ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి.
ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్‌లో ఇచ్చిన పేపర్‌లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.
ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment