కడుపు కోత తగ్గించేలా! | 56 percent caesarean deliveries in private hospitals Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కడుపు కోత తగ్గించేలా!

Published Mon, Feb 20 2023 4:03 AM | Last Updated on Mon, Feb 20 2023 10:39 AM

56 percent caesarean deliveries in private hospitals Andhra Pradesh - Sakshi

రాష్ట్రలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్‌ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక  ప్రణాళిక రచించింది.  

సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌)లో 47.39 శాతంగా నమోదైంది.

హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్‌ ప్రసవాలపై ఆడిట్‌ నిర్వహించింది. 

74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 
2022–23 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నా­యి.

45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. 

కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! 
సిజేరియన్‌ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్‌ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి.  

కారణాలివీ.. 
► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం.  సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్‌ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. 

► చిన్నపాటి నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. 

► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. 

► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్‌ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement