
అర్బన్ ‘హెల్’ సెంటర్లు
లేస‘మాత్ర’మైనా అందని వైద్యం షుగర్, బీపీ మాత్రలు లభించక రోగుల అవస్థ కానరాని ప్లూయిడ్స్ డ్రెస్సింగ్ మెటీరియల్
నిడదవోలు : విరోచనాలు, వాంతులు, జ్వరం వంటి తదితర రోగాలతో పట్టణ ఆరోగ్య కేంద్రాల(అర్బన్ హెల్త్ సెంటర్లు)కు మీరు పరుగుతీశారా!.. అంతే వేగంతో వెనక్కి వచ్చేస్తారు. ఇక ప్రమాదాల్లో గాయాలపాలైన వారిని అక్కడికి తీసుకెళ్తే కనీస ప్రాథమిక చికిత్స అందక విలవిల్లాడిపోతారు. కనీసం అక్కడ డ్రెసింగ్ చేసే దిక్కు కూడా కనిపించక నరకం అనుభవిస్తారు. ఎందుకంటే అక్కడ సెలైన్లు(ఐవీ ప్లూయిడ్స్, ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ మెటీరియల్, షుగర్ పరీక్ష చేసే కిట్‌లు.. అంతెందుకు కనీసంలో కనీసం జ్వరానికి వాడే పారాసిట్మాల్ మాత్రలు కూడా దొరకవు. ఇదీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో పరిస్థితి. -నిడదవోలు
హెల్త్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యాలివీ..
జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థలో 7, భీమవరంలో మూడు, తాడేపల్లిగూడెంలో మూడు, నరసాపురంలో రెండు, పాల కొల్లు, నిడదడవోలు, కొవ్వూరు, తణుకు మునిసిపాలీటి పరిధిలో ఒక్కొక్కటి చొప్పున అర్బన్ హెల్త్ సెంటర్‌లున్నాయి. పట్టణ శివారులలో వెనుకబడిన ప్రాంతాలు (స్లమ్ ఏరియా) లలో ఎస్సీ, ఎస్టీ, నివాస ప్రాంతాలలో పేదలకు సత్వర వైద్యమందించేందుకు ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్‌లు పనిచేస్తున్నాయి.
అయితే రోగాలతో ఆవస్థలు పడుతూ హెల్త్ సెంటర్‌లకు వస్తున్న రోగులకు మందు బిళ్లలు లేకపోవడంతో నానా ఆవస్థలు పడుతున్నారు. ప్రతి కేంద్రంలో షుగర్ పరీక్షలకు అవసరమైన షుగర్ పరీక్షా యంత్రం లేకపోవడంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రయివేట్ లేబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వేసవిలో వడదెబ్బకు గురైన వారికి అందించాల్సిన సెలెన్స్ (ఐవి ఫ్లూయిడ్స్)కూడా లేవు. నిడదవోలు పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌తో పాటు జిల్లాలోని ప్రతి సెంటర్లో ఇదే దుస్థితి నెలకొంది.