అమ్మలకు...అక్కడ ‘కడుపుకోతే’..!  | 83 percent of deliveries through caesarean | Sakshi
Sakshi News home page

అమ్మలకు...అక్కడ ‘కడుపుకోతే’..! 

Published Sat, Apr 6 2019 3:03 AM | Last Updated on Sat, Apr 6 2019 3:03 AM

83 percent of deliveries through caesarean - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కడుపు కోయనిదే వైద్యులు ప్రసవాలు చేయడంలేదు. అవసరమున్నా లేకున్నా సిజేరియన్‌ చేస్తూ బిడ్డను బయటకు తీస్తున్నారు. తద్వారా అనేకమంది డాక్టర్లు డబ్బులు గుంజుతున్నారు. ఈ పరిస్థితి ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధికంగా జరుగుతుండటం గమనార్హం. సాధారణ ప్రసవాలైతే పది వేల లోపు తీసుకుంటారు. అదే సిజేరియన్‌ అయితే రూ. 30 వేల నుంచి ఆసుపత్రి స్థాయిని బట్టి రూ. లక్ష వసూలు చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రసవాలపై ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం తాజాగా ఒక త్రైమాసిక నివేదికను రూపొందించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలో ఎన్ని ప్రసవాలు జరిగాయి... అందులో ఎన్ని సిజేరియన్‌ ద్వారా అన్న వివరాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం ఈ మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా, అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్‌ ద్వారానే జరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్‌ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైతేనే సిజేరియన్‌ చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.  

అత్యధికం సిజేరియన్‌... 
సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈ మూడు నెలల కాలంలో జరిగిన ప్రసవాల్లో అత్యధికంగా సిజేరియన్‌ ఆపరేషన్లే కావడం గమనార్హం. ఆ రెండు జిల్లాల్లో 83 శాతం వంతున సిజేరియన్‌ ద్వారానే ప్రసవాలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. సూర్యాపేట జిల్లాలో ఈ మూడు నెలల్లో 1,841 ప్రసవాలు జరగ్గా, అందులో ఏకంగా 1,520 ప్రసవాలు సిజేరేయన్‌ ద్వారానే జరగడం శోచనీయం. అలాగే మహబూబాబాద్‌ జిల్లాల్లో 1,241 ప్రసవాలు జరగ్గా, అందులో 1,029 సిజేరియన్‌ ద్వారానే అని తేలింది. అలాగే కరీంనగర్, నిర్మల్‌ జిల్లాల్లోనూ 81 శాతం సిజేరియన్‌ ద్వారానే జరిగాయి. కరీంనగర్‌ జిల్లాలో గత మూడు నెలల్లో 3,817 ప్రసవాలు చేయగా, అందులో 3,108 సిజేరియన్‌ ద్వారానే జరిగాయి. అలాగే నిర్మల్‌ జిల్లాలో 2,845 ప్రసవాల్లో 2,304 ప్రసవాలు సిజేరియన్‌ ద్వారానే జరిగాయని నివేదిక తెలిపింది. అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో ఈ కాలంలో 1,187 ప్రసవాలు జరగ్గా, అందులో కేవలం 264 మాత్రమే సిజేరియన్‌ ద్వారా జరిగాయి. అంటే కేవలం 22 శాతమే కావడం విశేషం. జోగుళాంబ జిల్లాలో 30 శాతం మాత్రమే సిజేరియన్‌ అయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో ఈ మూడు నెలల్లో 24,495 ప్రసవాలు జరగ్గా, అందులో 13,250 ప్రసవాలు సిజేరియన్‌ ద్వారానే జరిగాయి. అంటే 54 శాతం సిజేరియన్‌ ద్వారానే ప్రసవాలు నిర్వహించారు.  

తగ్గుతున్న ఆడ శిశువుల జననం... 
ఈ మూడు నెలల కాలంలో 1,03,827 మంది శిశువులు పుట్టగా, అందులో మగ శిశువులు 54,434మంది కాగా, ఆడ శిశువులు 50,546 మంది పుట్టారు. అంటే 52 శాతం మగశిశువులు, 48 శాతం ఆడ శిశువులు జన్మించినట్లు నిర్ధారించారు. అంటే ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 929 మంది ఆడ శిశువులు పుట్టినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం తెలిపింది. నాగర్‌ కర్నూలు జిల్లాలో మాత్రం ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 980 మంది ఆడ శిశువులు జన్మించారు. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో ప్రతీ వెయ్యి మందికి కేవలం 849 మాత్రమే ఆడ బిడ్డలు జన్మించారు. మొత్తం ప్రసవాల్లో 59 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 41 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగాయి. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement