నర్సులు కావలెను.. | Sisters And Medical Staff Shortage in Private Hospitals | Sakshi
Sakshi News home page

నర్సులు కావలెను..

Published Mon, Jul 20 2020 7:15 AM | Last Updated on Mon, Jul 20 2020 7:15 AM

Sisters And Medical Staff Shortage in Private Hospitals - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులను సైతం నర్సింగ్‌ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోవిడ్‌ కేసుల భయంతో ఇప్పటికే ఉన్నవారు చెప్పపెట్టకుండా విధులకు గైర్హాజరవుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి.. ఇక్కడి ఆస్పత్రుల్లో చేరిన నర్సులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవైపు వెంటాడుతున్న వైరస్‌ భయం.. మరోవైపు విరామం లేని విధులు.. వారిని తీవ్ర మానసిక  ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు వీరిలో చాలా మందికి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వీరి నుంచి పిల్లకు వైరస్‌ సోకుతుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము విధులకు హాజరు కాలేమని, తమ సర్టిఫికెట్లు తమకు ఇచ్చేస్తే.. సొంతూరికి వెళ్లిపోతామని చెబుతున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అంతేకాదు ఇష్టం లేకపోయినా వారితో బలవంతంగా కోవిడ్‌ వార్డుల్లో విధులు కేటాయిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మెహిదీపట్నంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఇదే అంశంపై నర్సులు ఆందోళనకు దిగడమే కాకుండా ఆస్పత్రి యాజమాన్యం తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పేర్కొంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం.

కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడి..
నగరంపై ప్రస్తుతం కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్పి పడకలు లేకపోవడం, ఉన్నవాటిలోనూ సరైన వైద్యసేవలు అందకపోవడంతో చాలామంది బాధితులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ.. కార్పొరేట్‌ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులే కాదు...కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలన్నీ కోవిడ్‌ కేసులు నిండిపోయాయి. స్పెషాలిటీ వెద్యులు రోగిని పరీక్షించి కేవలం మందులు మాత్రమే సూచిస్తారు. ఆ తర్వాత రోగి సంరక్షణ బాధ్యత అంతా ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులే చూసుకోవాలి. ఎక్కువ సమయం కోవిడ్‌ వార్డుల్లో గడపాల్సి వస్తుండటంతో వా రు త్వరగా వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో ఆ విభాగాల్లో సేవలకు ఇతర వైద్య సిబ్బంది అంతా భయçప³డుతున్నారు. ఇదే సమయంలో ఆయా నర్సులపై వారి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వహించడంతో వారి నుంచి ఇంట్లో వారికి వైరస్‌ సోకుతుందో అనే భయంతో ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు పొంచి ఉన్న వైరస్‌ ముప్పు.. మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.  

అయినా నిరాకరణే..
లాక్‌డౌన్‌ సమయంలో రోగులు లేక ఆస్పత్రులు వెలవెలబోయాయి. రోగులు రాకపోవడంతో బిల్లులు లేక నెలవారి ఖర్చులు కూడా ఆయా ఆస్పత్రులకు భారంగా మారాయి. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారడంతో చాలా ఆస్పత్రులు సిబ్బందిని తొలగించాయి. లాక్‌డౌన్‌ ప్రక్రియ ముగిసి.. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత కేసుల సంఖ్య పెరగడంతో ఆయా ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలామంది నర్సులు వైరస్‌ భయంతో ఉద్యోగాలు మానేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రుల్లో నర్సింగ్‌ స్టాఫ్‌ కొరత ఏర్పడింది. కొత్త వాళ్లను ఆకర్షించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో నెలకు రూ.17 వేల వరకు ఇవ్వగా.. ప్రస్తుతం సీనియర్‌ స్టాఫ్‌ నర్సులకు రూ.50 వేలకుపైగా వేతనం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉచిత వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. అయినా కోవిడ్‌ వార్డుల్లో పని చేసేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలోని హోటళ్లలో ఉంటున్న వారిని బయటికి వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు.  చెప్పాప్టెకుండా వెళ్లిపోతారేమో అనే భయంతో వారిపై నిరంతరం నిఘా ఉంచుతుండటం గమనార్హం.

విదేశాల్లోనూ భారీ డిమాండ్‌..
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక వైద్యుడు సహా ఐదుగురు నర్సులు అవసరం. 600 మందికి ఒక నర్సు ఉండాల్సి ఉండగా.. మన దగ్గర 400 మందికి ఒక్కరే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేల మంది అసరం కాగా.. కేవలం ఏడు వేల మందే ఉన్నారు. ఇక కార్పొరేట్‌ ఆస్పత్రుల అవసరాలు తీర్చాలంటే సుమారు లక్ష మంది నర్సులు అవసరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్‌ నర్సుల్లో 70 శాతం కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఇక్కడి వేతనాలతో పోలిస్తే విదేశాల్లో వేతనాలు భారీగా ఉండటంతో చాలా మంది బ్రిటన్, కెనడా, ఐర్లాండ్‌ వంటి విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో నగరంలోని ఆస్పత్రుల్లో నర్సింగ్‌ కొరత ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో రూ.2 లక్షల వరకు అడ్వాన్స్‌ ఇచ్చి మరీ వారిని తీసుకురావాల్సి వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement