సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. వ్యాధితో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సంకల్పించింది. ప్రాథమిక దశలోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారిని జబ్బు బారిన పడకుండా చూసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందుకయ్యే నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ గతంలో సిద్ధమైనా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ఇకపై ఈ పరిస్థితులు మారాలని.. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లోనూ ఒక ఎన్‌సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజ్) క్లినిక్ నిర్వహించాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
స్క్రీనింగ్ తప్పనిసరి
► రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసేందుకు సీహెచ్‌సీలలో మౌలిక వసతుల కల్పిస్తారు.
► ఇందుకోసం 195 సీహెచ్‌సీల్లో ఒక్కొక్క ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2నుంచి 4 గంటల మధ్య ఇలాంటి వారి కోసం ఓపీ సేవలు నిర్వహిస్తారు.
► దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్‌ను నియామకం. ప్రతి ఎన్‌సీడీ క్లినిక్‌లో ఒక స్టాఫ్ నర్సును కేటాయిస్తారు.
► పేషెంట్ పూర్తి వివరాలు (డేటా) సేకరిస్తారు. ఇదివరకే మధుమేహంతో బాధపడుతున్న వారిని మరింత మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తారు. వీరికి మూత్ర పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, ఫండోస్కొపీ వంటివి చేస్తారు.
పక్కాగా డేటా మేనేజ్‌మెంట్
► రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల చిట్టా పక్కాగా ఉండాలి. దీనికోసం ప్రత్యేక పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహణకు చర్యలు చేపడతారు.
► పాత రోగులు, కొత్తగా వచ్చే వారికోసం రెండు రకాల రిజిస్ట్రీలు నిర్వహిస్తారు. ఏ రోజుకారోజు ఈ డేటాను యాప్ ద్వారా పోర్టల్‌లో నమోదు చేస్తారు.
► ప్రతినెలా జిల్లా ఎన్‌సీడీ సెల్ ఈ నివేదిక సమర్పిస్తుంది. త్వరలోనే సీహెచ్‌సీలలో ఎన్‌సీడీ క్లినిక్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి
► మధుమేహం ఒక్కటే కాకుండా క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి సారిస్తారు. ప్రధానంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు.
► ఈ పరీక్షలను మహిళా మెడికల్ ఆఫీసర్ నిర్వహిస్తారు. క్యాన్సర్ లక్షణాలుంటే బోధనాస్పత్రులకు లేదా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.
► టీబీ లక్షణాలున్నాయని అనుమానం ఉంటే ట్రూనాట్ లేదా సీబీనాట్ మెషిన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ఉందని తేలితే చికిత్స నిమిత్తం బోధనాస్పత్రులకు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment