లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. ఈ టెస్టు మస్ట్‌ | Corporate Hospitals Charge CT Scan Test From Normal Patients | Sakshi
Sakshi News home page

విషమ ‘పరీక్ష’!

Published Thu, Aug 6 2020 9:15 AM | Last Updated on Thu, Aug 6 2020 12:51 PM

Corporate Hospitals Charge CT Scan Test From Normal Patients - Sakshi

నల్లగొండ జిల్లా కట్టంగూర్‌మండలపరిధిలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆమెనుఎల్బీనగర్‌లోని ఓ కార్పొరేట్‌ఆస్పత్రికి తరలించారు. ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటిలక్షణాలు కూడా లేవు. కానీఅడ్మిషన్‌ చేయాలంటే ముందు కోవిడ్‌ నిర్ధారణ కోసం సీటీ స్కాన్‌ చేయించాలనిఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకు రూ.6500 వసూలు చేశారు. తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. 

వారం రోజుల క్రితం జనగాం సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయిన 45 ఏళ్ల వ్యక్తిని చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆర్థోపెడిక్‌ ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్‌ చేయాలంటే అంతకంటే ముందే కోవిడ్‌ నిర్ధారణకు సీటీస్కాన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆ మేరకు బంధువులు అంగీకరించి అడిగినంత చెల్లించిన తర్వాతే సీటీస్కాన్‌ చేశారు. ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఇదీ ఒక్క నల్లగొండ జిల్లాకు చెందిన వారికే కాదు... వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిఅత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది క్షతగాత్రుల నుంచి ఇదే తరహాలోవసూళ్లకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల తర్వాత రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. వర్షాలు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది పాముకాటుకు గురవుతున్నారు. అంతేకాదు దీర్ఘకాలిక లాక్‌డౌన్‌ తర్వాత ఉపాధి అవకాశాలు లేకపోవడం తో మనస్థాపంతో అనేక మంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. అనేక మంది హృద్రోగులు, కిడ్నీ, కాలేయ ఫెయిల్యూర్‌ బాధితులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే విషయంలో నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు కోవిడ్‌ నిబంధనలను బూచీగా చూపిస్తున్నాయి. నిజానికి  కోవిడ్‌ నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులను ఉచింతంగా చేస్తుంది.

ప్రైవేటులో..
ఆర్టీపీసీఆర్‌కు రూ.2200 ధర నిర్ణయించింది. నిజానికి ఆర్టీపీసీఆర్‌తో పోలీస్తే.. ర్యాపిడ్‌ టెస్టు చాలా సులువు. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చుతో రిపోర్ట్‌ వచ్చేస్తుంది. చెస్ట్‌ ఎక్సరే లో కూడా కోవిడ్‌ ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోకుండా అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న వారందరికీ కోవిడ్‌ నిర్ధారణ పేరుతో అడ్మిషన్‌కు ముందే సీటీస్కాన్‌లు సిఫార్సు చేస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి రూ.6500 నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ చేస్తుంది. బాధితుల్లో ఎవరికైనా స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే..వారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌ చికిత్సల పేరుతో రూ.10 నుంచి 15 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నారు. రోగులను నిలువు దోపిడికి గురిచేస్తున్న ఈ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటికే వెయ్యికిపైగా ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు కేవలం రెండు ఆస్పత్రులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగిలిన వాటి విషయంలో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సాధారణ చికిత్సలకు రెట్టింపు ఛార్జీలు 
మార్చికి ముందు గాంధీలో రోజుకు 200 నుంచి 250 సర్జరీలు జరిగేవి. ఉస్మానియాలో 150 నుంచి 200 సర్జరీలు జరిగేవి, కింగ్‌ కోఠిలో రోజుకు 10 నుంచి 20 చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులు కోవిడ్‌ సెంటర్లుగా మారాయి. ఉస్మానియా పాత భవనం శిధిలావస్థకు చేరుకోవడం, ఇటీవల ఆ భవనంలోని వరదనీరు చేరడంతో ఆ భవనంలోని వార్డులు సహా ఆపరేషన్‌ థియేటర్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. వార్డుల సంఖ్యను కూడా దాదాపు కుదించాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగడం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఆయా రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిజానికి కోవిడ్‌కు ముందు వరకు జాయింట్‌ రీప్లేస్‌మెంట్, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, గుండె చికిత్సలకు పలు ప్యాకేజీల కింద సర్జరీలు చేసేవి. ప్రస్తుతం కోవిడ్‌ను బూచీగా చూపించి ఆయా సర్జరీల ధరలను రెట్టింపు చేశాయి. సాధారణ చికిత్సలకు కూడా రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నాయి. విధి లేని పరిస్థితుల్లో రోగుల వారు అడిగినంత చెల్లించి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement