న్యూమోకాకల్ వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా చిన్నారిని లాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన న్యూమోనియా వ్యాధి నిరోధానికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మొదలైంది. బుధవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి అన్ని జిల్లాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలన్నిటిలోనూ ఈ వ్యాక్సిన్ లభ్యమవుతుంది. ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు న్యూమోనియా నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణనిస్తుంది.
పీసీవీ (న్యూమోకాకల్ వ్యాక్సిన్) పేరుతో ఇచ్చే ఈ టీకా..నెలన్నర వయసులో మొదటి డోసు, మూడున్నర మాసాల్లో రెండో డోసు, తొమ్మిది నెలలు పూర్తయ్యే లోపు మూడో డోసు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 17 శాతం మంది శిశువులు న్యూమోనియాతోనే మృతి చెందుతున్నారు. కేంద్రం ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు పంపించగా.. తాజాగా మన రాష్ట్రానికి పంపిణీ చేసింది. ఇప్పటికే 11 రకాల వ్యాధి నిరోధక టీకాలు రాష్ట్రంలో వేస్తుండగా, న్యూమోనియా వ్యాక్సిన్ 12వదిగా నమోదైంది. కాగా, ఈ ఏడాది మన ఏపీలో మొదటి డోసు 5.45 లక్షల మందికి, రెండో డోసు 4.09 లక్షల మందికి, మూడో డోసు (బూస్టర్ డోసు), 68,188 మందికి వేయనున్నారని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment