104 కేంద్రంగా వైరస్‌పై వార్‌ | AP Govt has expanded the 104 call center to provide in-house medical services | Sakshi
Sakshi News home page

104 కేంద్రంగా వైరస్‌పై వార్‌

Published Mon, Apr 26 2021 2:01 AM | Last Updated on Mon, Apr 26 2021 10:48 AM

AP Govt has expanded the 104 call center to provide in-house medical services - Sakshi

విజయవాడలోని కాల్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది

సాక్షి, అమరావతి: కనిపించని మహమ్మారి ఎటునుంచి విరుచుకుపడుతుందో అంతుబట్టని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాధితులకు ఊరట కల్పిస్తూ ఇళ్ల నుంచే వైద్య సేవలు పొందేలా 104 కాల్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఫోన్‌లోనే సూచనలు, సలహాలు, మందులు సూచించేందుకు వీలుగా పెద్ద ఎత్తున వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. కరోనా ముప్పు కారణంగా చాలాచోట్ల ఔట్‌పేషెంట్‌ సేవలు అందుబాటులో లేకపోవడం, బాధితులు బహిరంగంగా తిరగలేని పరిస్థితులు నెలకొన్న తరుణంలో 104 కాల్‌ సెంటర్‌ సేవలు ప్రస్తుతం చాలా కీలకంగా మారాయి.

కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించి తగిన ఔషధాలు తీసుకుంటే వైరస్‌ బారి నుంచి రక్షించుకునే అవకాశం ఉన్నందున కాల్‌ సెంటర్‌ సేవలకు ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు అదనంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లతోపాటు కోవిడ్‌ ఆస్పత్రుల్లో క్షణం కూడా కరెంట్‌ పోకుండా జాగ్రత్తలు, సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ధరలకు కళ్లెం, పెద్ద ఎత్తున పారిశుధ్య చర్యలతో పాటు మరో అస్త్రంగా వచ్చిన వ్యాక్సిన్లు వచ్చినట్లుగా పంపిణీ చేస్తూనే 104 కాల్‌సెంటర్‌ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 
(చదవండి: నెలన్నరలో ఉద్యోగులకు వందశాతం టీకాలు)

మూడు షిఫ్టుల్లో 300 మందికిపైగా వైద్యులు..
కోవిడ్‌ నేపథ్యంలో బాధితులకు సేవలందించేందుకు 104 కాల్‌సెంటర్‌ నిర్విరామంగా మూడు షిఫ్టుల్లో పనిచేస్తోంది. ఫోన్‌ కాల్‌ అందిన వెంటనే స్పందించేందుకు 378 మంది సిబ్బందిని నియమించారు. 300 మందికిపైగా డాక్టర్లు ఫోన్‌ ద్వారా బాధితులతో మాట్లాడి లక్షణాలను బట్టి ఎలాంటి మందులు తీసుకోవాలో సూచిస్తున్నారు. కాల్‌ సెంటర్‌లో 64 సిస్టమ్స్‌ ఇంటర్నెట్‌తో, 30 ల్యాండ్‌ లైనులు అందుబాటులోకి తెచ్చారు. కాల్స్‌ చేసేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 160 లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు పది జిల్లాల్లో కాల్‌ సెంటర్లపై పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించారు.

104 కాల్‌ సెంటర్‌కు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 22 వరకు 15,638 కాల్స్‌ రాగా కోవిడ్‌ టెస్టులకు 8,927 మందిని పంపారు. 527 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. 120 అంబులెన్సులు ప్రత్యేకంగా కోవిడ్‌ బాధితుల కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ‘104 కాల్‌ సెంటర్‌ సమర్థంగా పని చేస్తూ ప్రతి కాల్‌కు స్పందించాలి. ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలి. ఫోన్‌ చేస్తే తమకు సాయం చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి కోవిడ్‌ కిట్లతోపాటు 108లో బాధితుల తరలింపును మూడు గంటల్లోగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి’ అని ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. 

మరో రెండు ఆక్సిజన్‌ యూనిట్లకు అనుమతి..
రాష్ట్రంలో వైద్య అవసరాలను తీర్చి ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా మరో రెండు మెడికల్‌ ఆక్సిజన్‌ యూనిట్లకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు ఆటోనగర్‌లోని సావర్జిన్‌ ఆక్సిజన్, అనంతపురం జిల్లా శింగనమల మండలం చక్రాయిపేటలోని లైఫ్‌ ఆక్సిజన్‌ యూనిట్లు వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు అనుమతిస్తూ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ మీసాల బాలు రాజేంద్రప్రసాద్‌ ఆదివారం లైసెన్స్‌లు జారీ చేశారు.

కోవిడ్‌ ఆస్పత్రులకు నిరంతర విద్యుత్‌
కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రంలోని కోవిడ్‌ సెంటర్లు, ఆసుపత్రులకు ఒక్క క్షణం కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా చూడాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి సిబ్బందికి సూచించారు. కరోనా కష్టకాలంలో సైనికుల్లా పనిచేయాలని విద్యుత్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై ఇంధనశాఖ కార్యదర్శి సమీక్ష వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అవసరమైతే వలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.

రాష్ట్రంలో 4,000 వెంటిలేటర్లు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో నమోదైనవి 500 ఆస్పత్రులు ఉండగా వీటిని కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నారు. ఈ ఆస్పత్రులన్నింటికీ ఎలాంటి అవాంతరాల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 39 శాతం గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఉన్నందున అక్కడ ఆస్పత్రులకు విద్యుత్‌ సరఫరాపై డిస్కం సీఎండీ స్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఆసుపత్రుల నుంచి ఎలాంటి అభ్యర్థన వచ్చినా తక్షణమే పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏ ఉద్యోగీ సెలవులు తీసుకోవద్దని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల్లో ఎవరైనా కోవిడ్‌ బారిన పడితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఆర్టీపీసీఆర్‌ రూ.499 మాత్రమే..
కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.499 కంటే అధికంగా వసూలు చేసే ల్యాబొరేటరీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఏ.మల్లికార్జున హెచ్చరించారు. కొత్తగా ఐసీఎంఆర్‌–ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్‌లు వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను సంప్రదించి పోర్టల్‌లో లాగిన్‌ కావాలని సూచించారు.

పరీక్షలు జరిపిన వెంటనే ఫలితాలను పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రభుత్వం అనుమతి లేకుండా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయడం చట్ట విరుద్ధమన్నారు. అనుమతి ఉన్న ల్యాబ్‌లు మాత్రమే పరీక్షలు చేయాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు ఎక్కువ వసూలు చేసినా, అనుమతి లేకుండా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించినా రిజిస్ట్రేషన్‌ రద్దుచేసి క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు.

సీటీ స్కాన్‌ పరీక్ష రూ.3 వేలు
కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు సీటీ స్కాన్‌ కోసం రూ.3 వేలకు మించి వసూలు చేయరాదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో చాలామంది సీటీ స్కాన్‌ ఆధారంగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని, దీన్ని ఆయా డయాగ్నస్టిక్‌ సెంటర్లు అవకాశంగా మలుచుకోరాదని హెచ్చరించారు. పీపీఈ కిట్‌లు, ఇతర రసాయనాలు అన్నీ కలిపి రూ.3 వేలుగా నిర్ణయించామన్నారు. సీటీ స్కాన్‌లో కరోనా లక్షణాలుంటే బాధితుల పేర్లు, ఫోన్‌ నంబర్, స్కాన్‌ చిత్రాలు అన్నీ విధిగా కోవిడ్‌–19 డ్యాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిర్ధారించిన ధర కంటే ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

విస్తృతంగా శానిటైజేషన్‌
కరోనా కట్టడికి పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంటి చుట్టూ వంద మీటర్ల పరిధిలో నిత్యం ఫాగింగ్, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలని నిర్ణయించింది. నిర్ణీత కాలం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులతోపాటు సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వాములుగా చేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో తరచూ శానిటైజేషన్‌ నిర్వహిస్తారు. రచ్చబండలతోపాటు మంచినీటి పథకాలు, బోర్లు ఉన్నచోట పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపడతారు.

హోటళ్లు, టీస్టాళ్లలో యజమానులే కరోనా జాగ్రత్తలు పాటించేలా గ్రామ పంచాయతీల ద్వారా నోటీసులు అందచేస్తారు. జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యాల నుంచి జరిమానా వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు కల్పిస్తారు. రోడ్లకిరువైపులా డ్రెయిన్లు, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలను ఎప్పటికప్పుడు పంచాయతీ పారిశుధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయిస్తారు. పట్టణ, నగర ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మున్సిపల్‌ శాఖ ప్రత్యేక సీఎస్‌ వై.శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులు సోమవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. 

56.17 లక్షల మందికి వ్యాక్సిన్‌
దేశంలోనే అత్యధికంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. ఇప్పటికే ఒకేరోజు 6 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 56,17,611 మందికి టీకా అందింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వార్డు,గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే వ్యాక్సిన్‌ అందచేసింది. ఇలా ప్రజల వద్దకే వెళ్లి టీకా ఇచ్చింది ఒక్క ఏపీలో మాత్రమే కావడం గమనార్హం. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి టీకా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్‌ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. వ్యాక్సిన్లు రాగానే శరవేగంగా టీకాలు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కాగా కేంద్రం నుంచి వ్యాక్సిన్ల సరఫరాలో జాప్యం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నా సరిపోని పరిస్థితి నెలకొంది. రష్యా తయారీ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 3 కోట్ల డోసులు ఇంకా రావాల్సి ఉంది. జూన్‌ 1 నుంచి టీకాల ఉత్పత్తి పెరగవచ్చని భావిస్తున్న నేపథ్యంలో వచ్చినవి వచ్చినట్లుగా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. 


(చదవండి: ‘టచ్‌’ చేస్తే షాకే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement