సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది.
సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు.
వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్‌లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్‌హోమ్‌లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం.
గణాంకాలే నిదర్శనం
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది.
తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి
కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు.
ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది.
– డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment