కార్పొరేట్‌ ఆస్పత్రుల ‘కరోనా కాటు’ | Corona Crisis: India Should Regulate Private Health Care | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ఆస్పత్రుల ‘కరోనా కాటు’

Published Mon, Sep 21 2020 4:48 PM | Last Updated on Mon, Sep 21 2020 5:59 PM

Corona Crisis: India Should Regulate Private Health Care - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన ప్రజలను పట్ట పగటి దొంగల్లా పలు ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయంటూ సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వార్తలు వెల్లువెతున్న విషయం తెల్సిందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ఇప్పటికీ వాటి ముక్కుకు తాడేయలేక పోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్న వారు. సరైన మార్గదర్శకాల కోసం ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌’ కూడా తన వంతు ధర్మంగా రిట్‌ పిటిషన్లో భాగస్వామిగా చేరింది.

కరోనా వైరస్‌ మహమ్మారి మానవాళిపై విరచుకుపడకు ముందు నుంచే దేశంలోని పలు ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు చికిత్స పేరిట దోచుకుంటున్నాయి. మందులు, ఇంజెక్షన్లపై కార్పొరేట్‌ ఆస్పత్రులు 1700 శాతం లాభాలు చూసుకుంటున్నట్లు ‘నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ’ గతంలో ఓ నివేదికలో కూడా వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూ కరోనా మహమ్మారి సంక్షోభం నాటికి తారా స్థాయికి చేరుకుంది. నేడు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో బిల్లుల్లో ఎక్కడా పారదర్శకత అనేది లేకుండా పోయింది. మాస్క్‌లు, గ్లౌజులు లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ)ను ఓ రోగికి ఎన్ని సరఫరా చేశారో, వాటి ధర ఎంతో పేర్కొనకుండా వీటికి లెవీ చార్జీలు రోజుకు అంటూ పది నుంచి పదిహేను వేల రూపాయల చార్జీలను వసూలు చేస్తున్నాయి.

రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చార్జీలు, వ్యర్థ వైద్య పరికరాల తరలింపు, ఆస్పత్రి అడ్మిషన్, రోగి వైద్య చరిత్ర అంచనా, వైద్య పరికరాల వినియోగ, ముందు జాగ్రత్త, పార్కింగ్‌ చార్జీల పేరిట ఒక్కో రోగి నుంచి లక్షల రూపాయలు కార్పొరేట్‌ ఆస్పత్రులు పిండుతున్నాయని దేశంలోని మూడు నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రలు బిల్లులను పరిశీలించిన ‘ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌’ సుప్రీం కోర్టు పిటిషన్‌లో పేర్కొంది. (కరోనా లక్షణాలు లేనివారిలో‌.. వెరీ డేంజర్‌!)

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా రోగులపై వారి అనుమతి లేకుండా ‘ఫేవిపిరావిర్, హెచ్‌సీక్యూ, టోసిలిజుమాబ్, లోపినవిర్‌ ప్లస్‌ రిటోనవిర్, రెమిడిసివిర్‌ లాంటి మందులను ప్రయోగిస్తున్నట్లు కూడా ఏఐడీఏఎన్‌ ఆరోపించింది. కరోనా చికిత్సకు ఆస్పత్రులు వేస్తున్న చార్జీలు, బిల్లులు ఏకపక్షంగానే కాకుండా అహేతుకంగా ఉంటుండంతో వైద్య బీమా కంపెనీలు కూడా రోగుల బిల్లులను చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు పాక్షికంగానే బిల్లులను చెల్లిస్తున్నాయి. వ్యక్తిగత రక్షణ పరికరాలు రోగికి అవసరం లేదని, రోగి నుంచి ఆస్పత్రి సిబ్బందికి అంటురోగాలు అంటుకోకుండా వినియోగించడానికంటూ వాటి చార్జీలను పూర్తిగా చెల్లించేందుకు నిరాకరిస్తూ వచ్చిన కంపెనీలు, ఇప్పుడు పది, హేను వేల బిల్లులకు ఒకటి, రెండు వేల రూపాయలను చెల్లిస్తున్నాయి.

ఎలాంటి పారదర్శకత లేకుండా కార్పొరేట్‌ ఆస్పత్రులు తమ ఇష్టానుసారం రోగులపై అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నాయని, వైద్య బీమాలేని రోగులకంటే బీమా ఉన్న రోగులపై వాటి వడ్డింపులు ఎక్కువగా ఉంటున్నాయని ‘జనరల్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌’ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వైద్యానికి వేర్వేరు చార్జీలను నిర్దేశించడమే కాకుండా వైద్య బీమా విషయంలో విభిన్న వైఖరులను అవలంభించడం కూడా కార్పోరేట్‌ ఆస్పత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీల నుంచి వైద్య బీమా వినియోగదారులను మినహాయించగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యానికి చార్జీలను నిర్దేశిస్తూ జూన్‌ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులో వైద్య బీమా వినియోగదారులను మినహాయించ లేదు. అయినప్పటికీ అక్కడి కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ వైద్య బీమా ఉన్న ప్రజలను ప్రభుత్వ చార్జీల నుంచి ఏకపక్షంగా మినహాయించాయి.

ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీలను అమలు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్‌ అధికారులతో కమిటీలు వేసి తనిఖీలు చేయిస్తుండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం అధికార కమిటీలు అధిక చార్జీలను వసూలు చేసిన కార్పోరేట్‌ ఆస్పత్రుల నుంచి వాటిని వసూలు చేసి రోగులకు ఇప్పించాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ ఆఫ్‌ ఇండియా, హెల్త్‌కేర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ సంస్థలు కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చార్జీలను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల లాబీ వల్ల, వాటి దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకరాలేక పోతున్నాయి. ఉన్న చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయలేక పోతున్నాయి. ఫిక్కీలాంటి సంస్థల్లో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల ప్రాతినిథ్యం బలంగా ఉండడంతో క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కార్పొరేట్‌ ఆస్పత్రుల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వాటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.  (‘క‌రోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement