cesarean delivery
-
తొలిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..
మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే... అదే మహిళకు రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదు. రెండోసారి నార్మల్ డెలివరీకి అవకాశం ఉందా లేక సిజేరియనే అవసరమా అనే అంశం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నో నెలలో చేశారు వంటివి. ఎందుకు... అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే... మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉందనుకుందాం. కానీ... ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ తప్పనిసరి కాకపోవచ్చు. మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే మార్గంలో సాఫీగా వెళ్లే అవకాశం లేదనీ, తత్ఫలితంగా మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే మామూలు డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం సిజేరియన్ తప్పదు. తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు, ఆమె బిడ్డ బయటకు వచ్చే దారి అయిన ‘పెల్విక్ బోనీ క్యావిటీ’ సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివారిలో చాలాసార్లు సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు. ఈ అంశాలను బట్టి మనకు తెలిసేదేమంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... తల్లి ప్రాణానికీ ప్రమాదం. చదవండి: Fashion: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! Cancer Awareness: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే.. -
కారణం లేకుండా ‘కోత’ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్లో ఇచ్చిన పేపర్లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు. -
కరోనాను జయించిన పసిమొగ్గ
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని కోవిడ్ (జెమ్స్) ఆసుపత్రిలో కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోశారు. పసికందుకు నెగిటివ్ రావడంతో తల్లితోపాటు వైద్య సిబ్బంది అంతా ఆనందం వ్యక్తం చేశారు. రేగిడి ఆమదాలవలస కందిత గ్రామానికి చెందిన మహిళ ఇటీవల హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి చేరుకుంది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ఆమె రాగానే వలంటీర్లు మెడికల్ అధికారికి ఫిర్యాదు చేయగా ప్రథమ దశలో హోం క్వారంటైన్లో కొన్ని రోజులు ఉంచారు. స్వాబ్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా ఈనెల 7న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో గైనికాలజిస్ట్ డాక్టర్ శిరీష ఆమెకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడబిడ్డను కన్నది. పుట్టిన బిడ్డకు కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పాజిటివ్ బాధితురాలికి దగ్గరుండి వైద్య సేవలందించి, ఎలాంటి సంకోచం లేకుండా ఆమెకు ఆపరేషన్ చేసినందుకు డాక్టర్ శిరీష, ఎనస్తీíÙయా వైద్యులు హర్ష, చిన్నపిల్లల డాక్టర్ రామ్‌తోపాటు నర్సులు, టెక్నీషియన్లను అందరూ అభినందించారు. చదవండి: ఎంత పనిచేశావమ్మా..! -
అమ్మలకు...అక్కడ ‘కడుపుకోతే’..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కడుపు కోయనిదే వైద్యులు ప్రసవాలు చేయడంలేదు. అవసరమున్నా లేకున్నా సిజేరియన్ చేస్తూ బిడ్డను బయటకు తీస్తున్నారు. తద్వారా అనేకమంది డాక్టర్లు డబ్బులు గుంజుతున్నారు. ఈ పరిస్థితి ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధికంగా జరుగుతుండటం గమనార్హం. సాధారణ ప్రసవాలైతే పది వేల లోపు తీసుకుంటారు. అదే సిజేరియన్ అయితే రూ. 30 వేల నుంచి ఆసుపత్రి స్థాయిని బట్టి రూ. లక్ష వసూలు చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రసవాలపై ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం తాజాగా ఒక త్రైమాసిక నివేదికను రూపొందించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలో ఎన్ని ప్రసవాలు జరిగాయి... అందులో ఎన్ని సిజేరియన్ ద్వారా అన్న వివరాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం ఈ మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా, అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్ ద్వారానే జరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అత్యధికం సిజేరియన్... సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ మూడు నెలల కాలంలో జరిగిన ప్రసవాల్లో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లే కావడం గమనార్హం. ఆ రెండు జిల్లాల్లో 83 శాతం వంతున సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. సూర్యాపేట జిల్లాలో ఈ మూడు నెలల్లో 1,841 ప్రసవాలు జరగ్గా, అందులో ఏకంగా 1,520 ప్రసవాలు సిజేరేయన్ ద్వారానే జరగడం శోచనీయం. అలాగే మహబూబాబాద్ జిల్లాల్లో 1,241 ప్రసవాలు జరగ్గా, అందులో 1,029 సిజేరియన్ ద్వారానే అని తేలింది. అలాగే కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లోనూ 81 శాతం సిజేరియన్ ద్వారానే జరిగాయి. కరీంనగర్ జిల్లాలో గత మూడు నెలల్లో 3,817 ప్రసవాలు చేయగా, అందులో 3,108 సిజేరియన్ ద్వారానే జరిగాయి. అలాగే నిర్మల్ జిల్లాలో 2,845 ప్రసవాల్లో 2,304 ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయని నివేదిక తెలిపింది. అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో ఈ కాలంలో 1,187 ప్రసవాలు జరగ్గా, అందులో కేవలం 264 మాత్రమే సిజేరియన్ ద్వారా జరిగాయి. అంటే కేవలం 22 శాతమే కావడం విశేషం. జోగుళాంబ జిల్లాలో 30 శాతం మాత్రమే సిజేరియన్ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఈ మూడు నెలల్లో 24,495 ప్రసవాలు జరగ్గా, అందులో 13,250 ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. అంటే 54 శాతం సిజేరియన్ ద్వారానే ప్రసవాలు నిర్వహించారు. తగ్గుతున్న ఆడ శిశువుల జననం... ఈ మూడు నెలల కాలంలో 1,03,827 మంది శిశువులు పుట్టగా, అందులో మగ శిశువులు 54,434మంది కాగా, ఆడ శిశువులు 50,546 మంది పుట్టారు. అంటే 52 శాతం మగశిశువులు, 48 శాతం ఆడ శిశువులు జన్మించినట్లు నిర్ధారించారు. అంటే ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 929 మంది ఆడ శిశువులు పుట్టినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 980 మంది ఆడ శిశువులు జన్మించారు. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 849 మాత్రమే ఆడ బిడ్డలు జన్మించారు. మొత్తం ప్రసవాల్లో 59 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 41 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగాయి. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అమ్మలకు ‘కోత’వేదన
సాక్షి, అమరావతి: నాటు వైద్యం చేసే మంత్రసాని స్థానంలో నీటుగా తెల్లకోటు వేసుకునే మంత్రగాళ్లు వచ్చారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ కన్నతల్లులకు కడుపులు కోసేస్తున్నారు. సాధారణంగా చేయాల్సిన ప్రసవాన్ని కూడా సిజర్స్‌తో చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పాపాయి పుట్టిన ఆనందం కంటే ఆ ఆస్పత్రి వేసే బిల్లుతో ఆ కుటుంబం భయపడుతున్న దుస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే చాలు బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు పోయిందనో లేదా మరో కారణమో చెప్పి పదినిముషాల్లో కడుపు కోయడం, బిడ్డను తీయడం డాక్టర్ల వంతయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా విస్మయం వ్యక్తం చేసింది. దురదృష్టంఏంటంటే దేశంలోనే అత్యధిక కోత ప్రసవాలు తెలుగురాష్ట్రాల్లోనే జరగడం. ఇక్కడ జరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ప్రపంచంలో మరేదేశంలో జరగడం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాలను భారీ వ్యాపారంగా వైద్యులు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం సిజేరియన్ ప్రసవాల ద్వారా జరుగుతున్నట్టు అంచనా. తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్లు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాబున్నిసా డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సిజేరియన్ చెయ్యాలని, లేకపోతే కష్టమని డాక్టర్లు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి రూ. 55 వేలు చెల్లించి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని భయపెట్టి డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ప్రసవాల తీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రతి వంద మందిలో 58 మందికి కోతల ద్వారానే ప్రసవం జరుగుతోంది. దీనివల్ల బిడ్డకంటే తల్లి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి ప్రసవాలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీలో 40.1 శాతం సిజేరియన్ ప్రసవాలే అవుతున్నాయి. ఈ సిజేరియన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిజేరియన్ ప్రసవాల ద్వారా ఏటా రూ. 4 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. రెండు రాష్ట్రాల్లో ఏటా ఆరున్నర లక్షల ప్రసవాలు జరుగుతుండగా, సగటున ఒక్కో ప్రసవానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు అయితే రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు కూడా బిల్లులు వేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ ప్రసవానికి కూడా లక్ష రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు ఎక్కడ? ప్రైవేటు ఆస్పత్రులు లేదా నర్సింగ్‌హోంలు వంటి వాటి పర్యవేక్షణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు చేయాలి. జిల్లా వైద్యాధికారులదే అమలు బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లా వైద్యాధికారి కూడా ఆస్పత్రులకు వెళ్లి సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. వేలల్లో నర్సింగ్ హోంలు ఉన్నా, ప్రసవాలు అడ్డదిడ్డంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 10 శాతానికి మించి సిజేరియన్లు జరగకూడదు. అది కూడా అత్యవసర పరిస్థితి అయినపుడే సిజేరియన్ చెయ్యాలి. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తే మాతా శిశుమరణాలను నియంత్రించడం కష్టమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మందికీ 40 శిశు మరణాలు సంభవిస్తుండగా, తెలంగాణలో 37 శిశు మరణాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లక్షకూ 140 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. సాధారణ ప్రసవం వల్ల... - సాధారణ ప్రసవం వల్ల తల్లికి త్వరగా పాలు పడతాయి - ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. దీనివల్ల తల్లి క్షేమంగా ఉంటుంది - బిడ్డకు ఇమ్యూనిటీ (వ్యాధినిరోధకత) ఎక్కువగా ఉంటుంది - సాధారణ ప్రసవంలో రక్తస్రావం తక్కువ.. దీనివల్ల తల్లి త్వరగా కోలుకుంటుంది - ప్రసవానంతరం ఎక్కువగా మందులు వాడవలసిన అవసరం ఉండదు సిజేరియన్ ప్రసవం వల్ల.. - సిజేరియన్ వల్ల తల్లికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది - రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది - బిడ్డకు స్తన్యమివ్వడానికి అప్పటికప్పుడు పాలు పడవు - సిజేరియన్ కాన్పు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితీ ఉంటుంది - తల్లికీ, బిడ్డకూ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది - తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండోదీ సిజేరియన్ చేయాలి - రెండు ఆపరేషన్ల వల్ల తల్లికి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి - సిజేరియన్ వల్ల ప్లాస్ (మాయ) ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్ల తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రమాదం కలుగుతోంది గర్భిణి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి గర్భిణికి రక్తపోటు, మధుమేహం వంటి ఇబ్బందులు లేనపుడు సాధారణ ప్రసవం మంచిది. అలాంటి ఇబ్బందులు ఉన్నపుడు సిజేరియన్ ప్రసవం తప్పదు. సాధారణ ప్రసవమా, సిజేరియన్ ప్రసవమా అన్నది పూర్తిగా గర్భిణి ఆరోగ్యం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంతేగానీ గర్భిణి రాగానే సిజేరియన్ చేయడం మంచిది కాదు. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప సాధారణ ప్రసవమే సురక్షితం తల్లికీ బిడ్డకూ సాధారణ ప్రసవం అన్ని విధాలా సురక్షితం. కానీ చాలా చోట్ల డాక్టర్లు డబ్బు కోసం, వేచియుండే ఓపిక లేకపోవడం వల్ల సిజేరియన్ చేస్తున్నారు. ఎక్కువ మాతా మరణాలు సిజేరియన్ వల్లే జరుగుతున్నాయి. తొలికాన్పులో సిజేరియన్ సరిగా చెయ్యకపోవడం వల్ల రెండో కాన్పులో ఇబ్బంది పడుతున్నవారున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ల పోకడ ప్రమాదకరంగా మారింది. – డా.కె.రాజ్యలక్ష్మి, ప్రొఫెసర్, ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్, హైదరాబాద్ -
వ్యాయామంతో సిజేరియన్‌కు చెక్!
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. ఓ మోస్తరు స్థాయిలో వ్యాయామం చేయడం ద్వారా సిజేరియన్ కాన్పులు నివారించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 12 వేల మంది గర్భిణులపై చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు క్యూన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. గర్భిణులు వ్యాయామం చేయకూ డదని, దానివల్ల కడుపులో బిడ్డకు ఇబ్బంది కలిగే అవకాశముందనడం అపోహ మాత్రమేనని షకీలా తంగరత్తినం అనే శాస్త్రవేత్త తేల్చిచెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వల్ల కీడు ఏ మాత్రం జరగదని తమ అధ్యయనం స్పష్టం చేస్తోందని చెప్పారు. ఈ రెండు పనులతో గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం రాకుండా నివారించడమే కాకుండా.. సిజేరియన్ కాన్పును కూడా నివారించవచ్చని వివరించారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా గర్భిణులు బరువు పెరగడం కొంచెం తగ్గిందని.. మధుమేహం వచ్చే అవకాశం 24 శాతం వరకూ తక్కువైందని తెలిపారు. -
తగ్గిన శిశుమరణాల రేటు
57 నుంచి 41 శాతానికి దిగివచ్చిన ఐఎంఆర్ • దేశంలో మెరుగైన లింగనిష్పత్తి • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: గత పదేళ్లలో శిశుమరణాల రేటు(ఐఎంఆర్) దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని సర్వేలో తేలింది. 2005–06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015–16నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్ , ఒడిశాల్లో ఐఎంఆర్ సుమారు 20 శాతానికి పైగా తగ్గింది. మంగళవారం విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ ఎఫ్హెచ్ఎస్–4) ప్రకారం...జనన సమయంలో లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది. తక్కువ బరువున్న పిల్లల శాతం 7 శాతం తగ్గిందని తెలిపింది. 6–59 నెలల మధ్యనున్న పిల్లల్లో అనీమి యా 69 శాతం నుంచి 59 శాతానికి దిగివచ్చినట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సమాచారం సేకరించి ఈ సర్వే జరిపారు. ఈసారి జిల్లాలవారీగా కూడా గణాంకాలు తయారు చేశారు. అనవసర సిజేరియన్ లు వద్దు అనవసర సిజేరియన్ చికిత్సలను కట్టడిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. ప్రైవేట్ రంగంలో ఇవి ఒక్కసారిగా పెరిగాయని సర్వే సూచించిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2005–06లో(ఎన్ ఎఫ్హెచ్ఎస్–3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్రచికిత్సలు 2015–16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ రంగంలో ఇవి 2005–06లో 27.7 శాతంగా ఉండగా 2015–16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ చికిత్సలు 2015–16 కాలానికి 15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి. అవసరమైనప్పుడే సిజేరియన్ ఆపరేషన్లు చేసేలా ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించాలని రాష్ట్రాలను కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా విలేకర్లతో చెప్పారు. -
‘కత్తెర’ కాన్పులు
విచ్చలవిడిగా సిజేరియన్ వ్యాపారం • గతేడాది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 38వేల ఆపరేషన్లు • మహబూబ్‌నగర్, నారాయణపేట, కొత్తకోటలో అధికం • ప్రభుత్వాత్రుల్లో వైద్యుల కొరతే కారణం • ఆర్థికంగా నష్టపోతున్న సామాన్యులు • బలహీన పడుతున్న ఆడపడుచులు మహబూబ్‌నగర్ క్రైం : ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత.. వసతుల లేమి.. ఫ లితంగా పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తూ మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలోనే సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఉమ్మడి జిల్లాల్లో సై తం సిజేరియన్లతోపాటు గర్భసంచి తొలగింపు విచ్చలవిడిగా కొనసాగుతుండటం బాధాకరం. కాస్ట్లీ కాన్పులు ఉమ్మడి జిల్లాలో 44లక్షల జనాభా ఉంటే ఏటా 80నుంచి లక్ష వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 85 పీ హెచ్‌సీలు, 5 ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లాస్పత్రి ఉంది. సిబ్బంది కొరత, వసతుల లేమి వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు జనం మొగ్గు చూపడం లేదు. 2015–16లో ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కేవలం 15వేల ప్రసవాలు మాత్రమే జరిగాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 7,600 నుంచి 8వేల చొప్పున ఏ డాదికి జిల్లాలో 80వేల నుంచి లక్ష వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. సాధార ణ ప్రసవాలపై ఆరోగ్య సిబ్బంది మొక్కుబడి ప్రచారం చేయడం, ప్రభుత్వ వైద్యంపై అపమనమ్మకమే ప్రైవేటు కాన్పులు పెరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఆర్ఎంపీలు, పీఎంపీల కమీషన్ల కక్కుర్తి వెరసి గర్భిణిలను ప్రైవేట్ బాటపట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు వివిధ కారణాలు చూపి సిజేరియన్ల వైపుమొగ్గు చూపేలా చేస్తూ ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25నుంచి రూ.35వేల వరకు దండుకుంటున్నారు. మహిళలు శారీరకంగా ఇబ్బందులకు గురవుతారని తెలిసీ వైద్యుల కోతలకే ప్రాధాన్యమిస్తుండటం విమర్శల పాలవుతోంది. అందుకు నిదర్శనం. గత ఏడాది జిల్లాలో 82వేల కాన్పులు అయితే దీంట్లో పీహెచ్‌సీల్లో 202, ప్రభుత్వాస్పత్రుల్లో 14వేలు కాన్పులు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల ప్రసవాలయ్యాయి. రూ. కోట్లల్లో సంపాదన ఉమ్మడి జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నా యి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పుకు కనీసంగా రూ.30వేల ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో గత ఏడాది ప్రైవేట్‌లో 38వేల కాన్పులు సిజేరియన్ ద్వారా చేశారు. ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా 100కోట్ల ఆదాయం ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తోంది. సర్కార్ ఆసుపత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండకపోగా ప్రభుత్వమే రూ.1200 చెల్లిస్తోంది. చర్యలు తీసుకుంటాం పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవకాశమున్నా సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టు తేలితే నేరుగా ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ అవసరం లేకున్నా సిజేరియన్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం కోసం వస్తే చాలు వారికి సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్ కాన్పులు చేసేస్తున్నారు. ఏదో కారణం చెప్పి సిజేరియన్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ప్రైవేట్ ఆసుపత్రుల్లో 98శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది 82వేల కాన్పులు అయితే వాటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10శాతం ప్రసవాలు అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 70శాతం అవుతున్నాయి. గతేడాది జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల కాన్పులు అయితే దీంట్లో 38వేలు సిజేరియన్ ఆపరేషన్లే. ఆపరేషన్ చేస్తే మహిళలు బలహీనపడి భవిష్యత్ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిసినా ఖాతరు చేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో అయితే మహబూబ్‌నగర్‌తో పాటు కొత్తకోట, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జడ్చర్లలో కత్తెర కాన్పులే అధికం అవుతున్నాయి. -
తెలంగాణకు ‘కడుపు కోత’
♦ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న సిజేరియన్లు ♦ ప్రైవేటు ఆసుపత్రుల్లో 75 శాతం ప్రసవాలు ఇలానే ♦ ప్రజల్లో అవగాహన అవసరం: యునిసెఫ్ సాక్షి, హైదరాబాద్: దేశంలో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని యునిసెఫ్ తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆందోళనకరంగా 74.9 శాతం సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయన్న కేంద్ర సర్వే వివరాలను యునిసెఫ్ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ శాతం 40.6గా ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే చేస్తున్నారంది. తెలంగాణ తరువాత పశ్చిమబెంగాల్లో 70.9 శాతం, త్రిపురలో 73.3 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంది. ఇక ఇతర దేశాలు అమెరికాలో 33 శాతం, స్విట్జర్లాండ్‌లో 33 శాతం, చైనాలో 27 శాతం, బ్రెజిల్లో 56 శాతం, ఇథియోపియాలో 2 శాతం, జర్మనీలో 32 శాతం, ఉగాండాలో 5 శాతం, దక్షిణ సూడాన్‌లో ఒక శాతం కంటే తక్కువ, శ్రీలంకలో 31 శాతం, థాయిలాండ్‌లో 32 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని వివరించింది. యునిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘పెరుగుతున్న సిజేరియన్లు... కారణాల’పై జరిగిన రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, యునిసెఫ్ హైదరాబాద్ ప్రతినిధి సంజీవ్ ఉపాధ్యాయ, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజీవ్‌కుమార్, ప్రతినిధి హిమాంశు భూషణ్, ఫోగ్సి కార్యదర్శి శాంతకుమారి, కేంద్ర ప్రభుత్వ మాత ఆరోగ్య డిప్యూటీ కమిషనర్ దైనిష్ బస్వాల్ మాట్లాడారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు... జ్యోతి బుద్ధ ప్రకాష్ మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించి నియంత్రణకు ఎటువంటి చట్టం లేదన్నారు. గర్భిణి ఆరోగ్య, వైద్యపరంగా ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సిజేరియన్ల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. దేశంలో అవసరం లేకున్నా ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాల్లో 63 శాతం, నల్లగొండ జిల్లాలో 60 శాతం, మెదక్ జిల్లాలో 49 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ కేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వీటిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలన్నారు. ముహూర్తాలతో ప్రసవాలు... ముహూర్తాలు పెట్టి మరీ సిజేరియన్ ప్రసవాలు చేయించుకుంటున్నారని శాంతాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ కానీ, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు కానీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే సిజేరియన్లు అధికమయ్యాయన్నారు. వైద్యపరమైన న్యాయ చిక్కుల వల్ల డాక్టర్లు కూడా భయాందోళనకు గురై సిజేరియన్లనే ఎంచుకుంటున్నారన్నారు. ప్రసవాల్లో సమస్యలుంటాయని... డాక్టర్లు దేవుళ్లేమీ కారన్నారు.