వ్యాయామంతో సిజేరియన్‌కు చెక్!
గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. ఓ మోస్తరు స్థాయిలో వ్యాయామం చేయడం ద్వారా సిజేరియన్ కాన్పులు నివారించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 12 వేల మంది గర్భిణులపై చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు క్యూన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. గర్భిణులు వ్యాయామం చేయకూ డదని, దానివల్ల కడుపులో బిడ్డకు ఇబ్బంది కలిగే అవకాశముందనడం అపోహ మాత్రమేనని షకీలా తంగరత్తినం అనే శాస్త్రవేత్త తేల్చిచెప్పారు.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వల్ల కీడు ఏ మాత్రం జరగదని తమ అధ్యయనం స్పష్టం చేస్తోందని చెప్పారు. ఈ రెండు పనులతో గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం రాకుండా నివారించడమే కాకుండా.. సిజేరియన్ కాన్పును కూడా నివారించవచ్చని వివరించారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా గర్భిణులు బరువు పెరగడం కొంచెం తగ్గిందని.. మధుమేహం వచ్చే అవకాశం 24 శాతం వరకూ తక్కువైందని తెలిపారు.