=కేజీహెచ్ కార్డియాలజీలో నిలిచిన ఆపరేషన్లు
=వారం రోజులుగా మూతపడ్డ క్యాథ్‌ల్యాబ్
=ఏడాదిన్నరగా మూతపడ్డ కార్డియో థొరాసిక్ విభాగం
=కాసుల కక్కుర్తిలో అధికారులు.. ప్రయివేటు ఆస్పత్రులకు పండగ
విశాఖపట్నం-మెడికల్,న్యూస్‌లైన్: పెద్దాసుపత్రి (కేజీహెచ్)కి హార్ట్ ఫెయిలయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో గుండె జబ్బుల విభాగంలోని క్యాథ్‌ల్యాబ్ వారం రోజులుగా మూలకుచేరింది. ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగే కార్డియో థొరాసిక్ విభాగం ఏడాదిన్నర క్రితమే మూతపడింది. దీంతో ఓపెన్ హార్టు సర్జరీల సమయంలో గుండెకు కృత్రిమంగా రక్తాన్ని పంప్‌చేసే హీమోథెర్మ్ యంత్రం మరమ్మతులకు లోనైంది. ఫలితంగా ప్రస్తుతం ఎటువంటి గుండె జబ్బులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అందుబాటులో లేకుండా పోయాయి.
యాంజీయోగ్రామ్, యాంజీయోప్లాస్టీ వంటి కీలక హద్రోగ చికిత్స ప్రక్రియలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో రోగులు గత్యంతరం లేక అప్పులు చేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఓపెన్ హార్టు సర్జరీలు చేయడంలో కీలకపాత్ర పోషించే పెర్‌ప్యూజినిస్టు పోస్టు పదేళ్లుగా ఖాళీగాఉంది. ఆరోగ్య శ్రీ ప్రారంభమైన 2008 నుంచి 2011 వరకూ కాంట్రాక్టు పద్దతిలో కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పెర్‌ప్యూజినిస్టుని తీసుకువచ్చి ఆసమయంలో ఆరోగ్యశ్రీ కింద 150కి పైగా ఓపెన్‌హార్టు శస్త్రచికిత్సలు ఇక్కడ నిర్వహించారు.
అప్పటినుంచి పెర్‌ప్యూజినిస్టును శాశ్వత ప్రాతిపదికన గాని కాంట్రాక్టు పద్దతినగాని నియమించి మరమ్మతుకుగురైన హీమోథెర్మ్ యంత్రాన్ని బాగుచేయించాలని అనేకపర్యాయాలు ఆస్పత్రి అధికారులను ఓపెన్ హార్టు సర్జరీ వైద్యులు విన్నవిస్తున్నా అడుగడుగునా సహాయనిరాకరనే ఎదురవుతుందని వైద్యులు వాపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో టీబీ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులకు సోకే రుగ్మతులకు చేసే ఆపరేషన్లు మాత్రమే ఇక్కడ అరకొరగా రెండేళ్లుగా సాగుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు ఓపెన్ హార్టు సర్జరీ కేసులను తరలించేందుకే ఆస్పత్రి అధికారులు మొగ్గుచూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రులు విధులించే కాసులకు కక్కుర్తిపడి ఓపెన్ హార్టు సర్జరీ విభాగాన్ని రెండేళ్లుగా మూసేశారన్న ఆరోపణలకు బలం చేకూరుకుంది.
ప్రస్తుతం మూతపడిన కార్డియాలజీ విభాగంలో వున్న క్యాథ్‌ల్యాబ్‌లో చెడిపోయిన ఉపకరణం జర్మనీ నుంచి రప్పించాల్సివుండడంతో అప్పటిలో చికిత్సలు అందే అవకాశం లేదు. పనిలో పనిగా క్యాథ్‌ల్యాబ్ వార్షిక నిర్వహణ, కాంట్రాక్టు ఒప్పందం ముగిసినందున, నిర్వహణ ఒప్పందాన్ని తిరిగి పునరుద్దరించాలని ఆస్పత్రి అధికారులు భావిస్తుండడంతో కొంతకాలం నిరుపేద హద్రోగులకు క్యాథ్‌ల్యాబ్ సేవలు అందని దాక్షగా కనిపిస్తున్నాయి. సహాయకులు లేకపోవడంతో గుండె ఆపరేషన్లు నిర్వహించే నిపుణుడికి పనిలేకుండా పోయింది.
పేద గుండె పగిలింది..
Published Sun, Jan 5 2014 1:22 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement