న్యుమోనియా టీకా వచ్చేస్తోంది! | Pneumonia first vaccination process in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

న్యుమోనియా టీకా వచ్చేస్తోంది!

Published Sun, Aug 8 2021 4:20 AM | Last Updated on Sun, Aug 8 2021 4:20 AM

Pneumonia first vaccination process in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన న్యుమోనియా వ్యాధిని నియంత్రించే పీసీవీ (న్యూమో కాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌) టీకా ఇక మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఈ న్యుమోకాకల్‌ వ్యాక్సిన్‌ వేస్తునారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వేయనున్నారు. 2017లోనే ఇది మన దేశంలోకి వచ్చినా.. ఖరీదైనది కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రాలేదు.  ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో దీనిని ఉచితంగా వేయనున్నారు. 

తొమ్మిది నెలల్లోగా మూడు డోసులు
బిడ్డకు తొమ్మిది నెలలు వయసు వచ్చేలోగా మూడు డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల వయసులో రెండోది వేయించుకోవాలి. చివరిగా మూడో డోసు తొమ్మిది నెలల వయసులోగా వేయించుకోవాలి. మూడు డోసులు పూర్తయితే న్యుమోనియా నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఏటా 8.90 లక్షల మంది శిశువులు పుడుతున్నట్లు అంచనా. ఇప్పుడు వీళ్లందరికీ ఈ టీకా గొప్ప ఊరటనిస్తుంది.

డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్ట్‌లకు శిక్షణ
ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్‌ వేసే అవకాశం ఉంది. వివిధ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లుగానే న్యూమో కాకల్‌ వ్యాక్సిన్‌ను కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం వారం రోజులుగా మెడికల్‌ ఆఫీసర్లకు, ఏఎన్‌ఎంలకు, ఫార్మసిస్ట్‌లకు శిక్షణనిస్తున్నారు. ఈనెల 15 నాటికి శిక్షణ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత వ్యాక్సిన్‌ తేదీని ఖరారుచేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ వేస్తున్న కారణంగా ఇప్పటికే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లుచేశారు.

ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో..
నిజానికి.. శిశు మరణాల్లో ప్రీమెచ్యూర్‌ లేదా బరువు తక్కువగా ఉన్న చిన్నారుల సంఖ్య  ఎక్కువ. మొత్తం మృతుల్లో 29.8 శాతం వీళ్లే. ఆ తర్వాత రాష్ట్రంలో మృతిచెందుతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు న్యుమోనియాతో మృత్యువాత పడుతున్నారు. వీరి శాతం 17.1. చిన్నారుల మృతికి రెండో అతిపెద్ద కారణం ఇదే.తిక డయేరియా కారణంగా 8.6 శాతం మంది మృతిచెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తుండగా, పీసీవీ వ్యాక్సిన్‌తో అది 12కు పెరుగుతుంది. 

సీఎం చేతుల మీదుగా శ్రీకారం
వ్యాక్సిన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యాక్సిన్‌ ఎలా వేయాలో శిక్షణనిచ్చాం. త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం మేరకు తేదీని ఖరారుచేసి ఆయన చేతుల మీదుగా వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తాం. న్యుమోనియా నుంచి కాపాడే గొప్ప వ్యాధి నిరోధక టీకా ఇది.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement