సామాన్యుడిపై ‘సర్జికల్‌’ స్ట్రైక్‌ | Corporate hospitals hunt on normal patients | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ‘సర్జికల్‌’ స్ట్రైక్‌

Published Mon, Feb 19 2018 3:30 AM | Last Updated on Mon, Feb 19 2018 3:30 AM

Corporate hospitals hunt on normal patients - Sakshi

సాక్షి, అమరావతి: 45 ఏళ్ల రాజేంద్రకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. హైదరాబాద్‌లోని(ప్యారడైజ్‌ సమీపంలో) ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. స్టెంట్‌ వేస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. స్టెంట్‌ వేశాక రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యాడు. స్టెంట్‌ ఖరీదు కాకుండానే రోగికి రూ.1.56 లక్షల బిల్లు వేశారు. స్టెంట్‌ ధర మరో రూ.30 వేలు అన్నారు. మొత్తం రూ.1.86 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కేవలం ఒక్క స్టెంట్‌ వేస్తే ఇంత బిల్లు ఎందుకైందని అడిగితే... అది అంతేనని డాక్టర్లు బదులిచ్చారు. 

65 ఏళ్ల రాజేశ్వరి అనారోగ్యంతో విజయవాడలోని విజేత టాకీస్‌ వద్దనున్న ఆసుపత్రికి వెళ్లింది. రోజుకొకటి చొప్పున వారం రోజులు ఇంజెక్షన్‌ వేయాలన్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ ఖరీదు రూ.6 వేలు అవుతుందన్నారు. ఆ మహిళ బంధువు ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఆ ఇంజెక్షన్‌ ధర మందుల దుకాణంలో అయితే రూ.2,500, అదే డిస్ట్రిబ్యూటర్‌ వద్ద రూ.900 అని చెప్పాడు. ఒకే మందు ధర మూడు చోట్ల మూడు రకాలుగా ఉంటుందా? అని రోగి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. 

సామాన్యుడికి జబ్బు చేసి కాదు, ఆసుపత్రిలో బిల్లు చూసి గుండె ఆగిపోతోంది. ఒక్కసారి అనారోగ్యం బారినపడి కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరితే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రాణం నిలవడం మాటేమోగానీ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లినా సామాన్యుడిపై ‘సర్జికల్‌’ స్ట్రైక్‌ జరుగుతోంది. చట్టాలు కార్పొరేట్‌ హాస్పిటళ్లకు చుట్టాలుగా మారాయి. శస్త్రచికిత్సల పేరిట విపరీతంగా దోచేస్తున్నారు. వస్తువును తయారు చేసే కంపెనీ తక్కువ ధరకే ఇస్తోంది. దాన్ని డిస్ట్రిబ్యూటర్‌ కూడా తక్కువ ధరకే కార్పొరేట్‌ ఆసుపత్రులకు అందజేస్తున్నాడు. కానీ, ఆ తక్కువ ధర సామాన్య రోగికి వర్తించడం లేదు. కార్పొరేట్‌ ఆసుపత్రులు చెప్పిందే లెక్క, వేసిందే బిల్లు. శస్త్రచికిత్సల పరికరాల రేట్లు సామాన్యులనే కాదు సంపన్నులనూ భయపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీపై ‘సాక్షి’ పరిశీలనలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

300 శాతం అధిక రేట్లు
నర్సింగ్‌ హోమ్‌లు, ప్రైవేట్‌ ఆసుత్రులు, కార్పొరేట్‌ హాస్పిటళ్లు...  పేరు ఏదైనా వీటి లక్ష్యం రోగుల దగ్గర ఉన్నదంతా ఊడ్చేయడమే. శస్త్రచికిత్స కోసం వెళితే ఎంత చార్జి పడుతుందో అంచనా ఉండదు. వాస్తవానికి సర్జికల్‌ వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అవి కార్పొరేట్‌ ఆసుపత్రులకు చేరి, రోగులకు వాడేసరికి ధర 200 నుంచి 300 రేట్లు పెరిగిపోతోంది. ఈ దందాపై ఆరోగ్య శాఖ, ఇటు ఔషధ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టడం లేదు. 

రోగికి ‘స్టెంట్‌’ లాభం సున్నా 
దేశవ్యాప్తంగా స్టెంట్ల ధరను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఏ స్టెంట్‌నైనా గరిష్టంగా రూ.30 వేలకు మించి అమ్మకూడదని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్దేశించింది. ఏడాదిన్నర కిందటే ఇది అమల్లోకి వచ్చినా ఏపీ, తెలంగాణలో ఆ ప్రభావం కనిపించడం లేదు. ధర తగించకముందు రోగికి ఒక స్టెంట్‌ వేస్తే రూ.1.70 లక్షలు ఖర్చయ్యేది. ఇందులో స్టెంట్‌ ధర రూ.70 వేలు అవుతుందని చెప్పేవారు. కానీ, ధర తగ్గించాక స్టెంట్‌ ఖర్చు రూ.30 వేలు మాత్రమే. అంటే రూ.40 వేలు తగ్గించాలి. ఏ ఆసుపత్రిలోనూ ఇది అమలు కావడం లేదు. ప్రొసీజర్‌ రేట్లు.. అంటే థియేటర్‌ చార్జీలు, నర్సింగ్‌ చార్జీలు, డాక్టర్‌ చార్జీల పేరుతో పాత రేట్లనే (రూ.1.70 లక్షలు) వసూలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. 

రేట్లు తగ్గాయి.. ప్రొసీజర్‌ ఖరీదైంది
దేశవ్యాప్తంగా స్టెంట్లు, మోకాలి చిప్పల ధరలు తగ్గించారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వీటి రేట్లు తగ్గించారు గానీ ఆపరేషన్‌ చార్జీలు, నర్సింగ్‌ చార్జీలు, డాక్టర్‌ ఫీజులు పెంచేశారు. రోగులు ఎప్పటిలాగే పాత ధరలే చెల్లించాల్సి వస్తోంది. ఎంఆర్‌పీకి మించి ఎక్కువ వసూలు చేస్తేనే తాము చర్యలు తీసుకోగలమని ఔషధ నియంత్రణ శాఖ అధికారులను చెబుతున్నారు. ఎంఆర్‌పీ మేరకే తీసుకుంటే ఏమీ చేయలేమని అంటున్నారు. బడా ఆసుపత్రులు బిల్లుల్లో స్టెంట్లకు ఎంఆర్‌పీ ధరలే వేస్తున్నాయి. 

ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల పేరిట ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 పడకలు మొదలుకుని 200 పడకల స్థాయి వరకూ 2,868 ప్రైవేట్‌ హాస్పిటళ్లు ఉన్నాయి. వీటిలో ప్రతిఏటా 3 లక్షల వరకూ మేజర్‌ సర్జరీలు జరుగుతున్నట్టు అంచనా. మరో 80 వేల నుంచి లక్ష వరకూ మైనర్‌ సర్జరీలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ ఆసుత్రుల్లో శస్త్రచికిత్స ద్వారా ఏటా రూ.10 వేల కోట్లకు పైగానే టర్నోవర్‌ జరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఒక రేటు, ఇన్సూరెన్స్‌ ఉంటే మరో రేటు, నగదు చెల్లించేవారికి ఇంకో రేటు వేస్తున్నారు. బిల్లుల విషయంలో ఒక ఆసుపత్రికి మరో ఆసుపత్రికి పొంతనే ఉండడం లేదు. 

ఎంఆర్‌పీని నియంత్రించవచ్చు కదా?  
‘‘అసలు ఎంఆర్‌పీని(గరిష్ట అమ్మకం ధర) నిర్ణయిస్తున్నది ఎవరు? ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడికి రూ.30 ఖర్చయితే, ఆ వస్తువుపై ఎంఆర్‌పీ రూ.160 అని వేస్తున్నారు. ఎంఆర్‌పీని ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది? ఎంఆర్‌పీ అనేది వస్తువును ఉత్పత్తి చేసే కంపెనీ వేస్తోందా? లేక మధ్యలో ఎవరైనా వేస్తున్నారా? ఎంఆర్‌పీ వెనుక మతలబు తేల్చాల్సింది ప్రభుత్వమే’’ 
– డా.శ్రీనివాస్, జనరల్‌ సెక్రెటరీ, ఏపీ నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ 

ఏ సేవకు ఎంత ఫీజో చెప్పాల్సిందే..
‘‘క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–2010 ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రులు తమ సేవలకు ఎంత ఫీజు వసూలు చేస్తారో బోర్డు మీద వివరాలు అందుబాటులో ఉంచాలి. ఔట్‌ పేషెంట్లకు కూడా ఏ స్పెషలిస్టు ఎంత వసూలు చేస్తున్నారో చెప్పాలి’’ 
– డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement