సాక్షి, గుంటూరు: వైద్య రంగంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
‘‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించాం గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేం క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారు.’’ అని విడదల రజిని గుర్తు చేశారు.
‘‘పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. చంద్రబాబు మనస్సులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఆరోగ్యశ్రీలో రూ. 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్‌లో పరిధి కేవలం ఐదు లక్షలే. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం మూడు వందలు కోట్లు మాత్రమే ఇస్తున్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదనే ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా అందించాం. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేంటో సీఎం వెల్లడించాలి’’ అని విడదల రజిని డిమాండ్ చేశారు.
‘‘మొదటి విడతలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో ఐదు కాలేజ్ లు ప్రారంభించేందుకు మా హాయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హాయాంలో తీసుకొచ్చాం. మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతగానో ఈ విధానం ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment