సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటిన్నర కంటి పరీక్షలకు చేరువైంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద 1,42,30,576 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 20.69లక్షల మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు.
ఇప్పటివరకు 10,285 గ్రామ పంచాయతీ వార్డులు, 3,221 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు మినహాయించి ప్రభుత్వ పనిదినాలకు అనుగుణంగా కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండో విడత కార్యక్రమం జూన్ 15వ తేదీ నాటికి వందరోజులు పూర్తి చేసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.
దగ్గరి చూపు సమస్యలున్న వారే ఎక్కువ
కంటివెలుగు కార్యక్రమంలో అత్యధికంగా దగ్గరి చూపు సమస్యలున్న వారే గుర్తించబడుతున్నారు. వారికి తక్షణమే రీడింగ్ అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దగ్గరి చూపు సమస్యలున్న వారిలో అత్యధికులు 40 ఏళ్ల వయసు పైబడిన వారున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు.
కాగా, 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment