పేరు మార్పుతో పేదలకు తిప్పలు
ఆరోగ్యశ్రీ’లో టీడీపీ మార్పు, చేర్పులు
అవసరమైన పత్రాల ముద్రణలో జాప్యం
సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్న అధికారులు
సకాలంలో చికిత్స అందక రోగుల అగచాట్లు
కాకినాడ క్రైం : నిరుపేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సను అందుబాటులోకి తెచ్చి, పునర్జన్మను ప్రసాదిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం ‘పేరు మార్పు’ ప్రక్రియతో సకాలంలో ఆదుకోవడం లేదు. పథకం పేరు మార్చాలని నిర్ణయించిన సర్కారు అవసరమైన పత్రాలు ముద్రించక పోవడంతో కొందరికి చికిత్సలో జా ప్యం తప్పడం లేదు.పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఏర్పాటు చేసిన రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ 1.80 లక్షల మంది రూ.428 కోట్లు వ్యయమయ్యే వైద్యసేవలు అందుకున్నారు. కాగా ఆరోగ్య శ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు, లోగో మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందించే పత్రాలను ముద్రించడం మానివేశారు.
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
తెల్ల రేషన్ కార్డు లేని వారికి, రచ్చబండలో రేషన్ కార్డు పొందిన వారికి, నవజాత శిశువులకు, తాత్కాలిక రేషన్ కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేసేందుకు కలెక్టరేట్‌లో ఆరోగ్య శ్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయానికి రోజూ సుమారు 10 మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే నెల రోజుల నుంచి పత్రాలు లేకపోవడంతో వారిని వెనక్కి పంపివేస్తున్నారు. దీంతో అత్యవసరమైన వారు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. పది రోజులు మాత్రమే అర్హత ఉండే అనుమతి పత్రం జారీపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఇంకా పత్రాలు రాలేదంటున్నారని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు సత్వరం వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
రెండు రోజుల్లో రావచ్చు..
ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులంటూ సర్టిఫికెట్ ఇచ్చే పత్రాలు లేకపోవడం తో జారీ చేయడం లేదని ఆ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్నాం జనేయులు చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లామని, రెండు రోజుల్లో పత్రాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. అయితే రోగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాస్పత్రిలో చేర్చి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని, అత్యవసరమైన వారికి జీజీహెచ్‌లోని సీఎంసీఓ కార్యాలయం ద్వారా సర్టిఫికెట్ అందజేసే ఏర్పాటు చేశామని చెప్పారు.