
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కోవడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేస్తున్నారు. గడచిన 50 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,440 నమూనాలను పరీక్షించగా.. కేవలం 130 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన పాజిటివ్ రేటు 0.42 శాతంగా ఉంది.
విలేజ్ క్లినిక్‌లలోనే పరీక్షలు
గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలోనే ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 10 టెస్టింగ్ కిట్స్‌ను వైద్య శాఖ అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 29 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. వేరి యంట్‌ల గుట్టురట్టు చేసే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సౌకర్యం కూడా మన వద్ద ఉంది.
34 వేల ఆక్సిజన్ బెడ్స్ రెడీ
కరోనా కేసులు ఎక్కువగా నమోదైనా ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రుల్లో బెడ్స్ నిరంతరం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,292 జనరల్ బెడ్స్, 34,763 ఆక్సిజన్, 8,594 ఐసీయూ, 1,092 పీడియాట్రిక్ ఐసీయూ, 54 వేల క్వారంటైన్ పడకలు ఉన్నాయి. దీంతోపాటు 5,813 వెంటిలేటర్‌లు, 5,610 పీడియాట్రిక్, 297 నియోనటల్ వెంటిలేటర్‌లు సిద్ధంగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆక్సిజన్ సరఫరాకు ఎటువంటి కొరత లేదు. 170 పీఎస్‌ఏ ప్లాంట్‌లు, డీ–టైప్ ఆక్సిజన్ సిలిండర్‌లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్ ద్వారా ఆస్పత్రుల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అందించేలా వసతులు ఉన్నాయి.
18 ఏళ్లు పైబడిన వారికీ రెండు డోసులు పూర్తి
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రి య పూర్తయింది. మరోవైపు హెల్త్‌కేర్ వర్కర్‌లకు 100 శాతం, ఫ్రంట్‌లైన్ వర్కర్‌లలో 93 శాతం మందికి, 60 ఏళ్లు పైబడిన జనా భాలో 73 శాతం, 18 నుంచి 59 ఏళ్ల వారిలో 33 శాతం మందికి ప్రికాషన్ డోసు కూడా అందింది. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలందరికీ మొదటి డోసు పూర్తవగా, మొదటి డోసు వేసుకున్న 15 నుంచి 17 ఏళ్ల వారికి 99.7 శాతం, 12 నుంచి 14 ఏళ్ల వారిలో 98.17 శాతం మందికి రెండో డోసు కూడా వేశారు.
ఆందోళన అవసరం లేదు
కరోనా వ్యాప్తిపై వార్తలను చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. కావాల్సిన వైద్య సదుపాయాలు, టెస్టింగ్, క్వారంటైన్ వసతులు మన దగ్గర మెరుగ్గా ఉన్నాయి. క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి ఇలా వరుసగా సెలవు దినాలు, పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే చాలు.
–జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
Comments
Please login to add a commentAdd a comment