సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కోతల ప్రసవాలు (సిజేరియన్ డెలివరీలు) ఎక్కువవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశాయి. మొత్తం ప్రసవాల్లో 10 నుంచి 15 శాతానికి మించి ఈ తరహా ప్రసవాలు జరగకూడదని, అలాంటిది 70 – 80 శాతం జరుగుతున్నాయని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక ఆడిట్ జరగాలని ఆదేశించాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది.
భారతదేశంలో దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది. ఈ ప్రసవాలకు విధిగా ఆడిట్ నిర్వహించాలని, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ప్రతి డాక్టరూ లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీనిపై త్వరలోనే ఏపీ సర్కారు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు శ్రుతిమించి పోయాయని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అభిప్రాయ పడింది. రమారమి 70 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటులో నమోదవుతున్నాయి. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లోనూ ఈ తరహా ప్రసవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సిజేరియన్ ప్రసవాలతో రిస్కే
– సిజేరియన్ ప్రసవాలతో ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే అని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాన్సెట్ లాంటి ప్రముఖ సైన్స్ పబ్లికేషన్ సంస్థలూ ఇదే అభిప్రాయాన్ని చెప్పాయి.
– అవసరం లేకపోయినా సిజేరియన్ చేసిన మహిళలకు రెండో కాన్పులో ఇబ్బందులు వస్తున్నాయి. సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన బిడ్డ కంటే సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకు శ్వాస కోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ.
– అనస్థీషియా (మత్తుమందు) ఇవ్వడం ద్వారా తల్లీ బిడ్డలు ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తల్లులకూ, చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ ద్వారా రక్తస్రావం (బ్లీడింగ్) జరిగి ఎనీమియాకు గురవుతున్నారు.
ప్రసవాలకు ఆడిట్ ముఖ్యం
– రాష్ట్ర ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ఆధారంగా వీటిని తయారు చేశారు. అవి ఇలా ఉన్నాయి.
–అన్ని సౌకర్యాలతో ఉన్న ఆస్పత్రుల్లో సిజేరియన్ రేట్లను హేతుబద్దీకరించడం.
– ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్ ప్రసవానికి గల కారణాలను రాబట్టడం.
– సిజేరియన్‌కు అవసరమైన క్లినికల్ ఆధారాలను ప్రతి ఒక్కరూ చూపించాలి.
– ఆస్పత్రి యాజమాన్యం లేదా డాక్టరు విధిగా ప్రభుత్వానికి సిజేరియన్ ప్రసవం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలి.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేసిన వైద్యులు తమ విభాగాధికారికి నివేదిక ఇవ్వడం.
– ఆడిట్ నిర్వహణ చూస్తున్న వైద్యులు విధిగా నిబంధనలు పాటించాలి.
– ప్రతి 15 రోజులకోసారి ప్రసూతి వైద్యులు, డీఎన్‌బీ వైద్యులతో ఆడిట్‌పై సమీక్ష నిర్వహించాలి. నెలకోసారి సిజేరియన్ ప్రసవాల నివేదిక (ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన) విడుదల చేసి, సమీక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment