సాక్షి, హైదరాబాద్: కరోనా బాధిత రోగులకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయి. వైరస్ సోకినా..ఏ లక్షణాలు లేకుండా హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఆన్‌లైన్ కన్సల్టేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి ఒక్కో ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు..కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులను చేర్చుకోలేని పరిస్థితి.. ఈ క్రమంలో బాధితులు ఆస్పత్రికి రానవసరం లేకుండా, వైద్యులే వారింటికెళ్లి సేవలందించే అవకాశాన్ని నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చాయి.
ఇందుకోసం బాధితులకు ప్రత్యేక గది, ఆండ్రాయిడ్ ఫోన్, దానికి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆన్‌లైన్‌లో రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. తగిన మందులు సూచిస్తూ, వాటిని తమ సిబ్బంది ద్వారా నేరుగా రోగి ఇంటికే పంపిస్తారు. వీటితో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నట్లు ప్రకటించాయి. కొన్ని ఆస్పత్రులు 14 రోజులకు రూ.14,000 ప్యాకేజీగా నిర్ణయిస్తే.. మరికొన్ని రూ.19,500 వరకు ధరలు నిర్ణయించాయి.
ఆ ఫీజులతో పోలిస్తే ఈ ప్యాకేజీలే ఉత్తమం!
కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల ఫీజును ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకుంటే రూ.2,200, ఆస్పత్రి సిబ్బంది బాధితుని ఇంటికెళ్లి శాంపిల్ సేకరించి టెస్టుచేస్తే రూ.2,800గా నిర్ణయించింది. పాజిటివ్ వచ్చిన వారు ఆస్పత్రిలో చేరితే.. సాధారణ ఐసోలేషన్ వార్డు చికిత్సకు రోజుకు రూ.4,000, వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చికిత్సకు రూ.7,500, వెంటిలేటర్‌తో చికిత్సకు రూ.9,000 నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ప్యాకేజీలో రక్త, మూత్ర, యాంటీ హెచ్‌సీవీ, హెపటైటిస్, సీరం క్రియాటినైన్, ఈసీజీ, మందులు, గుండె పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, వైద్యుల ఫీజు, బెడ్ చార్జీ, ఆహారం వంటివి వర్తిస్తాయి. ఈ ధరలు గిట్టుబాటు కావంటూ ఆయా కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్సలను నిరాకరిస్తున్నాయి. దీనికంటే హోం క్వారంటైన్‌లో ఉండి, ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు పొందడమే ఉత్తమమని, చార్జీలు కూడా తక్కువేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇంటికే కార్పొ‘రేట్’ వైద్యం
Published Tue, Jun 30 2020 5:53 AM | Last Updated on Tue, Jun 30 2020 5:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment