ప్రభుత్వాసుపత్రులకు కోటి ‘స్టెరాయిడ్స్‌’ | One Crore Steroids To Government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రులకు కోటి ‘స్టెరాయిడ్స్‌’

Published Wed, Aug 5 2020 5:58 AM | Last Updated on Wed, Aug 5 2020 5:58 AM

One Crore Steroids To Government hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కోటి డెక్సామితాజోన్‌ స్టెరాయిడ్‌ ఔషధాలను పంపించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందులో ఇప్పటికే 40 లక్షల మాత్రలు, 6 లక్షల ఇంజెక్షన్‌ డోస్‌లను పంపించింది. కరోనా వచ్చిన రోగులు త్వరగా కోలుకునేందుకు ఈ స్టెరాయిడ్లను ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో వీటిని ఆగమేఘాల మీద తెప్పించారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కరోనా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులకు మందులను సరఫరా చేస్తున్నారు. ఇక మూడు కోట్ల డోలో పారాసిటమాల్‌ మాత్రలను అందుబాటులో ఉంచారు.

70 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలను కూడా పంపించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే 2.5 లక్షల ఫ్యాబీఫ్లూ మాత్రలను కూడా పంపించారు. ఇక అత్యంత కీలకమైన రెమిడెసివిర్‌ ఔషధాలను 6 వేలు పంపించారు. సీరియస్‌ రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వీటిని ప్రస్తుతం ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ ఔషధాలకు డిమాండ్‌ ఏర్పడింది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఏర్పడటంతో వీటిని అవసరం మేరకు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమైనప్పుడల్లా వీటికి ఇండెంట్‌ పెట్టి తెప్పించాలని భావిస్తున్నారు. 

పీహెచ్‌సీలకూ ఆక్సిజన్‌ సిలిండర్లు
ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగా కరోనా వైద్య సేవలు అందేవి. ఇప్పుడు జిల్లా కేంద్రంగా పీహెచ్‌సీ స్థాయి వరకు తీసుకెళ్లడం ద్వారా గ్రామీణ ప్రజల చెంతకే సేవలు అందజేయనున్నారు. కరోనా సామాజిక వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఇలా వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరిస్తోంది. గ్రామాల్లోకి కూడా వైరస్‌ ప్రవేశించడంతో తగిన ప్రణాళిక రచించింది. అందుకే పీహెచ్‌సీ స్థాయి ఆసుపత్రులకు కూడా కరోనా బాధితులకు అవసరాన్ని బట్టి వాడే 51 రకాల మందులను సరఫరా చేస్తారు. యాంటీబయాటిక్స్‌ సహా విటమిన్‌ మందులనూ అందుబాటులో ఉంచుతారు.

ప్రస్తుతం కొన్ని కరోనా కేసులు సీరియస్‌ అయి ఆక్సిజన్‌ అత్యవసరమైన స్థాయికి వెళుతున్నాయి. కాబట్టి గ్రామాలకు అత్యంత సమీపంలో ఉండే పీహెచ్‌సీలకూ మినీ ఆక్సిజన్‌ సిలిండర్లను పంపించనున్నారు. అవసరమైన రోగులకు ఆక్సిజన్‌ సపోర్టు అందించిన తర్వాత తక్షణమే అటువంటి రోగులను అంబులెన్స్‌లో సమీపంలోని సీహెచ్‌సీ లేదా ఏరియా ఆసుపత్రికి తరలించేలా రంగం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాన్‌ ఐసీయూ బెడ్స్‌కు కూడా ఆక్సిజన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 9,700 పడకలకు ఇలా ఆక్సిజన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే పని దాదాపు పూర్తి కావొచ్చిందని అధికారులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement