‘కత్తెర’ కాన్పులు
విచ్చలవిడిగా సిజేరియన్ వ్యాపారం
• గతేడాది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 38వేల ఆపరేషన్లు
• మహబూబ్‌నగర్, నారాయణపేట, కొత్తకోటలో అధికం
• ప్రభుత్వాత్రుల్లో వైద్యుల కొరతే కారణం
• ఆర్థికంగా నష్టపోతున్న సామాన్యులు
• బలహీన పడుతున్న ఆడపడుచులు
మహబూబ్‌నగర్ క్రైం : ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత.. వసతుల లేమి.. ఫ లితంగా పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తూ మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలోనే సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఉమ్మడి జిల్లాల్లో సై తం సిజేరియన్లతోపాటు గర్భసంచి తొలగింపు విచ్చలవిడిగా కొనసాగుతుండటం బాధాకరం.
కాస్ట్లీ కాన్పులు
ఉమ్మడి జిల్లాలో 44లక్షల జనాభా ఉంటే ఏటా 80నుంచి లక్ష వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 85 పీ హెచ్‌సీలు, 5 ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లాస్పత్రి ఉంది. సిబ్బంది కొరత, వసతుల లేమి వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు జనం మొగ్గు చూపడం లేదు. 2015–16లో ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కేవలం 15వేల ప్రసవాలు మాత్రమే జరిగాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 7,600 నుంచి 8వేల చొప్పున ఏ డాదికి జిల్లాలో 80వేల నుంచి లక్ష వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. సాధార ణ ప్రసవాలపై ఆరోగ్య సిబ్బంది మొక్కుబడి ప్రచారం చేయడం, ప్రభుత్వ వైద్యంపై అపమనమ్మకమే ప్రైవేటు కాన్పులు పెరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు.
ఆర్‌ఎంపీలు, పీఎంపీల కమీషన్ల కక్కుర్తి వెరసి గర్భిణిలను ప్రైవేట్ బాటపట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు వివిధ కారణాలు చూపి సిజేరియన్ల వైపుమొగ్గు చూపేలా చేస్తూ ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25నుంచి రూ.35వేల వరకు దండుకుంటున్నారు. మహిళలు శారీరకంగా ఇబ్బందులకు గురవుతారని తెలిసీ వైద్యుల కోతలకే ప్రాధాన్యమిస్తుండటం విమర్శల పాలవుతోంది. అందుకు నిదర్శనం. గత ఏడాది జిల్లాలో 82వేల కాన్పులు అయితే దీంట్లో పీహెచ్‌సీల్లో 202, ప్రభుత్వాస్పత్రుల్లో 14వేలు కాన్పులు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల ప్రసవాలయ్యాయి.
రూ. కోట్లల్లో సంపాదన
ఉమ్మడి జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నా యి. అవసరం ఉన్నా లేకపోయినా శస్త్రచికిత్సలు నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. పేదలకైతే మరీ నరకం, ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక్కో కాన్పుకు కనీసంగా రూ.30వేల ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో గత ఏడాది ప్రైవేట్‌లో 38వేల కాన్పులు సిజేరియన్ ద్వారా చేశారు. ఒక్క కేసుకు రూ.30వేలు లెక్కించినా 100కోట్ల ఆదాయం ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తోంది. సర్కార్ ఆసుపత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండకపోగా ప్రభుత్వమే రూ.1200 చెల్లిస్తోంది.
చర్యలు తీసుకుంటాం
పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవకాశమున్నా సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టు తేలితే నేరుగా ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ
అవసరం లేకున్నా సిజేరియన్
ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం కోసం వస్తే చాలు వారికి సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్ కాన్పులు చేసేస్తున్నారు. ఏదో కారణం చెప్పి సిజేరియన్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత ప్రైవేట్ ఆసుపత్రుల్లో 98శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది 82వేల కాన్పులు అయితే వాటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10శాతం ప్రసవాలు అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 70శాతం అవుతున్నాయి. గతేడాది జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 69వేల కాన్పులు అయితే దీంట్లో 38వేలు సిజేరియన్ ఆపరేషన్లే. ఆపరేషన్ చేస్తే మహిళలు బలహీనపడి భవిష్యత్ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి ఉంటుందని తెలిసినా ఖాతరు చేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో అయితే మహబూబ్‌నగర్‌తో పాటు కొత్తకోట, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జడ్చర్లలో కత్తెర కాన్పులే అధికం అవుతున్నాయి.