాతో జరుగుతున్న చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 70 వేలమంది మృతి చెందుతుండగా.. అందులో 17.1 శాతం న్యుమోనియాతోనే మరణిస్తున్నట్లు అంచనా. ఎన్నో వ్యాధులకు టీకాలు వచ్చినా దీనికి సంబంధించిన టీకా ఖరీదైనది కావడంతో వేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి దేశం గట్టెక్కింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ న్యుమోనియా టీకాను ‘న్యుమోసిల్’ పేరుతో ప్రవేశపెట్టింది. అన్ని పరీక్షలు పూర్తయిన ఈ వ్యాక్సిన్‌ను వారం రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం దేశానికి పరిచయం చేసింది. దీంతో చిన్నారుల మృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతూ మృతిచెందుతున్న ఘటనలు కోకొల్లలు. టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా తక్కువ ధరకు అందుబాటులోకి తేవడంతో ఇకపై దిగువ మధ్యతరగతి వారు కూడా ఈ టీకాను తమ పిల్లలకు వేయించే అవకాశం ఉంటుంది. ఈ టీకా చిన్నారుల ప్రాణరక్షణకు అండగా ఉంటుందని భావిస్తున్నారు.
న్యుమోనియాతో భారీగా నష్టం
దేశంలో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 37 మంది మృతి చెందుతున్నారు. వీరిలో 17.1 శాతం మంది మరణానికి న్యుమోనియా కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 మంది మృతిచెందుతున్నారు. వీరిలో 17 శాతం మంది న్యుమోనియా కారణంగానే చనిపోతున్నారు. వారం రోజుల కిందటే దేశానికి పరిచయమైన ఈ టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిల్ అండ్ మిలిండా గేట్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పీసీవీ (న్యుమోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) అంటారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ను న్యుమోనియా మృతులు ఎక్కువగా ఉన్న బిహార్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (17 జిల్లాల్లో), హరియాణా రాష్ట్రాల్లో వేస్తారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.250కి, ప్రైవేటు వ్యక్తులకైతే రూ.700కు ఇస్తున్నారు.
కొద్దిగా సమయం పడుతుంది
కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. రెండు మూడు నెలల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ
వ్యాక్సిన్ డోసు ఇలా
- బిడ్డ పుట్టిన 6 వారాల్లోగా తొలిడోసు.
- 14 వారాల్లోగా రెండోడోసు.
- 9 నెలల నుంచి 12 నెలల మధ్య వయసులో బూస్టర్ డోసు.
Comments
Please login to add a commentAdd a comment