తెలంగాణకు ‘కడుపు కోత’
♦ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న సిజేరియన్లు
♦ ప్రైవేటు ఆసుపత్రుల్లో 75 శాతం ప్రసవాలు ఇలానే
♦ ప్రజల్లో అవగాహన అవసరం: యునిసెఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యధిక ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని యునిసెఫ్ తెలిపింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆందోళనకరంగా 74.9 శాతం సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయన్న కేంద్ర సర్వే వివరాలను యునిసెఫ్ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ శాతం 40.6గా ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే చేస్తున్నారంది. తెలంగాణ తరువాత పశ్చిమబెంగాల్‌లో 70.9 శాతం, త్రిపురలో 73.3 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంది.
ఇక ఇతర దేశాలు అమెరికాలో 33 శాతం, స్విట్జర్లాండ్‌లో 33 శాతం, చైనాలో 27 శాతం, బ్రెజిల్‌లో 56 శాతం, ఇథియోపియాలో 2 శాతం, జర్మనీలో 32 శాతం, ఉగాండాలో 5 శాతం, దక్షిణ సూడాన్‌లో ఒక శాతం కంటే తక్కువ, శ్రీలంకలో 31 శాతం, థాయిలాండ్‌లో 32 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయని వివరించింది.
యునిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘పెరుగుతున్న సిజేరియన్లు... కారణాల’పై జరిగిన రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, యునిసెఫ్ హైదరాబాద్ ప్రతినిధి సంజీవ్ ఉపాధ్యాయ, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజీవ్‌కుమార్, ప్రతినిధి హిమాంశు భూషణ్, ఫోగ్సి కార్యదర్శి శాంతకుమారి, కేంద్ర ప్రభుత్వ మాత ఆరోగ్య డిప్యూటీ కమిషనర్ దైనిష్ బస్వాల్ మాట్లాడారు.
అవసరం లేకున్నా ఆపరేషన్లు...
జ్యోతి బుద్ధ ప్రకాష్ మాట్లాడుతూ సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించి నియంత్రణకు ఎటువంటి చట్టం లేదన్నారు. గర్భిణి ఆరోగ్య, వైద్యపరంగా ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సిజేరియన్ల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. దేశంలో అవసరం లేకున్నా ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాల్లో 63 శాతం, నల్లగొండ జిల్లాలో 60 శాతం, మెదక్ జిల్లాలో 49 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ కేంద్రాలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. వీటిపై ప్రజల్లోనూ అవగాహన పెరగాలన్నారు.
ముహూర్తాలతో ప్రసవాలు...
ముహూర్తాలు పెట్టి మరీ సిజేరియన్ ప్రసవాలు చేయించుకుంటున్నారని శాంతాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ కానీ, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు కానీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే సిజేరియన్‌లు అధికమయ్యాయన్నారు. వైద్యపరమైన న్యాయ చిక్కుల వల్ల డాక్టర్లు కూడా భయాందోళనకు గురై సిజేరియన్లనే ఎంచుకుంటున్నారన్నారు. ప్రసవాల్లో సమస్యలుంటాయని... డాక్టర్లు దేవుళ్లేమీ కారన్నారు.