
కాలం చెల్లితే.. కాసులే..
కంపెనీ ఆస్పత్రిలో మందుల దందా
► తక్కువ కాలపరిమితి, నాణ్యతలేని మెడిసిన్ కొనుగోలు
► కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు
► కార్మికుల జీవితాలతో చెలగాటం
► పట్టించుకోని సింగరేణి యాజమాన్యం
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి వ్యాప్తంగా యూజమాన్యం నిర్వహిస్తున్న డిస్పెన్సరీలలో నాణ్యత లేని మందులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఎన్ని మందులు వాడినా రోగాలు నయం కావడంలేదని కార్మికులు లబోదిబో మంటున్నారు. ఇందుకు నాణ్యత లేని నాసిరకం, తక్కువ కాలపరిమితి కలిగిన మందులే కారణమని తెలుస్తోంది. కొంతమంది సింగరేణి అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి స్థానిక డిస్ట్రిబ్యూటర్ల నుంచి లో గ్రేడ్ మందులను అదీ ఎక్స్‌పైరీ తేదీ ముగియడానికి దగ్గరగా ఉన్నవి కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 11 డిస్పెన్సరీలు ఉన్నారుు. నిత్యం వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు వివిధ ఆరోగ్య సమస్యలపై వస్తూ ఉంటారు. వారికి అవసరమైన మందుల కొనుగోలు నిమిత్తం యూజమాన్యం ప్రతి ఏడాది రూ.20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వీటన్నిటికీ కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రి నుంచే మందులు సరఫరా చేస్తుంటారు. సాధారణంగా మందుల కొనుగోళ్లకు టెండర్ విధానం(ఎల్11) అమలు చేయాల్సి ఉంటారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ఫార్మసిస్టు ఓకే చేసిన తర్వాత ఆర్డర్ ఇవ్వాలి. అరుుతే ఇక్కడ టెండర్ సిస్టం కాకుండా లోకల్ పర్చేజ్ విధానం అమలవుతోంది. చిన్నచిన్న ఫార్మా కంపెనీలకు చెందిన మందులను డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
కాసులకు కక్కుర్తి
మందులు నేరుగా కొనుగోలు చేయడానికి యాజమాన్యం కల్పించిన వెసులుబాటు(లోకల్ పర్చేజ్) కొంత మంది అవినీతిపరులకు వరంగా మారింది. మామూలుగా మందులు కనీసం ఏడాది నుంచి మూడు, నాలుగేళ్ల కాల పరిమితితో ఉంటారుు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు నాణ్యతలేని(లో గ్రేడ్) మందులను అది కూడా కేవలం ఆరునెలల కాలపరిమితి మాత్రమే మిగిలి ఉన్నవి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మందులకు డిస్ట్రిబ్యూటర్లు కమీషన్ 50 శాతం వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాటిని కొనుగోలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శాంపిల్ ఒకటి.. మెడిసిన్ మరొకటి
లో గ్రేడ్ మందుల్లో అసలు మందు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి. తొలుత శాంపిల్స్ ఒకరకం చూపిస్తారు.. సరఫరా చేసేది మరోరకం ఉంటారుు. అవి పనిచేస్తాయో.. చేయవో కూడా తెలియదు. అయినప్పటికీ సంబంధిత ఉన్నత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటినే సరఫరా చేస్తుండడంతో ఎన్ని వాడినా రోగాలు నయం కాకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని కార్మిక కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. చివరకు విసిగిపోరుు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు వల్ల ఆరు నెలల కాలంలోనే మళ్లీ మందులకు డబ్బులు వెచ్చించాల్సి రావడం కంపెనీకి సైతం ఆర్థిక భారంగా మారుతోంది.
సబ్‌స్ట్యూట్ మందులతో సమస్య
కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది మందులు వాడుతున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారు వాడే మందులు స్థానికంగా దొరకవు. వాటికి బదులు సింగరేణి ఆస్పత్రుల్లో ఇచ్చే సబ్‌స్ట్యూట్(ప్రత్యామ్నాయ) మందులు వాడితే జబ్బు నయం కాక ఇబ్బందులు పడుతున్నారు. అసలు సింగరేణి ఆస్పత్రుల్లో డాక్టర్లు మెడిసిన్ కోర్సు రాసిన తర్వాత ఫార్మాసిస్టులు మందులు ఇచ్చి పంపించేస్తారు. తిరిగి వాటిని వైద్యులకు చూపించి డోస్, నాణ్యతను తెలుసుకునే అవకాశం సైతం ఉండదు. అవి ఎలాంటివో వైద్యులు తెలుకునే పరిస్థితీ లేదు.