Andhra Pradesh: ఆరోగ్య ధీమా | Aarogyasri Raksha for poor and middle class in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆరోగ్య ధీమా

Published Tue, Mar 8 2022 3:43 AM | Last Updated on Tue, Mar 8 2022 9:17 AM

Aarogyasri Raksha for poor and middle class in Andhra Pradesh - Sakshi

పేద, మధ్యతరగతి వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆస్తులమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకునే వారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద మన వాళ్లకు ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. ఆ తర్వాతా ‘ఆరోగ్య ఆసరా పథకం’ ఆర్థికంగా భరోసా ఇస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
– సాక్షి అమరావతి

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన పి.సూరిబాబు దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు అనిల్‌ కుమార్‌ 2018లో ఇంటర్‌ పూర్తి చేశాడు.  గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌లో చేరాడు. బీటెక్‌ పూర్తయితే కుమారుడు ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు భావించారు. 2018 చివరిలో అనిల్‌కు కాళ్లు తిమ్మిరిగా ఉండటం, స్పర్శ తెలియకపోవడం, నడవడానికి ఇబ్బంది పడటం సమస్యలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. క్రమంగా అనిల్‌ నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో  పలు చోట్ల కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చూపించారు.

అప్పులు చేసి మూడేళ్లలో రూ.20 లక్షలు ఖర్చు చేశారు. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. వైద్య పరీక్షలు చేసి అనిల్‌.. ‘స్పైనల్‌ ఎపిడ్యూరల్‌ లైపోమ్యాటోసిస్‌’ వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. దీంతో ప్రస్తుతం అనిల్‌ నడవగలుగుతున్నాడు. ‘వ్యాధితో మూడేళ్లు నరకం చూశాను. చదువు ఆగిపోయింది. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఏడ్వని రోజు లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకుని ఉంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చు అయ్యేది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేసి నయం చేశారు’ అని అనిల్‌ చెప్పాడు. 

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లె గ్రామానికి చెందిన వెంకట రామయ్యదీ నిరుపేద వ్యవసాయ కుటుంబం. రామయ్య దంపతుల కుమారుడు యోగేంద్రకు ఎనిమిదేళ్లు. యోగేంద్ర ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో దగ్గరలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళితే లాభం లేదు.. గుంటూరుకు తీసుకువెళ్లమని చెప్పారు. హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.

వైద్య పరీక్షల అనంతరం యోగేంద్ర బ్రెయిన్‌ ఎన్యూరిజం రప్చర్‌ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు తేల్చారు. అరుదైన జబ్బుకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద వెంకటరామయ్య ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా  ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో గత నెలలో శస్త్ర చికిత్స చేయించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రామయ్య తనకున్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయం, కూలికి వెళితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ‘ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుని ఉండకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది’ అని రామయ్య తెలిపారు. 

పేదల పాలిట వరమే..
అనిల్‌ కుమార్, యోగేంద్రలే కాకుండా పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతూ.. సొంతంగా డబ్బు ఖర్చు చేసే స్తోమత లేక, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకునే దీన స్థితిలో ఉన్న వారి పాలిట ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ’ పథకం వరంగా మారింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే, ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తోంది. కేవలం వైద్యం అందించి వదిలేయకుండా, చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి వారి జీవన భృతి కోసం ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్‌ జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది. విశాఖ మధురవాడకు చెందిన ఎస్‌.కొండమ్మకు 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో, 2021 జనవరిలో నాలుగుసార్లు ఉచితంగా కీమో థెరఫీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.80 లక్షలు ఖర్చు చేసింది. గత ఏడాది మార్చిలో రూ.11 లక్షల ఖర్చుతో బోన్‌ మ్యారో స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. మొత్తంగా రూ.18.80 లక్షల విలువైన చికిత్సను కొండమ్మకు ఉచితంగా అందించింది.

ఈ మేలు మరచిపోలేను
నేను నిరుపేదను. నాకు గుండె వ్యాధి ఉందని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కడపలో డాక్టర్‌కు చూపిస్తే బైపాస్‌ సర్జరీ చేయాలని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే రూ.2 లక్షలు అవుతుందన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా సర్జరీ చేస్తారని ఆరోగ్య మిత్ర చెప్పారు. తెలిసిన వారి ద్వారా హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ వారు నాకు ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. ఇందుకు మన ప్రభుత్వం కేర్‌ ఆసుపత్రికి రూ.1,18,881 చెల్లించింది. నేను కోలుకుంటున్న సమయంలో ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం నా బ్యాంక్‌ ఖాతాకు రూ.9,500 జమ చేసింది. ఈ మేలు నేను మరచిపోలేను. నాలాంటి పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా పునర్జన్మ లభిస్తోంది.   
 – ఎస్‌.అజ్మతుల్లా, నకాష్‌ స్ట్రీట్, కడప, వైఎస్సార్‌ జిల్లా  

రూ.12 లక్షల ఆపరేషన్‌ ఉచితం
మా పాపకు రెండున్నరేళ్లు. పుట్టుకతో వినికిడి లోపం ఉంది. విశాఖపట్నంలోని విమ్స్‌లో వైద్య పరీక్షలు చేసి, రెండు చెవులకు ఆపరేషన్‌ చేస్తే వినికిడి లోపం పోయి పాప మాట్లాడగలుగుతుందని చెప్పారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.12 లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్‌ చేయించింది. ఆపరేషన్‌ విజయవంతం అయింది. ఈ ప్రభుత్వం మేలును జన్మలో మరవలేము. 
    – పార్వతి, మక్కువ, విజయనగరం జిల్లా  

ప్రాణం పోస్తున్న 108
జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాలవాడకు చెందిన జి.శంకర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగం నుంచి పేగులు బయటకు రావడంతో శంకర్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్‌ చేశారు. కొద్ది సేపటికి అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. అంబులెన్స్‌ టెక్నీషియన్‌.. గాయపడ్డ వ్యక్తి పేగులపై స్టెరైల్‌ డ్రెస్సింగ్‌ ప్యాడ్స్, వాటిపై నార్మల్‌ సెలైన్‌ వేసి పేగులకు సరైన తేమ శాతం ఉండేలా ప్రథమ చికిత్స చేశాడు. ఆ వెంటనే అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి బయలుదేరారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌(ఈఆర్‌సీ)లోని వైద్యుడిని సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు శంకర్‌రెడ్డికి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. సరైన సమయంలో నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయడంతో శంకర్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. వైఎస్సార్‌ జిల్లా గునకనపల్లిలో ఇటీవల ఫక్కీరప్ప అనే వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతగా తట్టిలేపినా ఉలుకు.. పలుకు లేదు. శరీరం చల్లబడింది. ఇక ఫక్కీరప్ప లేవరని భావించారు. చుట్టుపక్కల వాళ్లు ఎవరో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్‌ అక్కడికి చేరుకుంది. సిబ్బంది అతడ్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. చికిత్స అందిస్తూ సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఫక్కీరప్ప కోలుకున్నాడు. సకాలంలో అంబులెన్స్‌ రాకపోయి ఉంటే తాము బతికుండే వాళ్లం కాదని శంకర్‌రెడ్డి, ఫక్కీరప్పలు కొనియాడుతున్నారు. 108 తమకు పునర్జన్మ ఇచ్చిందని చెబుతున్నారు. 


మండలానికి ఒకటి..
శంకర్‌ రెడ్డి, ఫక్కీరప్ప తరహాలో అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న లక్షల మందికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. గతంలో జనాభాకు అనుగుణంగా ఉండేవి కాదు. 2020 జూలై నుంచి మండలానికో 108 అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 14:48 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19:20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 22:21 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుంటున్నాయి. 2,54,111 మంది కరోనా బాధితులు 108లో ఉచితంగా రవాణా సేవలు పొందారు. గతంలో 1,19,595 మందికి ఒకటి చొప్పున 440 అంబులెన్స్‌లు ఉండేవి. వీటి స్థానంలో 532 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌(బీఎల్‌ఎస్‌), 190 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌(ఏఎల్‌ఎస్‌), 26 నవజాత శిశువుల అంబులెన్స్‌లు 19 కలిపి మొత్తంగా 748 అంబులెన్స్‌ సేవలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 2,753 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.   

108కు కోటి దండాలు
మాది గంట్యాడ మండలం పెదవేమలి. మా అల్లుడు శ్రీనివాస్‌కు గంట్యాడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్‌ అయింది. బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో అతని కాలు విరిగిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మాట్లాడలేని స్థితిలో ఉండగా 108 ద్వారా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. త్వరగా తీసుకొచ్చినందునే బతికించగలిగామని వైద్యులు చెప్పారు. 108 అంబులెన్స్‌కు కోటి దండాలు.      
– గేడు సన్యాసమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా 

పునర్జన్మనిచ్చారు
గర్భిణినైన నాకు గత ఏడాది నవంబర్‌ 13న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. మా కుటుంబీకులు నన్ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపు తప్పటంతో అదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేసారు. అప్పుడు వాహనాలు అందుబాటులో లేవు. 108కు సమాచారం ఇవ్వగానే పది నిమిషాల్లో వచ్చింది. మార్గంమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. ఆముదాలవలస చేరే సరికి నేను స్పృహ కోల్పోయాను. అంబులెన్స్‌ సిబ్బందే సుఖ ప్రసవం చేయించారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. 11 గంటలకు మమ్మల్ని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి చేర్చారు. నా బిడ్డకు ఆయుష్షు పోసి, నాకు పునర్జన్మనిచ్చారు. 
    – కండాపు హేమలత, సంకిలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement